Off The Record: బీజేపీ లీడర్స్ కొందరికి ఆరెస్సెస్ గేట్లు బంద్ అయ్యాయా? మీరిక మా గడప తొక్కాల్సిన అవసరం లేదని డైరెక్ట్‌గానే చెప్పేస్తున్నారా? ఏదన్నా ఉంటే… అక్కడే మాట్లాడుకోండి తప్ప ఇక్కడిదాకా రావద్దని కుండబద్దలు కొట్టేస్తున్నారా? ఏ విషయంలో సదరు బీజేపీ నాయకుల మీద సంఘ్ పెద్దలకు కోపం వచ్చింది? ఎందుకు గెటౌట్ అంటున్నారు?
Read Also: Sri Vishnu : నా సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేవు.. శ్రీవిష్ణు క్లారిటీ
ఆరెస్సెస్ పెద్దల్ని ప్రసన్నం చేసుకుంటే కమలం పార్టీలో పదవులు చాలా ఈజీగా వస్తాయన్న ప్రచారం ఎప్పట్నుంచో ఉంది. అదే అభిప్రాయంతో…బీజేపీ లీడర్స్ చాలామంది సంఘ్ ఆఫీసులకు క్యూ కడుతుంటారు కూడా. అయితే… ఇటీవలి కాలంలో ఇది మరీ శృతిమించిపోయిందని, నిన్నగాక మొన్న పార్టీ వేరే పార్టీలనుంచి బీజేపీలోకి మారిన వాళ్ళు కూడా మాకు పదవులు అంటూ తలుపు తడుతుండటం ఆర్‌ఎస్‌ఎస్ నేతలకు చిరాకు తెప్పిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణ నుంచి ఈ ఉధృతి పెరిగిపోవడంతో… నో ఎంట్రీ బోర్డ్ పెట్టేసినట్టు తెలుస్తోంది. ఇక నుంచి పార్టీ పదవులకు పైరవీల కోసం వచ్చేవారికి ఆరెస్సెస్ ఆఫీస్ గేట్లు మూసేయాలని గట్టి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. బీజేపీలో సంస్థాగత ఎన్నికలు జరుగు తున్నాయి. తెలంగాణ అధ్యక్ష ఎన్నిక పెండింగ్‌లో ఉంది. అది పూర్తయ్యాక రాష్ర్ట కమిటీ నియామకం ఉంటుంది. అనుబంధ కమిటీల్ని వేస్తారు. ఈ క్రమంలో… గతం కన్నా పార్టీ విస్తరించి ఉన్నందున ఈససారి పదవులకు బాగా డిమాండ్ పెరిగిందట. అందుకే ఇప్పటి నుంచే పైరవీలు మొదలుపెట్టినట్టు చెప్పుకుంటున్నారు. ఎవరికి వారు పార్టీ స్టేట్ కమిటీలో ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని పైరవీలు మొదలుపెట్టినట్టు సమాచారం.
Read Also: Off The Record: మావోయిస్టులతో చర్చలు.. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం అంగీకరిస్తుందా..?
ఇక, అందులో భాగంగానే…. కొందరు ఆరెస్సెస్ పెద్దల్ని కలిసే ప్రయత్నం చేస్తున్నారట. అందులోనూ… కొత్తగా చేరిన వారి తాకిడి ఎక్కువైనట్టు తెలుస్తోంది. సంఘ్ వాళ్ళని కలిస్తే నీకు పదవి పక్కా అని ఎవరో ఒకరు చెప్పడం…. సరేనని తలూపుకుంటూ వెళ్ళి కలవడం పరిపాటి అయిందట. సంఘ్ వైపు నుండి బీజేపీ వ్యవహారాలు చూసే వారికి ఇదో తలనొప్పిగా మారిందని అంటున్నారు. ఆరెస్సెస్ వివిధ క్షేత్రాల్లో పనిచేసి బీజేపీలోకి వెళ్ళినవారు రెగ్యులర్‌గా పెద్దలను కలిసి వివిధ అంశాలపై చర్చిస్తుంటారు. కానీ… ఈ మధ్య మాత్రం పార్టీ పదవుల కోసం కలిసే వారి సంఖ్య పెరిగిపోవడం చికాకు తెప్పిస్తోందట. సాధారణంగా బీజేపీ రోజువారీ రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోదు ఆరెస్సెస్. కానీ… ఆ విషయం తెలియని కొత్త నేతలు తరచూ సంఘ్ పెద్దల్ని కలిసి బీజేపీ పదవుల కోసం అడుగుతుండటంతో… ఇక మీకు నో ఎంట్రీ అని చెప్పేసినట్టు సమాచారం. ఆరెస్సెస్‌లోని ఓ కీలక నేత అయితే…… ఏదన్నా ఉంటే మీ పార్టీ పెద్దలతోనే మాట్లాడుకోండి పొండని స్ట్రాంగ్‌గానే చెప్పేసినట్టు సమాచారం. దీని గురించే ఇప్పుడు బీజేపీ లీడర్స్ మధ్య గట్టి చర్చ జరుగుతోందట. సంఘ్ పెద్దల ఆశీర్వాదం ఉంటే చాలు….పార్టీ పదవి పక్కా అన్న ప్రచారానికి ఇక ఫుల్‌స్టాప్ పెట్టేయాలని డిసైడయ్యారట. మొత్తంగా ఈ వ్యవహారం ఇప్పుడు కమలం శ్రేణుల్లో హాట్ టాపిక్ అయింది.