Off The Record: ఆ బంగారం మంచిదే… కానీ, చుట్టూ ఉన్న మకిలిని మాత్రం వదిలించుకోలేకపోతోందట. కఠిన నిర్ణయం తీసుకోలేని తత్వంతో మంచివాడని పేరున్న ఎమ్మెల్యే కూడా బద్నాం అవుతున్నారట. చుట్టూ చేరిన మట్టి మాఫియా కబంధహస్తాల్లో కీలుబొమ్మగా మారాడని అంటున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఎందుకొచ్చిన రాజకీయాలు రా.. దేవుడా.. అని ఆయన తల పట్టుకుంటున్నారన్నది నిజమేనా?.. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణకు మంచివాడన్న ఇమేజ్ ఉన్నా… ఇప్పుడు కొన్ని వ్యవహారాల్లో హాట్ టాపిక్ అవుతున్నారాయన. జనసేన పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు గిడ్డి. దీంతో ఇప్పుడు నియోజకవర్గంలోని జనసేన, టిడిపి నేతల మధ్య ఆధిపత్యపోరు జరుగుతోందని అంటున్నారు.
Read Also: YS Jagan: చెన్నైలో దక్షిణ భారత అఖిలపక్ష సమావేశం.. వైఎస్ జగన్కు ఆహ్వానం..
అయితే, తరచూ రెండు వర్గాల మధ్య వాగ్వివాదాలు జరుగుతున్నాయి.ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు సత్యనారాయణ. జనం కోసం ఏదన్నా చేద్దామన్న తపన ఆయనకు ఉన్నా… లోకల్ పాలిటిక్స్‌లో కుదరడం లేదని, ఎమ్మెల్యే కొందరి చేతిలో కీలు బొమ్మగా మారుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి పి.గన్నవరంలో. కూటమి నాయకుల సిఫార్సు లేనిదే ఏ పనీ జరగడం లేదట. అదే సమయంలో వాళ్ళ మీద వస్తున్న ఆరోపణలు అన్ని ఇన్ని కావు. ప్రతి పనికి ఇంత రేటని కట్టి వసూళ్ళు చేస్తున్నారట. ఇసుక, మట్టి మాఫియాలను పోషిస్తూ నియోజకవర్గంలోని కూటమి నేతలు కోట్లాది రూపాయలు దండుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ఉద్యోగుల బదిలీల్లోనూ భారీగా డబ్బు చేతులు మారుతున్నట్టు చెప్పుకుంటున్నారు. రాజకీయాల్లోకి రాకముందు నుండి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఎమ్మెల్యే సత్యనారాయణ.
Read Also: AP High Court: తిరుమలో నిర్మాణాలపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఇక, కరోనా సమయంలో నియోజకవర్గంలోని పలువురికి వైద్యం కోసం ఆర్థిక సహాయం అందించారు. ఎమ్మెల్యే అయ్యాక కూడా తన సొంత డబ్బు ఖర్చు పెడుతున్నారన్న పేరుంది. ఇంతవరకు బాగానే ఉన్నా పనితీరు విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గంలోని కూటమీ నేతలను సమన్వయ పరచడంలో విఫలమయ్యారన్న అభిప్రాయం గట్టిగా ఉంది. ఇక్కడి కూటమి నేతల వ్యవహారశైలి నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తోందని అంటున్నారు. సంక్రాంతి పండుగ సమయంలో కోడి పందాలు, గుండాటల ద్వారా పెద్ద మొత్తంలో వసూళ్లు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. నామినేటెడ్ పదవుల కేటాయింపులో కక్ష సాధింపు వ్యవహారాలు నడుస్తున్నాయని కూటమి నేతల్లోనే అసంతృప్తి ఉందట. ఇన్నీ చూస్తూ….ఎమ్మెల్యే ఊరుకుంటున్నారా? చర్యలు తీసుకుంటారా? అనేది ప్రశ్న. అదే సమయంలో ఈ దోపిడీపై వ్యవహారాల మీద చర్యలు తీసుకోవడానికి ఎమ్మెల్యే వెనుకడుగు వేస్తున్నారని, ఆయనకు ధైర్యం చాలడం లేదన్న టాక్ నడుస్తోంది నియోజకవర్గంలో. ఒక్కోసారి ఇదెక్కడి ఖర్మరా… బాబూ అని తలపట్టుకుంటున్నట్టు సమాచారం. పోలీస్ శాఖలో ఉన్నత ఉద్యోగం మానేసి అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా అని మధనపడుతున్నారట ఆయన. ఇప్పటికైనా ఎమ్మెల్యే తన భయాలు, అనుమానాల్ని వదిలేసి కొరడా తీసుకోకుంటే…అంతిమంగా బద్నాం అయ్యేది ఆయనేనని, ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలనిఅంటున్నారు పరిశీలకులు.