తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోడీ క్లాస్
రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పార్టీ ఎంపీలతో జరిగిన సమావేశంలో ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిస్థితులపై స్పష్టమైన సూచనలు చేసినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు అద్భుతమైన పాలన అందిస్తున్నారని ప్రధాని అభినందించారు. రాష్ట్రంలో కూటమి పార్టీలు సమన్వయంతో ముందుకు సాగుతున్న తీరు శుభపరిణామమని పేర్కొన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో బీజేపీ సమన్వయ వ్యవహారం బాగా కొనసాగుతుందని మోదీ అభిప్రాయపడ్డారు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఇంకా దూకుడుగా వ్యవహరించాలని BJP ఎంపీలకు సూచించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వ్యవహారాలపై, ప్రజా సమస్యలపై వైసీపీని మరింత టార్గెట్ చేస్తూ పోరాడాలని ప్రధాని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల వినియోగంలో మరింత చురుకుదనం అవసరమని ప్రధాని మోదీ అన్నారు. మీడియా, సోషల్ మీడియా ద్వారానే ప్రజలకు వేగంగా చేరువయ్యే అవకాశం ఉండటంతో, BJP నాయకులు మరింత యాక్టివ్‌గా ఉండాలని సూచించారు.
5 రాష్ట్రాలు, ఒక యూటీలో SIR గడువు పొడగించిన ఎన్నికల సంఘం..
కేంద్రం ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలను ప్రక్షాళన చేసేందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) ప్రక్రియను చేపట్టింది. ఈ ప్రక్రియను ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో పొడగించినట్లు ఎన్నికల సంఘం ఈ రోజు వెల్లడించింది. తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తర్‌ప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవుల్లో గడవును పొడగించింది. మరోవైపు..గోవా, లక్షద్వీప్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌లకు ఓటర్ల నమోదు గడువు ఈరోజుతో ముగిసింది. ఈ రాష్ట్రాలకు ఎలాంటి పొడగింపు ఇవ్వలేదు. బీహార్ ఎన్నికల తర్వాత, బెంగాల్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో SIR ప్రక్రియ రాజకీయంగా వివాదాస్పదమైంది. బెంగాల్‌లో మమతా సర్కార్ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
అమిత్ షా ఒత్తిడిలో ఉన్నారు, అందుకే తప్పుడు భాష వాడారు..
కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ జాబితా ప్రక్షాళన కోసం నిర్వహిస్తున్న ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)’’ ప్రక్రియపై బుధవారం పార్లమెంట్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మధ్య తీవ్ర వాడీవేడి చర్చ జరిగింది. అయితే, దీనిపై గురువారం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. అమిత్ షాను ఉద్దేశిస్తూ, బీజేపీ నాయకుడు ‘‘ఒత్తిడి’’లో ఉన్నట్లు కనిపించారని అన్నారు. ‘‘నిన్న పార్లమెంట్‌లో అమిత్ షా జీ చాలా ఆందోళనగా ఉన్నారు. ఆయన చేతులు వణుకుతున్నాయి, ఆయన తప్పుడు భాష ఉపయోగించారు. అమిత్ షా జీ తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నారు, ఇది నిన్న దేశమంతా చూసింది’’ అని అన్నారు. ‘‘ఓట్ చోరీ’’ గురించి తాను చేసిన ఆరోపణలపై చర్చకు రావాలని అమిత్ షాకు తాను నేరుగా సవాల్ విసిరానని, ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదని అన్నారు.
వాజపేయి అడుగుజాడల్లో రాష్ట్రంలో సుపరిపాలన యాత్ర..
రాష్ట్రంలో నేటి నుండి ప్రారంభమైన సుపరిపాలన యాత్రలో శ్రీ సత్యసాయి జిల్లాలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. వాజపేయి పాలన భారత ఆర్థిక ప్రగతికి బలమైన పునాది వేసిందని, ఆయన చూపిన దిశలోనే నేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయని ఈ సందర్బంగా ఆయన అన్నారు. వాజపేయి నాయకత్వం దేశాన్ని ఆర్థికంగా ముందుకు నడిపినదే కాకుండా, జాతీయ రహదారులు, గ్రామీణ రహదారులు, ఐటీ, టెలికాం కనెక్టివిటీ వంటి కీలక రంగాలలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. 23 పార్టీలతో కూటమి ప్రభుత్వాన్ని నడిపినా, అజాత శత్రువుగా పేరు పొందిన వాజపేయి ప్రజలకు సుపరిపాలన అందించారని అన్నారు.
ప్రజా సేవ, ప్రచారం రెండూ ముఖ్యమే.. తెలుగు తమ్ముళ్లకు సీఎం దిశానిర్ధేశం..
టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నేడు కీలక రాజకీయ వేడుకలకు వేదికైంది. మండల పార్టీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన ప్రజలు సీఎం వద్ద వినతులు ఇవ్వడంతో కార్యాలయం సందడిగా మారింది. సీఎం చంద్రబాబు మంత్రులు, జిల్లాల త్రిసభ్య కమిటీ సభ్యులతో కీలక సమావేశం నిర్వహించారు. ఇటీవల జిల్లాల్లో పార్టీ అధ్యక్షుల నియామకంపై కమిటీ కాలయాపన పట్ల వ్యక్తం చేసిన అసంతృప్తిని గుర్తుచేస్తూ, త్వరలోనే నియామకాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులతో కూడా సీఎం భేటీ అవుతారని తెలిసింది.
ఈనెల 17న తెలంగాణకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 17 నుంచి 21 వరకు హైదరాబాద్ లోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు తెలిపారు. ఐదు రోజులపాటు రాష్ట్రంలో రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్ల పై గురువారం డా.బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేసి విస్తృత ఏర్పాట్లు చేయాలని సి.ఎస్. ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రాష్ట్రపతి నిలయం అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోలీసు శాఖ తగు భద్రతా, ట్రాఫిక్, బందోబస్త్ ప్రణాళికను రూపొందించాలని, అగ్నిమాపక శాఖ అవసరమైన సిబ్బందితో పాటు తగిన అగ్నిమాపక ఏర్పాట్లు, ఫైర్ టెండర్లను ఏర్పాటు చేయాలని, వైద్య, ఆరోగ్యశాఖ వైద్య బృందాన్ని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
భారత జలాల్లోకి వచ్చిన పాక్ పడవ స్వాధీనం.. 11 మంది అరెస్ట్..
భారత జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్తాన్‌కు చెందిన పడవను భారతీయ తీర రక్షక దళం (ICG) స్వాధీనం చేసుకుంది. భారత జలాల్లో చట్టవిరుద్ధంగా ప్రవేశించిన పాక్ ఫిషింగ్ బోట్‌తో సహా అందులో ఉన్న 11 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు గురువారం తెలిపారు. తదుపరి విచారణ కోసం వీరిని గుజరాత్‌లోని జఖౌ మెరైన్ పోలీసులకు అప్పగించారు. బుధవారం భారత్ కోస్ట్ గార్డ్ ‘‘భారత ఎక్స్‌క్లూజివ్ ఎకనామికల్ జోన్ (EEZ)’’ లోపల 11 మంది సిబ్బందితో కూడిన పాకిస్తానీ ఫిషింగ్ బోట్‌ను పట్టుకున్నట్లు అని గుజరాత్ డిఫెన్స్ PRO వింగ్ కమాండర్ అభిషేక్ కుమార్ తివారీ Xలో ఒక పోస్ట్‌లో తెలిపారు.
మంత్రి కొండా సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్
మంత్రి కొండా సురేఖపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.ఇటీవల మంత్రి సురేఖ తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువునష్టం కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో జరుగుతోంది. అయితే.. నిర్దేశించిన తేదీన విచారణకు మంత్రి కొండా సురేఖ హాజరుకాకపోవడంతో, కోర్టు కఠినంగా స్పందించింది. హాజరు నిర్లక్ష్యం చేసినందుకు ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ కోర్టు ఆదేశాలు వెలువరించింది. కోర్టు ఆదేశాలను అమలు చేయాలని పోలీసులకు సూచించింది. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 5వ తేదీన వ్యక్తిగతంగా హాజరు కావాలని కొండా సురేఖను కోర్టు ఆదేశించింది.
ఆధునిక పరిశోధనల కేంద్రంగా అమరావతి క్వాంటం వ్యాలీ
అమరావతిలో ఏర్పాటు అవుతున్న క్వాంటం వ్యాలీ ఆధునిక పరిశోధనలకు కేంద్రంగా మారాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. విద్య, వైద్యం, ఔషధాల రూపకల్పన సహా వివిధ రంగాల్లో అమరావతి క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం పనిచేయాలని సీఎం సూచించారు. సచివాలయంలో వివిధ దేశాల నుంచి బృందంగా వచ్చిన పరిశోధకులు, విద్యావేత్తలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల బృందంతో సీఎం సమావేశం అయ్యారు. వైద్యరంగంలో నూతన ఔషధాల రూపకల్పనతో పాటు మెటీరియల్ సైన్స్ పై పరిశోధనలకు గానూ గ్లోబల్ క్వాంటం బయో ఫౌండ్రీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమని పరిశోధకులు, విద్యావేత్తల బృందం ముఖ్యమంత్రికి తెలిపింది. దేశంలోనే తొలి క్వాంటం బయోమెడికల్ రీసెర్చ్ ఎకో సిస్టంగా ఏర్పాటు అవుతున్నట్టు వివరించింది. గ్లోబల్ క్వాంటం బయో ఫౌండ్రీ బృందం సభ్యులకు అభినందనలు తెలిపారు ముఖ్యమంత్రి.. వైద్యారోగ్యం, ఔషధాల రూపకల్పన సహా వివిధ అంశాల్లో విస్తృతంగా పరిశోధనలు జరగాల్సి ఉందని అన్నారు. క్వాంటం పరిశోధనలతో బయోసెన్సార్ల లాంటి అప్లికేషన్లను కూడా ప్రజా ప్రయోజనాల కోసం అందుబాటులోకి తేవాల్సి ఉందని అన్నారు. అమరావతిలో త్వరలోనే క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని సీఎం వెల్లడించారు.
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల హవా
తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి తమ హవాను చాటారు. మొత్తం 4,231 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరగ్గా, వెలువడుతున్న తొలి ఫలితాల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. తాజా సమాచారం ప్రకారం, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు దాదాపు 850 సర్పంచ్ పదవులను కైవసం చేసుకుని, 80% స్థానాల్లో విజయం సాధించారు. ఇక బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు 350 స్థానాలు, బీజేపీ 60 స్థానాలు, ఇతరులు 150 స్థానాల్లో గెలుపొందారు. కాంగ్రెస్ నాయకులు దీనిని ప్రజాపాలనకు ప్రజలు ఇచ్చిన ఆమోదంగా అభివర్ణించారు.