రాజకీయంగా ఉప్పు నిప్పుగా ఉన్న ఆ ఇద్దరు నేతలు అసెంబ్లీ లాబీలో భేటీ అయ్యారు. ఏదో పలకరింపుగా కాకుండా.. ఎక్కువ సేపే మాట్లాడుకున్నారు. దాంతో ఇద్దరి ముచ్చట్లు ఏంటో తెలుసుకోవాలన్న ఆత్రుతతో ఉన్నారు అధికారపార్టీ నాయకులు. ఎవరు ఎదురుపడినా వాళ్ల గురించే ఆరా తీస్తున్నారట. ఇంతకీ ఎవరా లీడర్స్..?
ఈటల రాజకీయ ప్రయాణంపై అందరి చూపు
మలి విడత తెలంగాణ ఉద్యమంలో అప్పటి TRSలో ముందు నుంచి ఉన్నారు ఈటల రాజేందర్. 2014లో కేసీఆర్ సర్కార్ ఏర్పాటుతో మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. 2018 ముందస్తు ఎన్నికల్లో మళ్లీ హుజూరాబాద్ నుంచి గెలిచి మరోసారి కేబినెట్‌లో ఎంట్రీ ఇచ్చారు ఈటల. ఇంతలో రాజకీయ పరిణామాల్లో వచ్చిన మార్పుతో గులాబీ పార్టీ నుంచి బయటకు వచ్చారు ఈ మాజీ మంత్రి. బీజేపీలో చేరి ఉపఎన్నికలో హుజూరాబాద్ నుంచి గెలిచారు. అప్పటి నుంచి ఈటల రాజకీయ ప్రయాణంపై అందరి చూపు ఉందనే చెప్పాలి.
అసెంబ్లీ లాబీలో కేటీఆర్, ఈటల ముచ్చట్లు
ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో BRS సర్కార్‌ను టార్గెట్ చేస్తున్నారు ఈటల రాజేందర్. అదే సమయంలో మంత్రులు సైతం ఈటలను, బిజెపిని లక్ష్యంగా చేసుకుని పదునైన విమర్శలే చేస్తున్నారు. తమ పార్టీలో ఉన్నప్పుడే ఈటల బాగుండే అని ఒకరిద్దరూ కామెంట్స్ చేశారు. బీజేపీలోకి వెళ్లిన తర్వాత ఏమైందో అంటూ సైటైర్లు వేస్తున్నారు గులాబీ నేతలు. అయితే అసెంబ్లీ సమావేశాల్లో ఒకరిద్దరు గులాబీ MLAలు సైతం ఈటలను ఆప్యాయంగా పలకరించడం మీడియా కంట పడింది. తాజాగా అసెంబ్లీ లాబీల్లో మంత్రి కేటీఆర్.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల భేటీ అయ్యారు. దానిపైనే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ఇద్దరు నేతలు ఎక్కువ సేపే మాట్లాడుకున్నారట
అసెంబ్లీ లాబీలో కేటీఆర్, ఈటల ఇద్దరూ ఏదో కొద్దిసేపు కాకుండా.. ఎక్కువసేపే మాట్లాడుకున్నట్టు ఆ ముచ్చట చూసిన ఎమ్మెల్యేలు చెబుతున్నారు. రాజకీయ ప్రయాణం వేరు పడిన తర్వాత ఇద్దరు మాట్లాడుకోవడం అదే. అందుకే ఇద్దరి కలయికను రెప్పవాల్చకుండా చూశారు మిగతా ఎమ్మెల్యేలు. వారి దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయలేదట. అక్కడ మాట్లాడుతోంది కేటీఆర్.. ఆయనతో ఉన్నది ఈటల కావడంతో వారి మధ్యలో చొరబడేందుకు ఎవరూ సాహసించలేదని తెలుస్తోంది. దాంతో ఈటల, కేటీఆర్ ఏం మాట్లాడుకున్నారు? అని అధికార పార్టీ వర్గాలు తెగ ఆరా తీస్తున్నాయి.
ఏం మాట్లాడుకున్నారో అని ఎమ్మెల్యేల ఆరా..!
ఆ లాబీ ఎపిసోడ్ తర్వాత ఏ ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసినా.. నీకు ఈ సంగతి తెలుసా? కేటీఆర్, ఈటల మాట్లాడుకున్నారు.. వాళ్లేం మాట్లాడుకున్నారో నీకు తెలుసా అని ఆరా తీస్తున్నారట. అదేంటో తెలుసుకుని తీరాల్సిందే అని కొందరు ఎమ్మెల్యేలు పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తోంది. కనిపించిన వారిని పదే పదే గుచ్చి గుచ్చి అడుగుతున్నారట. మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి ఈటల లంచ్ చేయడం కూడా ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది.
లాబీ సీన్ ఉత్కంఠ రేపుతోందా?
ఈటల బీజేపీలోకి వెళ్లిన తర్వాత గులాబీ నేతలు ఆయన్ని గట్టిగానే కార్నర్ చేశారు. ఎమ్మెల్యేగా గెలిచి తిరిగి అసెంబ్లీలో అడుగు పెట్టిన తర్వాత పలు సందర్భాల్లో సస్పెండ్ చేశారు. ప్రస్తుత సమావేశాల్లో ఈటలకు బాగానే మాట్లాడే అవకాశం దక్కింది. దీనిపై ఏంటి సంగతి? అని ఆరా తీస్తుండగానే లాబీ సీన్ మరింత ఉత్కంఠగా మారింది. కేటీఆర్, ఈటల ఇద్దరే మాట్లాడుకోవడంతో.. అక్కడ ప్రస్తావనకు వచ్చిన అంశాలు ఏంటో ఈ ఇద్దరు నేతలు చెప్పాలే తప్ప మూడో వ్యక్తికి తెలిసే అవకాశాలు లేవు. పైగా ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో లాబీ ముచ్చటకు ఎక్కడలేని హైప్ తీసుకొస్తున్నాయి రాజకీయ వర్గాలు.