Off The Record: సింహపురి పొలిటికల్ హీట్ సర్రున పెరగబోతోందా? మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ చుట్టూ ఉచ్చు గట్టిగా బిగుస్తోందా? ఆ విషయంలో టీడీపీ నేతల ఓపెన్ సవాల్ వెనక ఏదో ఉందా? పకడ్బందీగా గ్రౌండ్ వర్క్ జరుగుతోందా? మాజీ మినిస్టర్ మీద ఎలాంటి కేసులు బుక్ అయ్యే అవకాశం ఉంది? అందుకు ముహూర్తాలేమన్నా ఉన్నాయా?
Read Also: LIC Jeevan Shanti: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం ఒక లక్ష పెన్షన్..!
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ… ఆ దిశగా పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తున్నారు టీడీపీ నాయకులు. సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగిన అక్రమ మైనింగ్‌కు సంబంధించి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఇప్పటికే కేసు బుక్ అయింది. అలాగే.. వరదాపురం సమీపంలోని గిరిజన కాలనీ వాసులను బెదిరించారంటూ.. అట్రాసిటీ కేసు కూడా నమోదైంది కాకాణి మీద. ఈ కేసులకు సంబంధించి విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చినా స్పందించలేదాయన. దీంతో పోలీసులు అరెస్ట్ చేయాలని చూస్తున్నా.. దాగుడు మూతలాడుతున్నారట కాకాణి. ఆయన ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. అదేవిధంగా కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పై కూడా పోలీస్ కేసు నమోదైంది. మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేసిన అమృత్ పథకం పైలాన్ 2020లో ధ్వంసం అయింది. దీనికి సంబంధించి ప్రతాప్ కుమార్ రెడ్డిని నిందితుడిగా చేరుస్తూ కేసు బుక్ చేశారు పోలీసులు.
Read Also: Off The Record: పటాన్‌చెరు కాంగ్రెస్‌లో తీరం దాటని తుఫాన్
అయితే, ఆయనతో పాటు కావలి వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్, పట్టణ వైసిపి అధ్యక్షుడు, ఇంకా పలువురి మీద కేసులు పెట్టారు. ఆ కేసుకు సంబంధించి ప్రతాప్ కుమార్ రెడ్డి కోసం వెదుకుతున్నారు పోలీసులు. ఈ క్రమంలో ఇప్పుడు మరో మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ వంతు వచ్చినట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలోనే సైదాపురం మండలంలో అక్రమంగా తెల్లరాయిని తవ్వేసుకుంటున్నారని తాజాగా ఆరోపించారు అనిల్. ఇందుకు సంబంధించి పలు పత్రాలను కూడా విడుదల చేశారాయన. వేమిరెడ్డికి అనుకూలంగా ఉన్న గనులకు మాత్రమే అధికారులు అనుమతులు ఇచ్చారని, మిగతా వాటికి ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారాయన. వారం రోజుల లోపు ప్రభుత్వం స్పందించకుంటే… తాను గనుల యజమానుల తరఫున ఆందోళన చేస్తానని హెచ్చరించారు అనిల్. దీంతో నష్ట నివారణ చర్యల కోసం.. టిడిపి నేతలు రంగంలోకి దిగారు.
Read Also: CV Anand: హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్కు అంతర్జాతీయ అవార్డు.. ఏకంగా 138 దేశాలు పోటీ!
ఇక, వేమిరెడ్డి తరపున టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎం.ఎల్.సి. బీదా రవిచంద్ర స్పందించారు. అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఉన్న సమయంలో గూడూరు, సైదాపురం ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ ఏ స్థాయిలో చేశారో అందరికీ తెలుసునని అన్నారు. అప్పట్లో గనుల యజమానుల నుంచి తెల్లరాయినంతా..అనిల్ వర్గీయులే ఇష్టం వచ్చిన రేటుకు కొని భారీగా ఎక్స్‌పోర్ట్ చేసి అడ్డగోలుగా సంపాదించారని ఆరోపించాయన. అక్రమ మైనింగ్‌తో పాటు అనిల్ జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అవకతవకలపై కూడా కేసులు పెట్టి అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు బీదా. అనిల్ హయాంలో ఆయన శాఖలో జరిగిన వ్యవహారాలపై ఇప్పటికే ఇంజనీర్ల బృందం ఒక నివేదికను తయారు చేసినట్టు తెలుస్తోంది. పనులు పూర్తవకపోయినా.. బిల్లులు ఇవ్వడం.. నాణ్యతా లోపం.. అవసరం లేని చోట కూడా పనులు చేయడం లాంటి వ్యవహారాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించారట.
అంతేగాక గూడూరు.. సైదాపురం మండలాలలో అనిల్ ఆధ్వర్యంలో జరిగిన అక్రమ మైనింగ్ పై కూడా ఆయా ప్రాంతాల నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించినట్టు తెలిసింది. మైనింగ్ వ్యవహారంలో అనిల్ కు సహకరించిన వారి వివరాలను కూడా టిడిపి నేతలు రాబడుతున్నారట. ఇవన్నీ పకడ్బందీగా జరుగుతున్న క్రమంలోనే…ఎమ్మెల్సీ నోటి నుంచి అనిల్‌ను అరెస్ట్ చేస్తామన్న మాట వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. కేసులు పెట్టి అనిల్‌ని ఉక్కిరిబిక్కిరి చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. గనుల యజమానులందరికీ తెల్ల రాయి తవ్వకానికి అనుమతులు ఇవ్వకపోతే.. వారి తరఫున ఆందోళన చేస్తానని కూడా అనిల్ హెచ్చరించారు. ఇక ఉపేక్షిస్తే లాభం లేదని, మాజీ మంత్రిని కట్టడి చేయాల్సిందేనని టీడీపీ నాయకులు అనుకుంటున్నట్టు తెలుస్తోంది. అలాగే.. టిడిపి నేతలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళ జాబితా కూడా సిద్ధం చేస్తున్నారట. ఇప్పుడు వాళ్ళని కట్టడి చేయకుంటే.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురవుతాయన్న తెలుగుదేశం నాయకుల అభిప్రాయంగా తెలుస్తోంది. ముందు సీనియర్ లీడర్ల మీద కేసులు బుక్ చేస్తే…. కింది స్థాయి నాయకులు సెట్ అవుతారని అనుకుంటున్నట్టు సమాచారం. మొత్తం మీద నెల్లూరు జిల్లాలో కేసుల వ్యవహారం మరోసారి కాక రేపే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు.