పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై ఎనిమిది మంది ఎమ్మెల్యేల విచారణను స్పీకర్ పూర్తి చేశారు. ఇక మిగిలింది ఇద్దరే ఇద్దరు. కడియం శ్రీహరి, దానం నాగేందర్‌ల విచారణ పూర్తి చేస్తే ఇక ఖేల్ ఖతం. ఈ ఇద్దరి విచారణపై ఉత్కంఠ కొనసాగుతోంది. 8మంది ఎమ్మెల్యేలపై విచారణ చేసి…తీర్పు రిజర్వ్ చేసిన స్పీకర్….మరి కడియం, దానంలపై ఎలా వ్యవహరించబోతున్నారు..? ఇదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.
బీఆర్ఎస్ అభ్యర్దులుగా గెలిచి కాంగ్రెస్‌లో చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, కాలె యాదయ్య, తెల్లం వెంకట్రావు, సంజయ్, ప్రకాశ్ గౌడ్, అరికపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లపై అనర్హత వేటు వేయాలని సుప్రీం మెట్లు ఎక్కింది బీఆర్ఎస్. ఎట్టకేలకు సుప్రీం కోర్డు ఆదేశాలతో ఇప్పటికే దానం, కడియం మినాహా మిగతా 8మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసిన స్పీకర్ తీర్పును రిజర్వ్ చేశారు. విచారణకు హాజరై వివరణ ఇవ్వడానికి గతంలో గడువు కోరిన కడియం, దానంలకు స్పీకర్ కొంత గడువు ఇచ్చినప్పటికీ తాజాగా సుప్రీ కోర్డు ఆదేశాలతో ఈనెల 23లోగా తన ముందు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు స్సీకర్ ప్రసాద్ కుమార్. కడియం, దానంలపై వేటు తప్పదని, ఈ ఇద్దరిపై కాంక్రీట్ ఎవిడెన్స్ ఉండటంతో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
దానం నాగేందర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి ఆ వెంటనే వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీచేశారు. ఇది తిరుగులేని సాక్ష్యం. ఇక కడియం శ్రీహరి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీచేసిన తన కూతురు కడియం కావ్యకు మద్దతుగా కాంగ్రెస్‌కు ఓటు వేయాలని అనేక సభల్లో ప్రసగించారు. ఇది కూడా తిరుగులేని సాక్ష్యం. ఈ సాక్ష్యాలతో బీఆర్‌ఎస్ ఫిర్యాదు చేసింది. మొత్తం ఈ ఇద్దరిపై వేటు తప్పదని భావిస్తున్న పరిస్థితుల్లో నోటీసులు జారీ కావడంతో ఈ ఇద్దరు ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది. ఇదే టైంలో కడియం శ్రీహరి ఈరోజు స్పీకర్‌ను కలిసి మరి కొంత సమయం కావాలని, గడువు ఇస్తే వివరణ ఇస్తానని లేఖ ఇచ్చారు. దీంతో స్పీకర్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
ఇక దానం నాగేందర్ ఢిల్లీ బాట పట్టారు. కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతో తాను ఏంచేయాలనే విషయంలో క్లారిటి తీసుకుని రేపో ఎల్లుండో స్పీకర్‌ను కలవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే నోటీసులు అందుకున్న దానం ఈనెల 23న అనివార్యంగా స్పీకర్ ముందు హాజరుకావలసి ఉంటుంది. అయితే కడియం మాదిరిగానే గడువు కోరుతారా? లేదా రాజీనామా చేస్తారా? అన్న దానికిపై ఉత్కంఠ కొనసాగుతోంది. దానం రాజీనామాకు కూడా వెనుకాడబోనని సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది. అమీతుమీ తేల్చుకోవడానికి దానం సిద్దపడ్డారని సమాచారం. మొత్తం మీద దానం, కడియం ఏం చేయబోతున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంటే ఆ 8మంది ఎమ్మెల్యేలపై విచారణ పూర్తి చేసి తీర్పు రిజర్వ్ చేసిన స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకబోతున్నారో చూడాలి.