ఒక్క ఫలితం… వంద సంకేతాలు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ విషయంలో జరుగుతున్న చర్చ ఇది. అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇటు వ్యక్తిగతంగా సీఎం రేవంత్‌రెడ్డికి ఇది నిజంగా బూస్ట్ అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఏయే కోణాల్లో ఈ ఫలితం ప్లస్ అవుతోంది? పార్టీ మీద, ప్రభుత్వంలో పట్టు బిగించేందుకు సీఎం చేతిలో ఎలాంటి అస్త్రం అవబోతోంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం కాంగ్రెస్ పార్టీ పరపతికి, ప్రత్యేకించి సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వ పటిమకు నిదర్శనమన్న అభిప్రాయం బలంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలకంటే పార్టీ పరిస్థితి మెరుగుపడటం మెజార్టీ కూడా ఆషామాషీగా కాకుండా పాతిక వేలకు దగ్గర దగ్గరగా ఉండటం పార్టీ శ్రేణుల్లో కొత్త ఊపు, ఉత్సాహం తీసుకువచ్చింది. మొత్తం పోలైన వాటిలో 51% ఓట్లు సాధించడం చిన్న విషయమేం కాదు. కాంగ్రెస్ పార్టీ నేతలందరి సమష్టి కృషి వల్లే ఇది సాధ్యమైందని అంటున్నారు. చివరి పది రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి జోరుగా ప్రచారం చేయడం, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్‌తో పాటు మంత్రులంతా కలిసిమెలిసి పనిచేయడం వల్లే ఇంత గౌరవప్రదమైన విజయం దక్కిందని చెబుతున్నారు. ఈ ఉప ఎన్నిక విషయంలో సీఎం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. చివరికి అంతా కలిసి ప్రత్యర్థి పార్టీ సిట్టింగ్ సీటును కైవసం చేసుకున్నారు. అదంతా ఒక ఎత్తయితే…ఈ రిజల్ట్‌తో సీఎం రేవంత్ రెడ్డి ఇటు ప్రభుత్వంలో, అటు పార్టీ పరంగా బలోపేతమయ్యారన్న చర్చ జరుగుతోంది. గడిచిన రెండేళ్ళుగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, పనితీరును రకరకాలుగా విమర్శిస్తూ… విఫల నేతగా ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళందరికీ ఈ ఒక్క రిజల్ట్ పూర్తి స్థాయి సమాధానం చెప్పిందని అంటున్నారు పరిశీలకులు. అటు ప్రభుత్వ యంత్రాంగంపై గ్రిప్ లేదంటూ విమర్శించిన వాళ్ళ నోళ్ళు కూడా ఇక మూతపడతాయని అంటున్నారు.
ఇక కేబినెట్లో కాస్త తేడాగా వ్యవహరిస్తున్న మంత్రులు సైతం ఈ దెబ్బకు సెట్ అయిపోతారని చెప్పుకుంటున్నారు. అటు ప్రతిపక్షం చేస్తున్న విమర్శలకు కూడా జూబ్లీహిల్స్ ఫలితం దీటైన సమాధానం చెప్పినట్టయింది. అటు సోషల్ మీడియాలో కూడా సీఎం రేవంత్ రెడ్డిని, ప్రభుత్వాన్ని డామేజ్ చేసేలా రకరకాల పోస్టింగ్స్ సర్క్యులేట్ అయ్యాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వాటన్నిటికీ సింగిల్ స్ట్రోక్ ఆన్సర్ ఇచ్చినట్టయిందన్నది విశ్లేషకుల మాట. కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని బైపోల్‌కు ముందు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు ప్రతిపక్ష నాయకులు. అలాంటి వాటికి కూడా జూబ్లీహిల్స్లోనే ఆన్సర్ దొరికిందని అంటున్నారు. అలాగే… క్యాబినెట్ మంత్రులపై పట్టు బిగించడానికి సీఎం రేవంత్ రెడ్డికి అస్త్రం దొరికినట్టేనన్న అభిప్రాయం ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం తేజా పడితే… అందుకు పూర్తి బాధ్యత రేవంత్‌రెడ్డిదేనని అంటూ… టార్గెట్ చేయడానికి కూడా పార్టీలో కొందరు నాయకులు రెడీగా కూర్చున్నారట.
కానీ… ఇప్పుడు స్వయంగా రేవంత్ పర్యవేక్షణలోనే పార్టీ 51 శాతం ఓట్లతో విజయం సాధించడంతో… గోతికాడ నక్కల్లా కూర్చున్న వాళ్ళ గొంతులు మూగబోయాయని చెప్పుకుంటున్నారు. ఈ దెబ్బతో అటు ఢిల్లీలో కూడా రేవంత్‌కు పట్టు పెరుగుతుందని, పితూరీ బ్యాచ్ మాటలు చెల్లకపోవచ్చని అంటున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్‌కు ఈ జూబ్లీహిల్స్ ఫలితం నిజంగా పెద్ద ఊరటే. అందుకే అధిష్టానం కూడా ఇంతకు ముందు ఎలా ఉన్నా… ఇక మీదట రేవంత్‌కు హై ప్రయారిటీ ఇస్తుందని అంచనా వేస్తున్నారు పరిశీలకులు. ఏదో బొటాబొటీగా కాకుమండా… భారీ మెజార్టీతో కాంగ్రెస్‌ను గెలిపించడంతో సీఎంకు కూడా కాన్ఫిడెన్స్ పెరిగినట్టయిందన్న అంచనాలున్నాయి. పార్టీ నాయకులందరితో ఐక్యంగా పని చేయించారనే ఫీడ్ బ్యాక్ కూడా అధిష్టానానికి వెళ్లిందట. దీంతో ప్రభుత్వంలో స్థిరత్వం రావంతోపాటు సీఎం రేవంత్‌రెడ్డి మరింత బలవంతుడయ్యారన్న అభిప్రాయం బలంగా ఉంది రాజకీయవర్గాల్లో.