ఆ లీడర్స్ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మారుతోందా? పొలిటికల్ సీన్‌లో కాస్త ఛేంజ్ కనిపిస్తోందా? పద్ధతులకు, పాలిటిక్స్‌కు లింక్ పెట్టొద్దన్న ఆనవాయితీని ఇద్దరూ కొనసాగిస్తున్నారా? తోలు తీస్తానని ఒకరు, ఉరి తీయాలని మరొకరు వీరావేశంతో ఇచ్చే స్టేట్‌మెంట్స్‌ను అక్కడికే పరిమితం చేయాలనుకుంటున్నారా? ఎవరా ఇద్దరు ముఖ్య నాయకులు? వాళ్ళ మధ్య సంప్రదాయాల ప్రస్తావన ఎందుకు వస్తోంది?
ఒకరు ముఖ్యమంత్రి, మరొకరు మాజీ ముఖ్యమంత్రి. రాజకీయంగా ఇద్దరూ గండరగండులే. తెలంగాణ పాలిటిక్స్‌లో కీలక పాత్ర పోషిస్తున్నవారే. సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ అన్న మాటలు ఒకేసారి కలిపి వినిపించగానే…ఠక్కున గుర్తుకు వచ్చేది రాజకీయ వైరమే. విసురుకునే సవాళ్ళే. రేవంత్‌రెడ్డి డైరెక్ట్‌గా కేసీఆర్‌ను అటాక్ చేస్తుంటే…. ఆయన మాత్రం నేరుగా రేవంత్ పేరు ప్రస్తావించకుండా ఆయనకు తగిలి వచ్చేలా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుంటారు. ఇటీవల ఇద్దరి మధ్య మాటలు గట్టిగానే తూలాయి. నాలుక కోతలు, ఉరి తీతలదాకా వెళ్ళింది వ్యవహారం. అయితే… తాజాగా కనిపించిన ఓ దృశ్యం మాత్రం అంత పొలిటికల్ హీట్‌లో కూడా ఒక ఆహ్లాదకరమైన సన్నివేశాన్ని ఆవిష్కరించింది. ఇప్పుడు యావత్ తెలంగాణ సమాజం దీని గురించే మాట్లాడుకుంటోంది.
తెలంగాణ కుంభమేళాగా పిలుచుకునే మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర పేరుతో రాజకీయాలకు, మాటల తూటాలకు అతీతంగా కనిపించిందీ దృశ్యం. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు కొండా సురేఖ, సీతక్క కలిసి ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇంటికి వెళ్ళి ఆయన్ని సమ్మక్క-సారలమ్మ జాతరకు ఆహ్వానించారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో స్వయంగా ఇద్దరు మంత్రులు ఆయనకు ఆహ్వాన పత్రికను అందించారు. ఈ భేటీలో ఎక్కడా రాజకీయ వ్యవహారాలు కనిపించకుండా, వాటి తాలూకు విభేదాల మాటల్లేకుండా… కేవలం సంప్రదాయం, ఆత్మీయతలే కనిపించడం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటోంది తెలంగాణ సమాజం. పొలిటికల్ కంపు లేకుండా పద్ధతులు పాటిస్తే… ఎంత బాగుందో కదా అంటూ ప్రశంసిస్తున్నారు చాలామంది.
తన ఇంటికి వచ్చిన మంత్రులను కేసీఆర్ కూడా ఆత్మీయంగా పలకరించి బాగున్నారా తల్లీ… అంటూ అడగడంతో అంతకు ముందున్న కాస్తో కూస్తో ఉద్విగ్నభరిత వాతావరణం కూడా మారిపోయిందట. అలాగే… మంత్రులకు పసుపు, కుంకుమ, చీరలతో ఇంటికి వచ్చిన ఆడ బిడ్డను సత్కరించినట్టే మర్యాదలు చేశారు కేసీఆర్ దంపతులు. ఈ ఒక్క సీన్‌తో అటు ప్రతిపక్ష నేతను గౌరవిస్తూ… ఆహ్వాన పత్రిక ఇచ్చి ఇద్దరు మంత్రుల్ని పంపినందుకు సీఎం రేవంత్‌రెడ్డిని, అలాగే తన పెద్దరికాన్ని నిలబెట్టుకున్నందుకు కేసీఆర్‌ను ప్రశంసిస్తున్నారు చాలా మంది. ఇలాంటి మంచి సాంప్రదాయాలే ఇక ముందు కూడా కొనసాగాలని అంటున్నారు.
ఈ ఆత్మీయ కలయికకు 15 రోజుల ముందే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య హాట్ హాట్ పాలిటిక్స్ నడిచాయి. ఇప్పటివరకు ఓ లెక్క.. రేపటి నుంచి మరో లెక్క. నేనే వస్తున్నా.. తోలు తీస్తా. ప్రజలతో కలిసి కాంగ్రెస్ భరతం పడతానంటూ కాక రేపారు బీఆర్‌ఎస్ అధ్యక్షుడు. అందుకు సమాధానంగా తోలు తీస్తానన్న వాళ్ళ నాలుక కోస్తానంటూ అసెంబ్లీ వేదికగానే వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్. మరోవైపు నీళ్ళ విషయంలో తెలంగాణకు అన్యాయం చేసినందుకు కేసీఆర్‌ను ఉరి తీసినా పాపం లేదంటూ హీట్ పెంచారు రేవంత్. ఆ వాతావరణం చూసిన వాళ్ళు ఇప్పుడు ఇలాంటి సన్నివేశాన్ని మాత్రం అస్సలు ఊహించలేదు. ఆ అంచనాలను తల్లకిందులు చేస్తూ…. సాంప్రదాయానికి పెద్దపీట వేసి సీఎం మంత్రుల్ని పంపడం, కేసీఆర్ కూడా పాజిటివ్‌గా రెస్పాండ్ అవడంతో పద్ధతులు పద్ధతులే పాలిటిక్స్ పాలిటిక్సేనన్న మాటలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా సభకు వచ్చిన కేసీఆర్ దగ్గరికి వెళ్ళిమరీ సీఎం కరచాలనం చేయడం స్ఫురణకు వస్తోంది. ఇదే సందర్భంలో గతాన్ని కూడా గుర్తుచేసుకుంటున్నారు పలువురు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో… ప్రమాదవశాత్తు అయిన కాలి గాయంతో ఆసుపత్రిలో చేరారు బీఆర్‌ఎస్ అధ్యక్షుడు.
అప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి ఆసుపత్రికి వెళ్ళి ఆయన్ని పరామర్శించి మంచి సాంప్రదాయానికి తెర తీశారంటూ ఇప్పుడు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. అలాగే.. ఆ తర్వాత సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలని కోరుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫామ్‌హౌస్‌కు వెళ్ళి కేసీఆర్‌ని కలిశారు. అప్పుడు కూడా పొన్నంను సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్ ఆయనతో కలిసి భోజనం చేసి సాదరంగా సాగనంపారు. ఇక తాజాగా మహిళా మంత్రుల ఎపిసోడ్ మొత్తానికే హైలైట్ అంటున్నారు పరిశీలకులు. అయితే… ఇదే సమయంలో అంతర్లీనంగా మరో అంశంగా దాగి ఉండవచ్చన్న విశ్లేషణలు సైతం ఉన్నాయి. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఎవర్నీ కలవరు, అపాయింట్‌మెంట్ ఇవ్వరన్న విమర్శలకు చెక్ పెట్టే వ్యూహం కూడా ఉండి ఉండవచ్చంటున్నారు. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా… ఓవరాల్‌గా ప్రజాక్షేత్రంలో కత్తులు దూసుకుంటున్న, పరుష పదజాలంతో దుమ్మెత్తిపోసుకుంటున్న నాయకులు సంప్రదాయాల విషయంలో మాత్రం పద్ధతిగా ఉండటం మంచి పరిణామమేనని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.