USA: అమెరికాలో చాలా మంది భారతీయులు ముఖ్యంగా H1B వీసాలపై పనిచేస్తున్న వారిని టార్గెట్ చేస్తున్నారు. వీరి వల్లే తమకు ఉపాధి లభించడం లేదని ఆరోపిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ ధోరణి మరింత ఎక్కువగా పెరిగింది. ఇదిలా ఉంటే, యూఎస్‌లో ప్రముఖ రాజకీయ వ్యాఖ్యాత, యూఎస్ పోల్‌స్టర్‌గా ప్రసిద్ధి చెందిన మార్క్ మిచెల్ కూడా భారతీయులపై నోరు పారేసుకున్నాడు. ఆపిల్ వంటి టెక్ కంపెనీల్లో H1B వీసాలపై పనిచేస్తున్న భారతీయుల్ని తిరిగి పంపాలని, ఒక్క H1B వీసాదారుడు 10 మంది అక్రమ వలసదారులతో సమానం అని అన్నారు.
Read Also: Telangana Panchayat Elections : పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల హవా
ఇదే కాకుండా.. సిలికాన్ వ్యాలీలోని వర్క్ ఫోర్స్‌లో మూడింట రెండు వంతుల మంది విదేశీయులు, కొన్ని కంపెనీల్లో 85-90 శాతం మంది భారతీయులు ఉన్నారని మిచెల్ అన్నారు. వీరంతా ‘‘థర్డ్ వరల్డ్ ఇంజనీర్లు’’ అని పిలిచారు. అధ్యక్షుడ డొనాల్డ్ ట్రంప్ మాజీ సలహాదారు, MAGAకు గట్టి మద్దతుదారుగా ఉన్న స్టీవ్ బానన్ కార్యక్రమంలో మిచెల్ భారతీయు టెక్కీలు, H-1B ప్రోగ్రామ్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఇంకా, వీరిని వారి స్వదేశాలకు తిరిగి పంపకపోవడంపై ట్రంప్ పాలనను విమర్శించారు. ఒక H1B డెవలపర్ ఏడాదికి 90,000 డాలర్లు సంపాదిస్తే, 10 మంది అక్రమ వలసదారులు గంటకు 9 డాలర్లు సంపాదించడానికి సమానమని చెప్పారు. అగ్రశ్రేణి అమెరికన్ ఇంజనీర్లను, యువకులు, తక్కువ ఖర్చుతో కూడి విదేశీ ఇంజనీర్లతో భర్తీ చేస్తున్నారని అన్నారు.
సిలికాన్ వ్యాలీ టెక్ ఉద్యోగాల్లో దాదాపుగా 66 శాతం మంది విదేశీయులే ఉన్నారని ఇటీవల 2025 ఇండస్ట్రీ ఇండెక్స్ డేటా వెల్లడించింది. ఇందులో 23 శాతం భారతీయులు, 18 శాతం చైనీయులు ఉన్నారని చెప్పింది. ఈ డేటా నేపథ్యంలో ఇప్పుడు మిచెల్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. యూఎస్‌లో పెరుగుతున్న భారతీయ వ్యతిరేకతను సూచిస్తున్నాయి.