సొంత జిల్లాలో పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తే.. ఆ నాయకులు ఎందుకు రాలేదు? అధికారపార్టీతో వారికి కటీఫ్ అయినట్టేనా? వారిపై పార్టీ ఆలోచన ఏంటి? సభకు దూరంగా ఉన్నవాళ్లంతా జంప్ జిలానీలేనా?
బీఆర్‌ఎస్ సభకు దూరంగా పార్టీ నేతలు
టీఆర్‌ఎస్.. బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత ఖమ్మంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ సక్సెస్ అయ్యిందని గులాబీ శ్రేణులు సంబురాల్లో ఉన్నాయి. ఇదే సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కొందరు బీఆర్‌ఎస్ నాయకులు సభకు రాకపోవడంతో.. వారి పరిస్థితి ఏంటనే చర్చ కూడా జరుగుతోంది. మాజీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గానికి చెందిన నాయకులు కనిపించకపోవడంతో.. వారంతా బీఆర్‌ఎస్‌కు కటీఫ్ చెప్పినట్టేనా అని ఆరా తీస్తున్నారు. బహిరంగ సభకు ముందు పార్టీలోని అసంతృప్త నేతలను దగ్గరకు తీసుకోవడానికి అధిష్ఠానం చేసిన ప్రయత్నాలు కొంత సఫలమైనా.. పొంగులేటి వర్గం దారికి రాకపోవడం చర్చగా మారింది.
ఆహ్వానం వెళ్లినా కోరం కనకయ్య సభకు దూరం
భద్రాచలం నుంచి ఇల్లెందు వరకు పొంగులేటి వర్గం ఒక్క మాటపై నిల్చున్నట్టు ప్రచారం జరుగుతోంది. భద్రాచలానికి చెందిన తెల్లం వెంకట్రావుకు గుండెపోటు రావడంతో హైదరాబాద్ ఆస్పత్రిలో చేరారు. పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య, దయానంద్‌తోపాటు మధిర, అశ్వారావుపేటకు చెందిన మరికొందరు బీఆర్‌ఎస్ సభకు రాలేదు. సభ కోసం నిర్వహించిన సన్నాహక సమావేశాల్లోనూ వీళ్లు కనిపించలేదు. బీఆర్‌ఎస్ నుంచి ఆహ్వానం వెళ్లినా కోరం కనకయ్య లైట్ తీసుకున్నారు.
సభకు రానివాళ్లు కండువా మార్చేస్తారా?
బీఆర్‌ఎస్ సభకు రాని నేతలంతా పార్టీకి దూరమైనట్టేనని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే కండువా మార్చేస్తారని అనుకుంటున్నారు. సభపై గానీ.. సభకు వెళ్లకపోవడంపై కానీ ఈ నాయకులు ఎవరూ స్పందించలేదు. ఫలానా కారణాల వల్ల వెళ్లలేదని లేదా సభకు రాలేకపోతున్నామని సమాచారం ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ జంప్ జిలానీలుపైనే చర్చ సాగుతోంది. అయితే ఈ వేడిలోనే పార్టీ మారతారా.. లేక మరికొంత సమయం తీసుకుంటారా అనేది ప్రశ్న. ఒకవేళ మనసు మార్చుకుని వెనక్కి వచ్చేస్తారా అనే టాక్ కూడా ఉంది. సొంత జిల్లాలో అంత పెద్ద సభ పెడితే రానివాళ్లు తిరిగి వస్తానంటే పార్టీ ఆహ్వానిస్తుందా అనేది మరో డౌట్.
పొంగులేటి శిబిరంలో ఎంత మంది ఉన్నారు?
ప్రస్తుతం పొంగులేటి శిబిరంలో ఎంత మంది ఉన్నారో అని రాజకీయ వర్గాలు ఆరా తీస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు.. ఎన్నికల్లో పోటీ చేసిన నాయకులు ఎంత మంది.. ఏ స్థాయి నాయకులు గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారో స్పష్టత రావాల్సి ఉంది. జిల్లాలో నియోజకవర్గాల వారీగా అసంతృప్త నేతలను లెక్కిస్తున్నారట. అలాగే మాజీ ఎంపీ పొంగులేటి ఏ పార్టీతో టచ్‌లో ఉన్నారనేది కూడా జిల్లాలో వాడీవేడీ చర్చగా ఉంది. ఈ పరిణామాలు రానున్న రోజుల్లో ఉమ్మడి జిల్లా రాజకీయాలను ఎలాంటి మలుపు తిప్పుతాయో చూడాలి.