Off The Record: ఎక్కడైనా అధికార పార్టీ ఎమ్మెల్యేని ప్రతిపక్ష నేతలు ఇరుకున పెట్టడం కామన్. కానీ… అక్కడ మాత్రం స్వపక్షంలోనే విపక్ష తయారైందట. మా ఎమ్మెల్యే అలా చేస్తున్నాడు… ఇలా చేసేస్తున్నాడు. నియోజకవర్గంలో ఫలానా ఘోరం జరిగిపోతోందని అంటూ.. పార్టీ పెద్దలకు పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ చేరవేస్తున్నారట. ఎక్కడుందా పరిస్థితి? అలా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న ఆ టీడీపీ ఎమ్మెల్యే ఎవరు?.. ఎదురుగా వచ్చి ఢీకొట్టే వారితో పోరాడవచ్చుగానీ… పక్క నుంచి పడే పోట్లను తట్టుకోవడం అంత ఈజీ కాదని అంటారు. ప్రస్తుతం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారట. ఎందుకంటే.. ఆయనకు ప్రతిపక్షం వైసీపీ నుంచి కలిగే ఇబ్బందుల కంటే సొంత పార్టీ వారిని ఎదుర్కోవడమే పెద్ద టాస్క్ అయిందన్నది సన్నిహితుల మాట. ఇంతకీ సొంత పార్టీలో వాళ్ళు అంతలా ఎందుకు టార్గెట్ చేస్తున్నారని అంటే… బ్యాక్ గ్రౌండ్ స్టోరీ కాస్త లెంగ్తీగానే ఉంటుందని అంటున్నారు.
Read Also: Hydra : పెండింగ్ లో 10వేల ఫిర్యాదులు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రజెంటేషన్
అయితే, 2024 అసెంబ్లీ ఎన్నికలకు రెండు నెలల ముందు జరిగిన పరిణామాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు నియోజకవర్గ ప్రజలు. ఆ ఎన్నికలకు కేవలం నెలన్నర ముందు అనంతపురంలోకి అడుగుపెట్టారు ప్రస్తుత ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. అసలు ఆయనకు టికెట్ వస్తుందని అప్పట్లో ఎవరు ఊహించలేదట. అప్పటివరకు ఇన్చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పార్టీ మొత్తాన్ని తన గ్రిప్‌లో ఉంచుకున్నారు. అలాగే ఆయనను విభేదించే వారు మరో గ్రూపులో ఉండిపోయారు. చివరికి ప్రభాకర్ చౌదరిని కాదని దగ్గుపాటి ప్రసాద్‌కు టికెట్ ఇచ్చాక మొదలైంది సిసలైన రాజకీయం. దగ్గుపాటికి వద్దు, ప్రభాకర్ చౌదరి ముద్దు అంటూ…అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు టీడీపీ కార్యకర్తలు. అయినప్పటికీ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు అధిష్టానం. ఇక కూటమి వేవ్‌లో మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచేశారు దగ్గుపాటి. ఆ తర్వాతి నుంచి ఒక్కొక్కటిగా చాలా విషయాలు ఆయన్ని ఇబ్బంది పెడుతున్నాయట. మెల్లగా వాటిని అధిగమిస్తున్నా…ఎప్పటికప్పుడు శీల పరీక్షకు నిలబడాల్సి రావడం ఎమ్మెల్యేకి కష్టంగానే ఉందన్నది ఆయన సన్నిహితుల మాట. ముందు జాగ్రత్తగా కేవలం తన టీం తప్ప మరొకరిని ఏ అంశంలో కూడా వేలు పెట్టనివ్వడం లేదట ఎమ్మెల్యే. దీంతో దగ్గుపాటి ప్రసాద్ అనుచరుల హవా నడుస్తోందని, వేరే ఎవ్వర్నీ పట్టించుకోవడం లేదంటూ… పార్టీ పెద్దలకు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు వెళ్తున్నట్టు తెలుస్తోంది. మామూలుగా అయితే… ఎమ్మెల్యేని, అధికార పక్షాన్ని టార్గెట్ చేయాల్సింది ప్రతిపక్షం వైసీపీ.
Read Also: Off The Record: మింగలేక-కక్కలేక అన్నట్టుగా ముగ్గురు ఎమ్మెల్యేల పరిస్థితి?
కానీ, ఇక్కడ ఆ పార్టీ కామైపోగా…. టీడీపీ నేతలే స్వపక్షంలో విపక్షంలా వ్యవహరిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. సాధారణంగా…. సొంత పార్టీ ఎమ్మెల్యే తప్పులు చేస్తే.. నేరుగా విమర్శించేందుకు సాహసించరు ఎక్కువ మంది. దానిపై నిరసలు చేసే అవకాశం కూడా లేదు. కానీ… ప్రస్తుతం అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారు. పార్టీలో కూడా ఆయనకు గ్రిప్ ఉంది. ప్రస్తుతం టీడీపీ క్యాడర్ అంతా ఎమ్మెల్యే దగ్గుపాటి వెంట నడుస్తున్నా….. సిటీలోని ప్రతి డివిజన్‌లో ప్రభాకర్‌చౌదరికంటూ ఒక వర్గం ఉంది. వాళ్ళ ద్వారా… ఏ ఏరియాలో ఏం జరుగుతోందో…ఎప్పటికప్పుడు పిన్ టూ పిన్ సమాచారం సేకరిస్తున్నారట చౌదరి. అదే సమాచారాన్ని నేరుగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నట్టు సమాచారం. మద్యం షాపుల విషయంలో గొడవలు, కమీషన్ల కోసం బెదిరింపులు, బియ్యం అక్రమ రవాణా విషయంలో జరిగిన గొడవలు… ఇలా ప్రతి ఒక్కటీ అధిష్టానం వద్దకు చేరుతున్నట్టు చెబుతున్నారు. మరో వ్తెపు వీటి అన్నింటికీ ఎప్పటికికప్పుడు ఎమ్మెల్యే చెక్ పెడుతూ అధిష్టానానికి తనవైన నివేదికలు పంపుతున్నట్టు తెలుస్తోంది. ఇలా ఎమ్మెల్యేని నీడలా వెంటాడుతూ.. మాజీ ఎమ్మెల్యే వేస్తున్న ఎత్తుగడలకు దగ్గుపాటి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట. అయితే ఒక్కోసారి కొన్నివిషయాలు బూమరాంగ్ అవుతున్నాయని, ఎమ్మెల్యేకి కలిసొచ్చినట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. మరోవైపు దగ్గుపాటి మీద అధిష్టానానికి ఎవరెన్ని చెప్పినా.. ఉండాల్సిన చోట ఆయనకు పాజిటివ్ ఉందని అంటున్నారు ఆయన సన్నిహితులు. మొత్తం మీద ఇలా… అనంతపురం అర్బన్ టీడీపీ రాజకీయం ఎప్పటికప్పుడు సరికొత్త ఎత్తులతో రక్తి కడుతోంది. చివరికి ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి మరి.