Off The Record: 2024 ఎన్నికలలో కూటమి సునామీని తట్టుకుని నిలబడ్డ వైసీపీ ఎమ్మెల్యేల్లో ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నుంచి గెలిచిన తాటిపర్తి చంద్రశేఖర్ ఒకరు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే చంద్రశేఖర్… ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటారు. ఆ విధంగా అధికార పార్టీ నేతలకు టార్గెట్ అవుతున్నారట. అదే సమయంలో నియోజకవర్గంలో రీ ఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్న సొంత పార్టీకి చెందిన సీనియర్ నేత కూడా యర్రగొండపాలెం ఎమ్మెల్యేకి పొగబెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అధికార పార్టీ నుంచి ఉండే వత్తిడి సహజమే… ఊహించిందే అయినా…. సొంత వైసీపీ నాయకులు తీస్తున్న గోతులు అర్ధంకావడంలేదని వాపోతోందట ఎమ్మెల్యే వర్గం. గత ఎన్నికల ముందు అనూహ్యంగా టికెట్ దక్కించుకుని గెలిచారు చంద్రశేఖర్. అదే సమయంలో అప్పటిదాకా యర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ఉన్న మాజీమంత్రి ఆదిమూలపు సురేష్‌ని కొండేపికి ట్రాన్స్ఫర్ చేసింది వైసీపీ అధిష్టానం. అక్కడ పోటీ చేసి ఓడిపోయారాయన. ఆ తర్వాత అక్కడ నుంచే రాజకీయాలు చేస్తున్నా… ఆదిమూలపు చూపు మాత్రం యర్రగొండపాలెం వైపే ఉందని అంటున్నారట ఆయన సన్నిహితులు.
ఇప్పటికీ ఆయన నియోజకవర్గ వైసీపీలోని ఓ టీంతో టచ్‌లో ఉన్నారన్నది పార్టీ టాక్. స్థానిక పార్టీ నేతలకు సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా హాజరవుతూ గ్యాప్ రాకుండా చూసుకుంటున్నారట. గతంలో ఆదిమూలపు సురేష్ తో సన్నిహితంగా ఉన్న కొందరు ఇటీవల టీడీపీలోకి వెళ్లారు. అందులో కూడా చాలా ఈక్వేషన్స్ ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. మాజీ మంత్రి సురేష్ కూడా టీడీపీకి వెళ్తున్నారని ఆ మధ్య ప్రచారం జరిగింది. అందుకు ఆయన రియాక్ట్ కానప్పటికీ.. గతంలో కొందరు.. తాజాగా మరికొందరు యర్రగొండపాలెం వైసీపీ నేతలు టీడీపీకి వెళ్లటం యాదృచ్చికం కాదనేది ఓ విశ్లేషణ. సురేష్ విషయంలో ఇప్పటికిప్పుడు ఏం జరగక పోయినా.. ఏదో జరగబోతోందన్నది మాత్రం ఇన్‌సైడ్ టాక్. ఈ గందరగోళంలోనే…. సురేష్ తిరిగి యర్రగొండపాలెం రీబ్యాక్ అయ్యేందుకు పావులు కదుపుతన్నారన్న అనుమానాలు ఉన్నాయట. ఇక్కడ వైసీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యేగా చంద్రశేఖర్ ఉండటంతో ఆ పార్టీ నాయకుడిగా తిరిగి రావడం అంత తేలిక కాదని, ఒకవేళ ఆదిమూలపు తిరిగి రావడమంటూ జరిగితే ఏ రూపంలో అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు. ఈ చర్చ ఇలా నడుస్తుండగానే.. అసలు సిట్టింగ్ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖరే టీడీపీలోకి వెళ్తున్నారన్న మరో ప్రచారం మొదలైంది.
దాని ప్రభావంతోనే… ఇటీవల అసెంబ్లీకి వెళ్లినప్పుడు వైసీపీ కండువా లేకుండా వచ్చారని, కండువా మర్చిపోయావా.. లేక మార్చడానికి సిద్ధంగా ఉన్నావా అంటూ పార్టీ అధ్యక్షుడు జగన్ క్లాస్ పీకారంటూ ప్రచారం జరిగింది. కానీ… అదంతా తప్పుడు ప్రచారం అని ఖండించారు చంద్రశేఖర్. అయితే… గత ఎన్నికల్లో అప్పటి వైసీపీ కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి అండతోనే తాటిపర్తికి సీటు వచ్చిందని, ఇప్పుడు బాలినేని జనసేనకు వెళ్లటంతో చంద్రశేఖర్ కూడా వెళ్తారన్న ప్రచారం గట్టిగానే జరుగుతోంది నియోజకవర్గంలో. ఇలా… ఇంటా బయటా… వత్తిళ్ళతో జోడు మద్దెల దరువులా మారిందట యర్రగొండపాలెం ఎమ్మెల్యే పరిస్థితి. ఓవైపు సోషల్ మీడియాలో విమర్శలకు ప్రభుత్వం నుంచి నోటీసులు, మరోవైపు వెళ్ళిపోతాడంటూ సొంత పార్టీవాళ్లే చేస్తున్న ప్రచారంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట ఆయన. మొత్తం మీద యర్రగొండపాలెం పిక్చర్ క్లియర్ అవ్వాలంటే… ఇంకొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.