హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఒక చదరపు గజం భూమి కేవలం 350 రూపాయలేనా? పోనీ రెండు వేల ఐదు వందల రూపాయలకైనా దొరికే ఛాన్స్ ఉందా? అసలు బంజారాహిల్స్ దాకా ఎందుకు? సిటీ శివారులో విసిరేసినట్టుండే ఏ మారుమూల ప్రాంతంలోనైనా ఆ ధరకు భూమి దొరుకుతుందా? వేరే ఎవరి సంగతో ఎందుకుగానీ… ఆ సీనియర్ లీడర్‌కు మాత్రం అప్పనంగా అంత చవగ్గా దొరికేసిందట. ఎవరా లీడర్? ఏంటా భూ బాగోతం? హైదరాబాద్ బంజారాహిల్స్…. సిటీ గురించి ఏ కాస్త తెలిసిన వాళ్ళకైనా అది ఎంత ఖరీదైన ఏరియానో చెప్పాల్సిన అవసరం లేదు. కానీ… ఇక్కడ గజం భూమి ధర కేవలం 350 రూపాయలు మాత్రమేనట. అంటే… స్టార్‌బక్స్‌లో జస్ట్ ఓ కప్పు కాఫీ ఖరీదన్నమాట. ఏంటి నమ్మకం కలగడం లేదా? కలిగినా కలగకపోయినా… మీరు నమ్మి తీరాలంతే. సరే….. నమ్మాంలే బాబూ… ఎక్కడో చెప్పండి మేం కూడా బ్యాగులోనో, బస్తాలోనో డబ్బులేసుకుని పోయి ఓ పదెకరాలు కొనుక్కుంటామని అంటారా? ఆశదోశ… మీకా ఛాన్స్ లేదు, అంత సీన్ ఇవ్వరు కూడా. ఒక చదరపు గజం రేటు రెండు నుంచి మూడు, మూడున్నర లక్షల దాకా పలుకుతున్న బంజారాహిల్స్‌లో కేవలం కప్పు కాఫీ రేటుకు అప్పనంగా భూమి కొట్టేయాలంటే అందుకు కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉండాలట. సీనియర్ లీడర్ కేకే కుటుంబానికి అలాంటివన్నీ పుష్కలంగా ఉండటంవల్లే…. వాళ్ళకు గజం కేవలం 350 రూపాయలకే దొరికేసిందట. దొరకడమేంటి… తమ పొలిటికల్ పలుకుబడితో అలా దొరకబుచ్చుకున్నారన్నది విస్తృతాభిప్రాయం.
అదీ కూడా అత్యంత కీలకమైన రోడ్ నంబర్ 12 NBT నగర్లో. 2023 మేలో కేశవరావు బీఆర్ఎస్లో ఉన్నప్పుడే దీనికి సంబంధించిన జీవో ఇచ్చారట. కోర్ట్ కేసుతో ఇప్పుడీ వ్యవహారం బయటికొచ్చి పొలిటికల్ సెగలు పుట్టిస్తోంది. ప్రస్తుతం అధికార కాంగ్రెస్‌లో ఉన్నారు కేకే. దీంతో ఇలాంటి వాటి కోసమేనా…. ఆయన ఏ పార్టీ అధికారంలో ఉంటే అందులోకి జంప్ అయ్యేది అంటూ ప్రశ్నిస్తున్నారు రాజకీయ ప్రత్యర్థులు. కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి ప్రస్తుతం జీహెచ్ఎంసీ మేయర్ పదవిలో ఉండటం, ఆమె పేరుతో కూడా భూమి కారు చౌకగా రెగ్యులరైజ్ అవడం కాక రేపుతోంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని NBT నగర్ ఏరియా దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల వివాదాలకు కేంద్ర బిందువైంది. ఇక్కడే కేశవరావు కుమార్తె, మేయర్ విజయలక్ష్మికి గజం 350 రూపాయల చొప్పున 425 గజాలు, కుమారుడు వెంకటేశ్వర్రావుకు రెండు వేల ఐదు వందల చొప్పున 1161 గజాల భూమి రెగ్యులరైజ్ అయింది. ఇందుకోసం 2023లో అప్పటి ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో ఇచ్చిందట. 1998 బేస్ వేల్యూ ప్రకారం ఈ రెగ్యులరైజేషన్ జరిగిందని చెబుతున్నా… అప్పట్లోనే ఇక్కడ మార్కెట్ విలువ గజం 60వేల 300 రూపాయలు ఉంది. అంటే… ఎట్నుంచి ఎటు చూసినా…ఖరీదైన ప్రభుత్వ భూమికి నామ మాత్రపు రేటు కట్టి కారు చౌకగా కొట్టేశారన్నది కేకే ఫ్యామిలీ రాజకీయ ప్రత్యర్థుల ఆరోపణ. అదే సమయంలో ఇది పద్ధతి ప్రకారం జరిగిందా? లేక ప్రత్యేక సడలింపులా? అన్న విషయమై కూడా తీవ్ర చర్చోపచర్చలు జరుగుతున్నాయి. భూముల వాస్తవ విలువతో ఏ మాత్రం సంబంధం లేకుండా, అత్యల్ప ధరలతో ఈ ప్లాట్లను రెగ్యులరైజ్ చేశారన్నది మొదటి ఆరోపణ. అంతే కాదండోయ్…. వడ్డించే వాడు మనోడైతే…. బంతి చివర్లో కూర్చున్నా అన్నీ అవే వచ్చేస్తాయన్న సామెతను గుర్తు చేస్తూ… ఈ వ్యవహారంలో చాలా నిబంధనలను బైపాస్ చేసి కేకే ఫ్యామిలీకి మేళ్ళు చేశారన్న వాదన కూడా వినిపిస్తోంది.
సాధారణ పౌరులు ఎవరైనా పద్ధతి ప్రకారం రెగ్యులరైజ్ చేయించుకోవాలంటే… Mee-Sevaలో దరఖాస్తు, తహసీల్దార్ ఎంక్వైరీ, 25% అడ్వాన్స్ వంటి సవాలక్ష రూల్స్ ఉంటాయి. కానీ… ఈ కేసులో మాత్రం మొత్తం బైపాస్ అయ్యాయట. వాటిని కోట్ చేస్తూనే… మేటర్ హైకోర్ట్ దాకా వెళ్ళింది. కోర్ట్ కూడా దీన్ని సీరియస్‌గా పరిగణించి… ఇది అందరికీ వర్తించే సాధారణ విధానమా? లేక ప్రత్యేకంగా వీరికి మినహాయింపులిచ్చారా? మార్కెట్ విలువను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? కన్సెషన్ రేటును ఫిక్స్ చేయడానికి ఆధారం ఏమిటి? అంటూ… ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అంతే కాకుండా భూములు పొందిన వారికి కూడా నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో స్పష్టమైన సమాధానం ఇవ్వాలని ఆదేశించడంతో… ఈ ఎపిసోడ్ తిరిగి తెర మీదికి వచ్చి పొలిటికల్ హాట్ టాపిక్ అయింది. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి, ఆ పార్టీ నుంచి తిరిగి కాంగ్రెస్‌లోకి కే కేశవరావు జంప్‌లు కొడుతున్నది ఇలాంటి లబ్దికోసమేనా అని ప్రశ్నిస్తున్నారు ఆయన పొలిటికల్ ప్రత్యర్థులు. అదే సమయంలో సాధారణ ప్రజల్లో కూడా చర్చ మొదలైంది. యాభై గజాలో, వంద గజాలో ఆక్రమించి ప్రభుత్వ భూముల్లో ఇంత గూడు ఏర్పాటు చేసుకున్న సామాన్యులను కఠిన నిబంధనలతో వేధించే యంత్రాంగం ఇలా… పొలిటికల్ పలుకుబడి ఉన్న వాళ్ళకు మాత్రం అప్పనంగా అప్పగిస్తుందా అంటూ మాట్లాడుకుంటున్నారు. మొత్తంగా NBT నగర్ భూముల రెగ్యులరైజేషన్ వివాదం పరిపాలనా లోపమా? లేక సిస్టమ్‌ను మినహాయించి ప్రత్యేక అనుగ్రహమా? అన్నది తేలాల్సి ఉందని అంటున్నారు. దీని చుట్టూ… రాజకీయంగా కూడా పెద్ద రచ్చే జరిగే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు.