ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ మీద సొంత కేడరే అసంతృప్తిగా ఉందా? ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నారంటూ పార్టీలోని ఓ వర్గం రగిలిపోతోందా? చెప్పి వెళ్ళాలి, చెప్పులేసుకుని వెళ్ళాలంటూ మినిస్టర్ పెడుతున్న కండిషన్స్ వాళ్ళకు మింగుడు పడ్డం లేదా? పైగా… పబ్లిక్‌లో పరువు తీస్తున్నారంటూ ఫైరవుతున్నారా? ఇంతకీ ఏ విషయంలో నారాయణకు, కేడర్‌కు మధ్య గ్యాప్ వచ్చింది? కార్యకర్తల అసంతృప్తికి కారణాలేంటి? ఏపీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే నారాయణ మీద సింహపురి టీడీపీ కేరడ్ తీవ్ర అసంతృప్తితో ఉందట. అసలు ఆయన నుంచి ఫోన్ కాల్ వస్తోందని అంటేనే… పక్కలో పెద్ద బాంబు పడ్డట్టు ఫీలైపోతున్నారు. మంత్రి వరుస టెలికాన్ఫరెన్స్‌లు పెట్టడం ఒక ఎత్తయితే… ఆ టైంలో కాన్ఫరెన్స్‌లో ఎవరున్నారు, ఏం మాట్లాడుతున్నారన్న ఆలోచన లేకుండా తిట్ల పురాణం అందుకోవడంపై ద్వితీయ శ్రేణి నాయకులు సైతం అసహనంగా ఉన్నట్టు సమాచారం. కొన్ని సందర్భాల్లో అయితే… ఆయన ఎవరిని ఉద్దేశించి కామెంట్ చేస్తున్నారో, కోపానికి కారణాలు ఏంటో అర్థంగాక అయోమయంలో పడుతున్నారట నాయకులు. ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నారంటూ సొంత పార్టీకి చెందిన ఓ కీలక నేతకు ఇటీవల మంత్రి టెలి కాన్ఫరెన్స్‌లోనే వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో… సాధారణంగా ఎప్పుడూ కూల్‌గా ఉండే నారాయణ ఈ మధ్య కాలంలో ఇలా ఎందుకు మారిపోయారన్న చర్చ జరుగుతోంది టీడీపీ సర్కిల్స్‌లో. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. వైసీపీ నుంచి కీలక నేతలతో పాటు కొందరు కార్పొరేటర్లు కూడా సైకిల్ ఎక్కేశారు. ఇక ఛోటామోటా నాయకుల సంగతి చెప్పేపనేలేదు. అందర్నీ కలుపుకుని పోదామన్న ధోరణిలో ఆహ్వానించిన మంత్రికి కొందరు వలస నేతలు, టిడిపిలోని అసంతృప్తులు కొందరు కలిసి షాక్ ల మీద షాక్‌లు ఇస్తున్నారట. మరీ ముఖ్యంగా వలస నాయకులు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నట్టు చెబుతున్నాయి మంత్రి సన్నిహిత వర్గాలు.
ఇసుకను అడ్డగోలుగా తవ్వేయడం, అదేమని అధికారులకు ఏకంగా మంత్రి నారాయణ పేరు చెబుతుండటంతో… విషయంలో తెలిసి ఆయన ఫైరైపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. మంత్రి పేరు విని చర్యలకు వెనకాడుతున్న కొందరు ఆఫీసర్స్ విషయాన్ని నారాయణ చెవిన వేయడంతో క్లారిఫికేషన్ కోసం కొన్నాళ్ళు నిఘా పెట్టారట. అలాంటి పనులు చేస్తున్న వాళ్ళందరి చిట్టాను బయటికి తీస్తే… అందులో ఒరిజినల్ టీడీపీ నాయకులు ఒకరిద్దరే ఉండగా… మిగతా మొత్తం వలస వచ్చినవాళ్ళేనని తేలిందట. ఇసుక అక్రమాలకు పాల్పడేది, కార్పొరేషన్‌లో తన పేరు చెప్పి చక్రం తిప్పేది.. పోలీస్ స్టేషన్స్‌లో పంచాయతీలు చేసేది మొత్తం వలస బ్యాచేనన్న క్లారిటీకి వచ్చారట మంత్రి. నమ్మి వెంట ఉంచుకుంటే వారే తనకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారని గ్రహించిన నారాయణ వాళ్ళకు చెక్ పెట్టేందుకు టెలికాన్ఫరెన్స్‌లలోనే ఓపెన్‌గా వార్నింగ్స్ ఇస్తున్నట్టు సమాచారం. దీంతో అధికార పార్టీలోకి వెళ్లి నాలుగు రాళ్లు వెనకేసుకుందామనుకుని కండువాలు మార్చేసిన వారికి మంత్రి మాటలు మింగుడు పడడం లేదన్నది నెల్లూరు పొలిటికల్ టాక్. పార్టీలో మొదట్నుంచి ఉన్న తమను కాదని వైసీపీ నుంచి తీసుకొచ్చి వాళ్ళని నెత్తిన పెట్టుకోవడం వల్లే ఇలా జరుగుతోందని, ఎవరు చేసుకున్నది వాళ్ళు అనుభవించక తప్పదంటూ మంత్రిని ఉద్దేశించి కామెంట్ చేస్తోంది పాత టీడీపీ కేడర్. పనుల్లో, పదవుల్లో… అన్ని విధాలా వలస బ్యాచ్‌కే నారాయణ అగ్ర తాంబూలం ఇవ్వడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తోంది పాత టీడీపీ కేడర్. అలాగే… ఈ నాయకులంతా పార్టీకి నష్టం చేస్తున్నారని,వారి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నారు పాతతరం టీడీపీ నేతలు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఓ నేతకు ప్రముఖ ఆలయ చైర్మన్ పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. దాన్ని పార్టీ సీనియర్లు అందరూ వ్యతిరేకిస్తున్నా.. మంత్రి నారాయణ మాత్రం మొండిగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిన వారికి కాకుండా అధికారం వచ్చాక ఎంటరైన వాళ్ళరు పదవులు కట్టబెడితే కార్యకర్తల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నది నెల్లూరు టీడీపీ నాయకుల అభిప్రాయం. అందర్నీ కలగలిపి వార్నింగ్‌ల మీద వార్నింగ్‌లు ఇస్తున్న నారాయణ…. ఒరిజినల్ ఎవరో.. ఎన్నికల సమయంలో మళ్ళీ జంపైపోయేది ఎవరో గ్రహించాలన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.