తెలంగాణలో మంత్రుల పేరు చెప్పి పేషీల సిబ్బంది సెటిల్ మెంట్స్ చేసేస్తున్నారా? పరిస్థితి అదుపు తప్పుతున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం పసిగట్టిందా? అందుకే ఎక్స్‌ట్రా నిఘా పెట్టిందా? ఎక్కడెక్కడ అలాంటి నిఘా కొనసాగుతోంది? ఏ రూపంలో ఉంది? తెలంగాణ సచివాలయంలో ఇప్పుడో సరికొత్త వాతావరణం కనిపిస్తోందట. నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు సమాచారం సేకరించడం సాధారణమే అయినా… ఇప్పుడు అంతకు మించి అన్నట్టుగా ఇంటెలిజెన్స్ సిబ్బంది డేగకళ్ళతో దేని కోసమో వెదుకుతున్నట్టు అనిపిస్తోందంటున్నారు. మరీ ముఖ్యంగా మంత్రుల పేషీల విషయంలో స్పెషల్ అటెన్షన్ ఉన్నట్టు తెలుస్తోంది. కొందరు మంత్రుల పేషీల్లో ఇటీవల జరిగిన కొన్ని వ్యవహారాలతో ప్రభుత్వ పెద్దలు అప్రమత్తం అయినట్టు చెప్పుకుంటున్నారు. వాస్తవానికి సెక్రటేరియట్‌లోని మంత్రుల పేషీలకు వివిధ పనుల కోసం నిత్యం వందలాది మంది సందర్శకులు వచ్చి వెళ్తుంటారు. మామూలుగా వచ్చి వెళ్ళడం, పనులు చేయడం వేరుగానీ… మినిస్టర్స్ దగ్గర వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఆఫీసర్స్ సాధారణ పనికి బదులుగా సెటిల్‌మెంట్స్ మీదే ఎక్కువ దృష్టి పెట్టారని, అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతున్నట్టు నిఘా నివేదికలు అందాయట. దీంతో… మంత్రుల నివాసాలు, అధికారిక బంగ్లాలు, పేషీలతో పాటు ఇతర ప్రైవేట్ ఆఫీసుల్లో పని చేసే అధికారులు, ఉద్యోగుల వివరాలు సేకరించడం మొదలైందట.
కొందరు సిబ్బంది అయితే…. శృతి మించి వ్యవహరిస్తున్నారట. మినిస్టర్ల పేర్లు చెప్పి ఆయా శాఖల్లో పీఆర్వోలు, పీఎస్, ఓఎస్డీ, పీఏలు సెటిల్ మెంట్స్ చేస్తున్నారన్న సమాచారంతో అలాంటి వాళ్ళని గుర్తించే పని మొదలైనట్టు ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా మంత్రుల పేషీల్లోని సిబ్బంది పనితీరుపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తుండటంతో ఆ దిశగా ప్రభుత్వం దృష్టి సారించిందట. మంత్రులు ఆమోదించాల్సిన ఫైల్స్ ముందుగా పీఎస్, ఓఎస్డీల దగ్గరికి వెళ్తాయి. వాళ్ళు ఆ ఫైల్స్‌ను క్షుణ్ణంగా చదివి… సారాంశాన్ని మంత్రికి బ్రీఫ్ చేయాలి. ఇక్కడే తమ చాలూతనాన్ని ప్రదర్శిస్తున్నారట సిబ్బంది. ఫైల్ గురించి మంత్రికి పాజిటివ్‌గా చెబుతామని, అలా చెప్పాలంటే పెద్ద ఎత్తున డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఎవరైనా… అడిగినంత ఇవ్వకపోతే ఫైల్ మీద నెగిటివ్ రిమార్క్స్ రాయిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. దీంతో స్మూత్‌గా పని జరిగిపోవాలనుకునే ప్రతి ఒక్కరూ… పేషీ స్టాఫ్‌కు అడిగినంత ముట్టచెప్పడం ఆనవాయితీగా మారిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫైల్ ప్రాధాన్యాన్నిబట్టి…డిమాండ్ చేసినంత మొత్తం ఇవ్వకుంటే…. మంత్రి టేబుల్ మీదికి వెళ్ళకుండా తమ దగ్గరే అట్టిపెట్టుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి.
మంత్రి సంతకం కోసం వచ్చే ఒక్కో ఫైల్‌కు ఒక్కో రేటు ఫిక్స్ చేసి… అంత మొత్తంలో ఇవ్వకపోతే ముందుకు కదలకుండా అడ్డు కోవడం కొందరు పీఎస్‌లు ఓఎస్‌డీల స్టైల్ అయితే…. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో పంపాల్సి వచ్చినా… నెగెటివ్ కామెంట్స్ రాసి పంపడం కొందరి స్టైల్‌గా ప్రచారం జరుగుతోంది. దీంతో అందరు మంత్రుల పేషీల్లో పనిచేస్తోన్న స్టాఫ్ కదలికలపై ప్రస్తుతం నిఘా వర్గాలు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మంత్రులు ఎక్కువ శాతం పేషీల్లో తమ బంధువులను, తమ సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించుకోవడంతో… వాళ్ళంతా మేం పనులు ఈజీగా చేసేస్తామని చెప్పుకుంటునట్లు ప్రచారం జరుగుతోంది. అంతేగాక కొందరు పీఏలు, ఓఎస్డీలు మంత్రుల అపాయింట్మెంట్ ఇప్పించేందుకు కూడా రేటు పెట్టినట్టు సెక్రటేరియట్‌లో మాట్లాడుకుంటున్నారు. మంత్రుల కార్యాలయ ఉద్యోగులు చేసే అరాచకాల మూలంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని గ్రహించిన ప్రభుత్వం నిఘా వర్గాల నుంచి సమాచారాన్ని సేకరించి ప్రక్షాళన మొదలుపెట్టబోతున్నట్టు సమాచారం.