Off The Record: వాళ్ళిద్దరూ అధికార పార్టీ లీడర్స్. పైగా గతంలో ముఖ్యమైన పదవులు నిర్వహించినవారే. కానీ… ఇప్పుడు పవరున్న పార్టీలో ఉండి కూడా రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. అవసరమైతే అధికారులను, పాలకులను నిలదీయండని జనానికి సలహా ఇస్తున్నారు. ఎవరు వాళ్ళు? ఎందుకలా చేస్తున్నారు? ప్రజా ప్రయోజనమా? లేక వాళ్ళ వ్యక్తిగత ఉనికి కోసమా?.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు కాంగ్రెస్ నేతల వ్యవహార శైలి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్‌లో రెండేసి సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన నాయకులు పార్టీ అధికారం కోల్పోగానే హస్తం గూటికి చేరిపోయారు. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి గురించిన చర్చ గట్టిగానే జరుగుతోందట. వీళ్లిద్దరూ పార్టీలైన్‌తో సంబంధం లేకుండా తమకు నచ్చినట్టు కార్యక్రమాలు చేసుకుంటూ.. అధికార పార్టీలో ఉండి కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం ఏంటన్నది క్వశ్చన్. ఇటీవల కోనప్ప కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు.తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మంజూరైన గుండాపేట బ్రిడ్జి, ఇతర రోడ్ల పనులను కొంతమంది కాంగ్రెస్ నేతలు రద్దు చేయించారని బాహాటంగానే విమర్శించారాయన.మరో అడుగు ముందుకేసి ఊర్లలోకి వచ్చిన నేతలను వంతెన కోసం నిలదీయాలంటూ పిలుపునివ్వడం కలకలం రేపింది. ఆ తర్వాత పార్టీ అదిష్టానం రంగంలోకి దిగడం సదరు నేత సీఎం ను కలవడం అంతా సైలెంట్ అయింది.
Read Also: Off The Record: పి.గన్నవరంలో జనసేన, టీడీపీ ఆధిపత్య పోరు?
అయితే, ఆ తర్వాత జరిగిన రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ సమావేశానికి సైతం కోనప్ప దూరంగా ఉన్నారట. సిర్పూర్ అభివృద్దే నా అజెండా…నేను మంజూరు చేయించిన పనుల్ని పూర్తి చేయించడమే లక్ష్యమని ఆయన అనడం కలకల రేపుతోంది. అంటే కోనప్ప కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా… సిర్పూర్‌లో పర్సనల్ ఇమేజ్ పెంచుకునే పనిలో ఉన్నారా అని మాట్లాడుకుంటున్నారు స్థానిక నాయకులు. మరోవైపు మాజీ మంత్రి ,కాంగ్రెస్ నేత ఇంద్రకరణ్ రెడ్డి ఇటీవల నిర్మల్ జిల్లాలోని పాక్‌పట్ల పామాయిల్ పరిశ్రమపై పోరాటం చేస్తానని ప్రకటించారు. ధర్నాకు పిలుపునివ్వడం, ఆర్డీఓ కార్యాలయం వద్ద రైతులు,తన అనుచరులతో కలిసి ఆందోళన చేయడం సంచలనమైంది. అందుకు సెటైరికల్‌గా…. ఏపార్టీలో ఉన్నావో తెలుసుకోని పోరాటం చేయి అంటూ విమర్శల బాణాలు ఎక్కుపెట్టారట ప్రతిపక్ష నాయకులు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా సరే… రైతుల మేలు కోసం పోరాడతానని ప్రకటించారు మాజీ మంత్రి. పామాయిల్ పరిశ్రమ కోసం బీఆర్‌ఎస్ హయాంలో ఇంద్రకరణ్‌రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు భూమి జరిగింది. అయితే… అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వ పెద్దల మీద తనవంతు వత్తిడి తెచ్చి పనులు చేయించకుండా… ఇలా ప్రతిపక్ష నాయకుడిలా రోడ్డెక్కి ఆందోళనలు చేస్తే ఉపయోగం ఏంటని అడుగుతున్నారు కొందరు.
Read Also: Off The Record: BRS హయాంలో కీలకంగా ఉన్న వాళ్ళు తిరిగి అవే స్థానాలకు?
కాగా, ఇటీవల మీనాక్షి నటరాజన్ మీటింగ్ హాజరైన ఇంద్రకరణ్ అక్కడ రైతుల సమస్యను ప్రస్తావించివచ్చి నేరుగా పోరుబాట ఎంచుకోవడంపై చర్చ జరుగుతోంది జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో. ప్రభుత్వం చేతిలో ఉంది..అధికారులు ప్రభుత్వంలో ఉన్న వారి మాటలే వింటారు..అలాంటిది మాజీ మంత్రి కాంగ్రెస్ కండువాలు లేకుండా రైతులతో కలిసి పైగా ఏకంగా తన సొంత బ్యానర్ ఏర్పాటు చేసుకోని మరీ ధర్నా చేయడం వ్యక్తిగత ప్రయోజనాల కోసమా లేదంటే వేరే ఆలోచనలో పడ్డారా అని మాట్లాడుకుంటున్నారు. అధికార పార్టీ నాయకుడు ఇలా ఉద్యమం చేయడం, అదీ పాత ప్రభుత్వంలోని ఫ్యాక్టరీ కోసం ఫైట్ చేస్తుండడాన్ని మహేశ్వర్ రెడ్డి లాంటి ప్రతిపక్ష నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారట.. ప్రైవేట్ కంపెనీ ఇచ్చే చిల్లర పైసల కోసం మాజీ మంత్రి ఆందోళనకు దిగుతున్నారంటూ ఆరోపిస్తున్నారు. అక్కడ కోనప్ప, ఇక్కడ ఐకే రెడ్డి హస్తం పార్టీలోనే కొనసాగుతూ తమ పనుల కోసం లేదా అప్పటి ప్రభుత్వం మంజూరు చేసిన పనుల కోసం పట్టుబట్టడం వెనకున్న మతలబ్ ఏంటో తేలాల్సి ఉందంటున్నారు స్థానికులు. చాలా రోజులుగా సైలంట్ గా ఉన్న నేతలు ఉనికి కోసం ఆరాటపడతూ ఇలా చేస్తున్నారా…నిజంగానే రైతులు,జనం మీదున్న ప్రేమతో ఇలా చేస్తున్నారా లేక ఇతరత్రా పొలిటికల్ ఆలోచనలు ఉన్నాయా అని మాట్లాడుకుంటున్నారు. నేతల సొంత పోరాటాలతో అనుకున్న లక్ష్యం నెరవేరుతుందా..లేదో చూడాలి మరి.