Off The Record: కాంగ్రెస్ పార్టీలో మాదిగ సామాజికవర్గం ఎమ్మెల్యేల తీరు కాస్త తేడాగా కనిపిస్తోందా? వాళ్ళని ఏదో శక్తి వెనక నుంచి నడిపిస్తోందా? అసలా డౌట్ ఎందుకు వస్తోంది? గతంలో లేనిది, ఇప్పుడు కొత్తగా వాళ్ళలో కనిపిస్తున్నది ఏంటి? ప్రత్యేకించి ఒక సామాజికవర్గానికి చెందిన శాసనసభ్యుల గురించే ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తోంది?
Read Also: Covid-19: ఆ కోవిడ్ రోగిని చంపేయండి.. సీనియర్ సర్జన్ ఆడియో వైరల్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై విస్తృత చర్చ జరుగుతోంది. వాళ్ళని వెనక నుంచి ఎవరో నడిపిస్తున్నారని, లేందటే.. వాళ్ళు అంత తేలిగ్గా.. మంత్రి పదవి పేరుతో ముందుకు నడిచేవాళ్ళు కాదని మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు. మంత్రి పదవుల పంపకంలో సామాజిక న్యాయం పాటించాలని కోరుకోవడంలో తప్పు లేదు. మా కులానికి ఇంకో మంత్రి పదవి కావాలని అడగడం అసలే తప్పు కాదు. కానీ, నికార్సయిన మాదిగకి మాత్రమే ఇవ్వండంటూ ఒత్తి పలకడంపైనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం మాదిగ సామాజికవర్గం నుంచి దామోదర రాజనర్సింహ కేబినెట్లో ఉన్నారు. ఆయనతో పాటు ఇంకో పదవికావాలన్నది ఆ కులానికి చెందిన ఎమ్మెల్యేల డిమాండ్. ఆ డిమాండ్ వరకు బాగానే ఉన్నా.. ఎటొచ్చీ, నికార్సయిన అన్న పదం దగ్గరే తేడా కొడుతోందట. రాజనర్సింహను ఉద్దేశించి ఆయన నికార్సయిన మాదిగ కాదంటూ ఇటీవల కామెంట్ చేశారు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్. పైగా ఇప్పుడు మా సామాజిక వర్గానికో మంత్రి పదవి అని డిమాండ్ చేస్తున్న వాళ్ళలో ముందు వరుసలో ఉన్నారు సామేల్. దీంతో మేటర్ మరింత ఆసక్తికరంగా మారి మాదిగ సామాజికవర్గం ఎమ్మెల్యేలను వెనకుండి ఏదో శక్తి నడిపిస్తోందన్న చర్చ మొదలైంది పార్టీ వర్గాల్లో.
Read Also: Sandeep Reddy : సందీప్ రెడ్డికి రామ్ చరణ్ దంపతుల స్పెషల్ సర్ ప్రైజ్..
వాస్తవంగా చూసుకుంటే.. ఎస్సీ వర్గీకరణ, సబ్ ప్లాన్ లాంటి అంశాలలో సామాజికవర్గం కోసం దామోదర చాలా చేశారని చెప్పుకుంటారు. తెలంగాణలో మాదిగ సామాజిక వర్గానికి అంతో ఇంతో న్యాయం జరిగిందంటే.. అందులో రాజనర్సింహ పాత్ర చాలా కీలకమన్న అభిప్రాయం కూడా ఉందట. ఈ పరిస్థితుల్లో ఓ ఎమ్మెల్యే ఆయన్ని నికార్సయిన మాదిగ కాదనడం, ఈసారి నికార్సయిన వాళ్ళకే ఇవ్వాలని అనడం, సీఎం రేవంత్ రెడ్డితో పాటు అధిష్టానం పెద్దలను, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసి కేబినెట్ బెర్త్ కోసం డిమాండ్ చేయడంతో వీళ్ళ రాజకీయం ఎట్నుంచి ఎటు పోతోందని మాట్లాడుకుంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. వీళ్ళ వెనక ఎవరున్నారనే చర్చ ఒకటైతే.. రెండోది పార్టీ ఎస్సీల్లో మాలల ఆధిపత్యానికి సంబంధించిన చర్చ. రాష్ట్ర ఎస్సీ జనాభాలో మెజార్టీగా ఉన్న మాదిగలకు మరో మంత్రి కావాల్సిందేనన్న వత్తిడి ఆ సామాజికవర్గం నుంచి పెరుగుతోందట. కేబినెట్ విస్తరణ ముహూర్తం దగ్గరికొచ్చిందని చెప్పుకుంటున్న టైంలో.. మన స్వరాన్ని గట్టిగా వినిపించకపోతే.. ఎవ్వరూ పట్టంచుకోరని, అందులో కాంగ్రెస్ పార్టీలో అయితే… ఇక చెప్పే పనే లేదన్న అభిప్రాయం ఉందట. అందుకే ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని చెప్పుకుంటున్నా.. వాళ్ళ వెనక మాత్రం ఏదో అదృశ్య శక్తి ఉందన్న విషయమే వేధిస్తోందట ఎక్కువ మంది పార్టీ నాయకులను. గట్టిగా అడగకుంటే.. విస్తరణలో మాల సామాజిక వర్గానికి మరో అవకాశం ఇచ్చి.. మాదిగలకు అన్యాయం చేస్తారని, అందుకే వాయిస్ పెంచాలన్న ఎత్తుగడ ఉన్నట్టు తెలుస్తోంది.
Read Also: Off The Record: ఏపీ బీజేపీ పాత ముద్ర చెరిపేయడానికి తంటాలు పడుతోందా?
ఇటీవల కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామ క్రమంలోనే ఈ వ్యూహాత్మక ఎత్తుగడ దాగి ఉండవచ్చంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న వివాదాల నుంచే ఈ కొత్త వ్యూహం తెర మీదకు వచ్చిందా..? అన్న అనుమానాలు కూడా ఉన్నాయట కాంగ్రెస్ నాయకులకు. అలాగే… ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి పదవుల రేస్ వ్యవహారం కూడా తెర వెనక ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మొత్తం మీద మాదిగ సామాజికవర్గం ఎమ్మెల్యేలు మంత్రి పదవులు అడగడం వ్యూహమే కానీ… దాని వెనక ఎవర్నో అడ్డుకోవడం, ఎవరికో కోరుకోవడంలాంటి ఎత్తుగడలు చాలానే ఉన్నాయన్నది పార్టీలో ఓపెన్ టాక్. ఫైనల్‌గా ఏం జరుగుతుందో.. చూడాలి మరి.