Off The Record: ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్సీలను గుర్తింపు కష్టాలు వెంటాడుతున్నాయట. ఆ ఒక్క తప్పు వాళ్ళిద్దర్నీ పదవులకు దూరం చేసిందట. అది అందరూ చేసే తప్పే అయినా.. మాకే ఎందుకిలా అంటూ ఇద్దరూ తెగ ఫీలైపోతున్నారు. ఒకప్పుడు పార్టీలో కీలకంగా ఉన్నా.. ఇప్పుడు వేదిక మీద సీటు కోసం ముఖం వాచిపోతున్న ఆ కాంగ్రెస్ సీనియర్స్ ఎవరు? వాళ్ళకొచ్చిన కష్టాలేంటి?
Read Also: Pakistan YouTube Ban: పాక్ న్యూస్ ఛానెల్స్, ఇన్‌స్టా ఖాతాలు భారత్‌లో తిరిగి ప్రత్యక్షం
నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో ఇద్దరు మాజీ ఎమ్మెల్సీలు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ.. తమ పొలిటికల్ గాడ్ ఫాదర్స్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట. కార్పొరేషన్ ఛైర్మన్, డీసీసీ అధ్యక్ష పదవుల రేసులో నిలిచినా.. వీళ్ళకు ఆ ఒక్కటి అడ్డొస్తోందట. ఎక్కడికెళ్లినా ఆ తప్పునే గుర్తు చేస్తూ.. ఇద్దరికీ పదవులు రాకుండా అడ్డుపడుతున్నారట సీనియర్ కాంగ్రెస్ నాయకులు. కనీసం పార్టీ కార్యక్రమాల ప్లెక్సీల్లో ఫోటోలు కూడా వేయడం లేదు, స్టేజీపై కుర్చీలు ఉండటం లేదంటూ.. లోలోపల తీవ్రంగా మధనపడుతున్నారట మాజీ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, అరికెల నర్సారెడ్డి. కాంగ్రెస్ పార్టీలో ఎంపీటీసీగా రాజకీయ ఆరంగేట్రం చేశారు లలిత. ఎంపీపీగా, ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు, డీసీసీ అద్యక్షురాలిగా, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారామె. 2008 ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా పెద్దల సభలో అడుగు పెట్టారు. ఇలా, కాంగ్రెస్‌లో అనేక పదవులు అనుభవించిన ఆకుల లలిత.. 2018 ఎన్నికల తర్వాత గులాబీ కండువా కప్పుకున్నారు. కారు పార్టీలో కూడా ఆరేళ్ళ పాటు వివిధ పదవులు అనుభవించారామె. అనంతరం.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. అప్పటి నుంచి పార్టీలో చురుకుగా ఉంటున్నా.. అధిష్టానం మాత్రం ఆమెకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదట. జిల్లా కాంగ్రెస్ నేతలు కూడా ఆమె రాకను వ్యతిరేకించారు.
Read Also: Off The Record: కూటమి సర్కార్‌లో పదవుల చిచ్చు..? బీజేపీ లీడర్స్ రగిలిపోతున్నారా..?
ఈ క్రమంలో, కార్పొరేషన్ చైర్మన్ పదవి వస్తుందని ఆశపడ్డ లలితకు పదవి రాకుండా సీనియర్స్ అడ్డుపడుతున్నట్టు తెలుస్తోంది. చివరికి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత స్దాయి సమావేశం.. ప్లెక్సీలో ఆమె ఫోటో కూడా పెట్టలేదు, వేదిక మీద కుర్చీ లేదు. దీంతో ఆమె కార్యకర్తల మధ్యన కూర్చోవాల్సి వచ్చిందట. తర్వాత గుర్తించిన నాయకులు పైకి పిలిచినా… ప్లెక్సీలో ఫోటో లేదన్న కారణంతో అలక వహించినట్టు సమాచారం. అటు జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి మొన్నటి ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ టికెట్టు ఆశించి భంగపడ్డారు. సరే.. అది రాలేదు, పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఏదో పదవి దక్కుతుందని అనుకున్నా… అదీ అందని ద్రాక్షలా మారిందట. డీసీసీ అధ్యక్షుని రేసులో ఉన్నా.. సీనియర్లు అడ్డు పుల్లలు వేస్తున్నారట. దీంతో.. ఇప్పుడు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి, లేదా ఎమ్మెల్సీ కోసం పట్టుబడుతున్నారట అరికెల. సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నా.. పార్టీలో దక్కాల్సిన ప్రాధాన్యత దక్కడం లేదని సన్నిహితుల దగ్గర బాధ పడుతున్నట్టు సమాచారం.
Read Also: Crime: ఆ ప్రాంతంలో అందరూ రౌడీలే.. ఒకరు చిన్న రౌడీ.. మరొకరు పెద్ద రౌడీ
పైకి చెప్పుకోవడానికి అంతా బాగానే ఉన్నా.. పార్టీలు మారటం అరికెల నర్సారెడ్డికి మైనస్‌గా మారిందట. టీడీపీ నుంచి కాంగ్రెస్, అక్కడి నుంచి బీఆర్ఎస్, ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ లో చేరడం తేడా కొట్టినట్టుందని అంటున్నారట మాజీ ఎమ్మెల్సీ సన్నిహితులు. జిల్లా కాంగ్రెస్ నాయకులు కూడా అదే రీజన్ చెబుతుంటడంతో తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారట ఆయన. ఓపిగ్గా ఉంటే ఒక్క ఛాన్స్ ఇవ్వకపోతారా అని అరికెల ఎదురు చూస్తుండగా…. ఆకుల లలిత మాత్రం తన దారి తాను చూసుకునే ప్రయత్నాల్లో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇలా… వరుసబెట్టి పార్టీలు మారిన ఇద్దరు నేతల పరేషాన్ ఇందూరు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయింది.