తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీది ఒంటరిపోరా? పొత్తు మాటెత్తితే ఆ పార్టీ ఎందుకు అగ్గిమీద గుగ్గిలం అవుతోంది? ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఏపీతోపాటు తెలంగాణలో టీడీపీ ప్లాన్ ఏంటి?
తెలంగాణలో ఒంటరిపోరుకే బీజేపీ మొగ్గు..!
తెలంగాణలో పార్టీ విస్తరణపై ఎన్నడూ లేనంతగా బిజెపి దృష్టిపెట్టింది. అగ్రనేత అమిత్ షాతోపాటు జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా వరస పర్యటనలు చేస్తున్నారు. హుజురాబాద్‌తోపాటు మునుగోడు ఉపఎన్నికను ఛాలెంజ్‌గా తీసుకుని వ్యూహాలు రచించింది. కొత్తగా సునీల్ బన్సల్ సంస్థాగత ఇంఛార్జ్‌గా వచ్చాక.. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఒక్కో పాలక్‌ను నియమించింది బీజేపీ. బీఆర్‌ఎస్‌తోపాటు కాంగ్రెస్ నుంచి ముఖ్యనేతలను పార్టీలో చేర్చుకోవడానికి ఉత్సాహం చూపిస్తోంది. ప్రతి నియోజకవర్గంలో పోటీ చేసే బలమైన అభ్యర్థి కోసం వేట మొదలుపెట్టింది. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసి బలం నిరూపించుకోవాలని చూస్తోంది కమలంపార్టీ.
ఏపీలో పొత్తుల ప్రభావం తెలంగాణపైనా ఉంటుందా?
తెలంగాణలో ఏపీ కంటే ముందుగానే అసెంబ్లీ ఎన్నికలు వస్తుండటంతో టిడిపి అధినేత ఇక్కడ మరోసారి దృష్టి పెట్టారు. తెలంగాణ టీడీపీకి కొత్త అధ్యక్షుడిని నియమించారు. ఖమ్మంలో భారీ సభ నిర్వహించి తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. త్వరలోనే నిజామాబాద్, వరంగల్‌లో సభలకు ప్లాన్ చేస్తోంది టీటీడీపీ. ఏపీలో పవన్‌కళ్యాణ్‌తో కలిసి పోటీ చేయాలని టిడిపి అనుకుంటున్నా.. జనసేనాని మాత్రం బిజెపితోపాటు టిడిపి కలిసి చేయాలని ఆలోచిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఏపీలో టిడిపితో బీజేపీ కలిసి పోటీ చేస్తే.. తెలంగాణలో కూడా బిజెపి – టిడిపి కలవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే తెలంగాణలోనూ జనసేనను కలుపుకొని వెళ్లక తప్పదు. YS షర్మిల నేతృత్వంలోని వైఎస్‌ఆర్‌టీపీ, ప్రొఫెసర్ కోదండరాం సారథ్యంలోని టీజేఎస్‌ని కూడా చేరదీస్తారని ప్రచారం సాగుతున్నా బీజేపీ నేతలు వాటిని ఖండిస్తున్నారు.
పొత్తు అనే మాట వినిపిస్తే బీజేపీ నేతల ఉలికిపాటు
ఇప్పుడు తెలంగాణ బీజేపీని భయపెడుతోంది ఈ ఏపీ, తెలంగాణ సమీకరణాలే. పొత్తు అనే మాట వినిపిస్తే చాలు ఉలిక్కిపడుతున్నారు కమలనాథులు. ఆ మధ్య నిర్వహించిన పార్టీ సమావేశంలో మాజీ ఎంపీ విజయశాంతి టీడీపీతో పొత్తుపై ప్రశ్నించారు. టిడిపితో కలిసి 2018లో కాంగ్రెస్ నష్టపోయిందని.. ఇప్పుడు బీజేపీ అలాంటి తప్పు చేయొద్దనేది మెజార్టీ కమలం నేతల వాదన. బండి సంజయ్‌తోపాటు అగ్రనేతలంతా ఒంటరి పోరే.. ఎవరితోనూ పొత్తు లేదని క్లారిటీ ఇస్తున్నారు. తాజాగా టీ బీజేపీ ఇంఛార్జ్ తరుణ్‌చుగ్ సైతం ఇదే చెప్పారు. ఈ ఏడాదిలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నా.. పొత్తులపై ముందే ప్రకటన చేస్తే కేడర్ డీలా పడుతుందని.. విమర్శలకు ఆస్కారం ఇచ్చినట్టు అవుతుందనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు మరో ప్రచారం సాగుతోంది. పొత్తులనేవి ఢిల్లీ స్థాయిలో పార్టీ నేతలు తీసుకునే నిర్ణయమని.. అలాంటిది ఏదైనా ఉంటే ఎన్నికల సమయంలోనే స్పష్టత వస్తుందని.. ప్రస్తుతం మాత్రం బీజేపీది ఒంటరి పోరుగానే భావించి కార్యక్షేత్రంలోకి దిగాలని బ్రెయిన్‌వాష్ చేస్తున్నారట.