బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణలో మకాం వేయబోతున్నారా? అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలు ఆయనే తీసుకున్నారా? నెలరోజుల వ్యవధిలో రాష్ట్ర నేతలతో రెండుసార్లు భేటీ దానికి సంకేతాలా? బీజేపీలో చేరికల బాధ్యతలను మరో అగ్రనేత సునీల్ బన్సల్‌కి అప్పగించారా? మిషన్ తెలంగాణలో టీ బీజేపీ వ్యూహం ఏంటి?
చేరికల బాధ్యతలు సునీల్ బన్సల్‌కు అప్పగింత
దక్షిణాదిలో కర్ణాటక తర్వాత కమలం పార్టీ ఆశలు పెట్టుకుంది తెలంగాణ పైనే. గత కొన్నినెలలుగా బీజేపీ ఢిల్లీ పెద్దలు ఈ రాష్ట్రంపై ఫోకస్ పెట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షాలు రెగ్యులర్‌గా తెలంగాణకు వస్తున్నారు. అమిత్ షా నమ్మిన బంటైన సునీల్ బన్సల్‌కు తెలంగాణ బీజేపీ బాధ్యతలు అప్పగించడంతోనే ఇక్కడ ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు అర్ధమవుతోంది. తాజాగా బీజేపీలో చేరికలను సమన్వయం చేసుకునే పని కూడా బన్సలే చేపట్టబోతున్నట్టుగా షా స్పష్టత ఇచ్చారట.
నెల రోజుల వ్యవధిలోనే రెండుసార్లు భేటీ
ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర బీజేపీ కీలక నేతల మధ్య ఉన్న గ్యాప్‌ను తగ్గించేందుకు ఎక్కువ చొరవ తీసుకున్నారు అమిత్ షా. అంతేకాదు.. నెల రోజుల వ్యవధిలోనే రెండుసార్లు ఇక్కడి నేతలను పిలిచి మాట్లాడారు. తరచూ సమావేశం కావాలని దిశానిర్దేశం చేశారు షా. వ్యక్తిగత ఇగోలకు పోవద్దని తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు కూడా. ఢిల్లీ భేటీలో ఈ అంశానికే ఎక్కువ సమయం కేటాయించినట్టు చెబుతున్నారు. దీంతోపాటు తెలంగాణలో బీజేపీని గెలిపించే బాధ్యతను కూడా షానే తీసుకున్నారట.
కర్నాటక ప్లానే తెలంగాణలోనూ అమలు?
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే అమిత్ షా తెలంగాణను అడ్డాగా చేసుకుంటారని సమాచారం. కర్ణాటకలోనే ఉండి అక్కడి ఎన్నికలను పర్యవేక్షించే విధంగా షా కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అలాంటి వ్యవస్థే తెలంగాణలోనూ ఉంటుందట. గత కర్నాటక ఎన్నికల సమయంలో ఆ రాష్ట్ర బీజేపీ నేతల మధ్య గ్రూప్ తగాదాల వల్లే పార్టీకి ఆశించిన మెజారిటీ రాలేదని..ఈ సారి కొట్లాటలు ఉండొద్దనే ఆలోచనతో అక్కడే ఉండేలా ప్రణాళికలు వేస్తున్నట్టు పార్టీ వర్గాల మాట. అదే ప్లాన్ తెలంగాణలోనూ అమలు చేస్తారని అనుకుంటున్నారు.
అమిత్ షానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఇంఛార్జ్..!
ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అమిత్ షానే ఇంఛార్జ్‌గా ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదని స్థానిక నాయకులు అభిప్రాయ పడుతున్నారట. ఈ రాష్ట్రంలో పార్టీకి అనుకూల వాతావరణం ఉందని.. కాకపోతే అంతర్గత సమస్యలతో అంతా ఇబ్బంది పడుతున్నారనే ఫీలింగ్‌లో అధిష్ఠానం ఉందట. వాటిని సెట్ చేయాలంటే ఢిల్లీలో ఉండి ఆదేశాలిస్తే సరిపోదని.. హైదరాబాద్‌లోనే మకాం వేయాలనేది మోటా భాయ్ ఆలోచన అట. ఈ నెల 12న అమిత్ షా మరోసారి తెలంగాణకు వస్తున్నారు. ఆ పర్యటనలో ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో అనే ఉత్కంఠ కాషాయ శిబిరంలో నెలకొంది.
.