Off The Record: మావోయిస్టులతో చర్చల అంశంలో కీలక పాత్ర పోషించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందా? గత అనుభవాన్ని ఉపయోగించుకోవాలని అనుకుంటోందా? కానీ…. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రతిపాదనల్ని కేంద్రంలోని బీజేపీ సర్కార్ అంగీకరిస్తుందా? ఇప్పటికే దూకుడు మీదున్న కేంద్ర బలగాలు వెనక్కి తగ్గుతాయా? ఆ విషయంలో జరుగుతున్న చర్చ ఏంటి?
Read Also: Pahalgam Terror Attack: జిప్‌లైన్ ఆపరేటర్ మూడుసార్లు అల్లాహు అక్బర్ అన్నాడు.. ఆపై కాల్పులు
తెలంగాణ ప్రభుత్వం మావోయిస్టులతో చర్చల అంశాన్ని లీడ్ చేయాలని చూస్తోందా..? కేంద్రం ఇప్పటికే ఏరివేతలో బిజీగా ఉంటే… కాంగ్రెస్ ఇప్పుడు చర్చల మాట ఎందుకు మాట్లాడుతోంది? టార్గెట్ పెట్టి మరీ… కేంద్ర బలగాలు మావోయిస్టులను ఏరిపారేస్తున్న క్రమంలో తెలంగాణ ప్రభుత్వ మాటలు చెవికెక్కుతాయా? కేంద్రం తగ్గుతుందా..? గత అనుభవం అధిష్ఠానం పరిశీలనలో ఉందా..? ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ నేతల మెదళ్ళను తొలుస్తున్న ప్రశ్నలివి. ప్రస్తుతం కర్రె గుట్టల్లో యుద్ధ వాతావరణం ఉంది. మావోయిస్ట్‌లను కేంద్ర బలగాలు చుట్టుముట్టాయి. కూంబింగ్, ఎన్‌కౌంటర్స్ జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు ఎంత పెద్ద వార్త బయటకు వస్తుందోనని అంతా అలర్ట్‌గా ఉన్న పరిస్థితి. ఈ స్థితిలో సీఎం రేవంత్‌తో భేటీ అయ్యింది పీస్ కమిటీ. ముఖ్యమంత్రి కూడా… ప్రభుత్వం మావోయిస్టు సమస్యను శాంతి భద్రతల అంశంగా చూడటంలేదు.. సామాజిక సమస్యగానే చూస్తోందని చెప్పారు. దీనిపై కేంద్రానికి లేఖ రాసే అంశాన్ని కూడా చర్చిస్తామని హామీ ఇచ్చారాయన. పీస్ కమిటీకి ఇచ్చిన మాట ప్రకారం… కాంగ్రెస్ సీనియర్ జానారెడ్డితో భేటీ అయ్యారు సీఎం. గతంలో మావోయిస్టులతో చర్చలు జరిగినప్పుడు హోంమంత్రిగా ఉన్నారు జానారెడ్డి. మరో సీనియర్ లీడర్ కేకే పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. దీంతో వారిద్దరితో.. జానారెడ్డి నివాసంలో భేటీ అయ్యారు రేవంత్. జానా అనుభవాలు పరిగణనలోకి తీసుకున్నారు.
Read Also: High Court: గ్రూప్-1 పిటిషనర్లకు జరిమానా విధించిన హైకోర్టు..
అయితే, మావోయిస్టుల అంశంలో… ప్రభుత్వం కంటే…పార్టీ పరంగా విధాన నిర్ణయం తీసుకోవాలి. దీంట్లో భాగంగా… పీస్ కమిటీ నుండి వచ్చిన ప్రతిపాదనలను అధిష్టానానికి పంపాలని నిర్ణయించారు. ఆ తర్వాత ప్రభుత్వం లేఖ రాసే అంశం పై క్లారిటీ వస్తుందట. గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో చర్చలకు అప్పటి కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ అధిష్టానంను ఒప్పించారు. ఇప్పుడు కూడా దిగ్విజయ్ సింగ్ తో కూడా మాట్లాడాలని జానారెడ్డి, కేకే కి.. సీఎం రేవంత్ సూచించారట. ఇంత వరకు బాగానే ఉంది కానీ.. ఈ విషయంలో కేంద్రం సానుకూలంగా ఉంటుందా..? అన్నది మెయిన్ క్వశ్చన్. నాడు చర్చలు జరిగినప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పని తేలికైందని, ఇప్పుడున్న బీజేపీ సర్కార్…. రాష్ట్రం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పంపే ప్రతిపాదనల్ని అంగీకరిస్తుందా? అన్నది అనుమానమేనంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే దూకుడు మీదున్న సెంట్రల్ గవర్నమెంట్ పెద్దలకు చర్చలు జరిపే ఉద్దేశమే కనిపించడం లేదంటున్నారు. తెలంగాణలో మావోయిస్టుల ప్రభావం తగ్గిందిగానీ… పొరుగున ఉన్న ఛత్తీస్ ఘడ్ నుండి వలసలు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి… తెలంగాణలో కూడా మావోయిస్టు ఏరివేతపై ఫోకస్ చేసింది కేంద్రం. రాష్ట్ర ప్రభుత్వం ఐతే… సానుకూలంగా చర్చలు జరపాలి అనే వత్తిడిని పెంచాలని ఆలోచనకు ఐతే వచ్చినట్టు తెలుస్తుంది. తర్వాత ఏం జరుగుతుంది అనేది చూడాలంటున్నారు పరిశీలకులు.