Off The Record: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక మీద బోలెడు ఆశలు పెట్టుకుంది తెలంగాణ బీజేపీ. వాస్తవంగా మాట్లాడుకుంటే…. ఆ పార్టీకి సీటు గెలిచేంత బలం లేదు. ఆ విషయం పార్టీ ముఖ్యులు అందరికీ తెలుసు. పిక్చర్ క్లియర్‌గా ఉంది. అయినా సరే… ఉనికి కోసం బరిలో దిగింది కాషాయ దళం. అంతవరకు బాగానే ఉంది. కానీ…. ఆ పోటీ పేరుతో తమను తాము పరీక్షించుకునే దగ్గరే తేడా కొట్టిందంటున్నారు పరిశీలకులు. బీజేపీ కార్పొరేటర్స్ అందరి ఓట్లు కమలానికి పడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ… వేరే పార్టీల అభ్యర్థుల పక్క చూపుల మీద చాలా ఆశలు పెట్టుకున్నారు కమలనాథులు. మజ్లిస్ పార్టీ ఓట్లు ఎలాగూ పడవు కాబట్టి… బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్స్‌లో కొద్ది మంది అయినా తమవైపు మొగ్గు చూపుతారని అనుకున్నారట బీజేపీ లీడర్స్. అయితే… ఇలాంటివేవో జరుగుతాయన్న ముందు చూపుతో… అసలు ఓటింగ్‌కే దూరంగా ఉంది బీఆర్‌ఎస్. కాంగ్రెస్ కార్పొరేటర్స్‌లో ఒకరిద్దరన్నా తమవైపు మొగ్గుతారని భావించారట కమలం నాయకులు. కానీ… ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం చూస్తే… ఆ అంచనాలు తప్పని తేలిపోయింది. బీజేపీకి ఉన్న ఓట్లు మాత్రమే పడ్డాయి. దీంతో… ఆ పార్టీ వైపు చూడ్డానికి వేరే పార్టీల నాయకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదన్న చర్చ మొదలైంది.
ఉన్న బలం కంటే ఒకటి రెండు ఓట్లు ఎక్కువ వచ్చినాసరే… మేం సక్సెస్ అయినట్టేనంటూ పోలింగ్‌కు ముందు పెద్ద పెద్ద మాటలే మాట్లాడారు బీజేపీ నాయకులు. తీరా… ఒక్క ఓటు కూడా అదనంగా పడకపోయేసరికి కంగుతిన్నట్టు సమాచారం. అంటే…ఇంకా క్షేత్ర స్థాయిలో మన మీద నమ్మకం కలగడం లేదా…? అందుకే కాషాయ కండువా కప్పుకునేందుకు వెనకడుతున్నారా… అన్న అంతర్మథనం మొదలైందట. ఆత్మప్రభోదానుసారం ఓటేయండి. హైదరాబాద్‌ని మజ్లిస్‌కు తాకట్టు పెట్టవద్దంటూ… రకరకాల ఎమోషన్స్‌ని అప్లయ్ చేసినా.. బీజేపీయేతర కార్పొరేటర్స్ ఎవ్వరూ ఇటువైపు మొగ్గు చూపలేదు. కనీసం ఆ పార్టీని వీడిన వారు కూడా.. ఇప్పుడు తామున్న పార్టీకే కట్టుబడి ఉన్నారు తప్ప కమలానికి ఓటేయలేదు. దీంతో… ఒకరిద్దరు టచ్‌లో ఉన్నారు… భవిష్యత్‌లో బీజేపీ టికెట్ హామీ ఇస్తే వస్తామని అన్నారంటూ ముందు చేసిన ప్రచారం అంతా ఉత్తుత్తిదేనని తేలిపోయింది. ఒకరిద్దరు కాస్త అటు ఇటుగా ఆలోచించినా… మనం ఆ దిశగా వాళ్ళకు భరోసా ఇవ్వలేకపోయామన్న చర్చ ఇప్పుడు జరుగుతోందట కాషాయదళంలో.
వాస్తవంగా చూసుకుంటే….వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని అనుకుంటోంది తెలంగాణ బీజేపీ. అలా జరగాలంటే… ముందు క్షేత్ర స్థాయిలో బలపడటం ముఖ్యం. దాని కోసమే… పక్క పార్టీల నుంచి నాయకుల్ని ఆకర్షించాలని, పార్టీ కండువాలు కప్పాలన్న ఆలోచనలో ఉందట. అందుకు ఎమ్మెల్సీ ఎన్నికను ట్రయల్ రన్‌గా భావించినా…. వర్కౌట్ అవలేదంటున్నారు పరిశీలకులు. కింది స్థాయి నాయకుల్ని తమవైపునకు తిప్పుకోవాలని అనుకుంటున్నా…. వాళ్ళలో భరోసా నింపలేకపోతున్నామన్న చర్చ కొత్తగా మొదలైందట తెలంగాణ కాషాయ దళంలో. రాష్ట్రం మొత్తం మీద ఇలా గ్రౌండ్ లెవల్ లీడర్స్‌ని లాగాలనుకుని, ముందుగా పార్టీకి గట్టి బలం ఉందని భావిస్తున్న హైదరాబాద్‌లో ట్రయల్ వేస్తే.. అది సక్సెస్ కాలేదని, ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఎలా నమ్మకం కలిగించగలుగుతారన్నది క్వశ్చన్. ప్రజల్లో సానుకూల వాతావరణం ఉన్నా… పార్టీకి గతంలో లేనంత సభ్యత్వం నమోదైనా…, క్షేత్ర స్థాయిలో ఇతర పార్టీల నుంచి ఎంతోకొంత లాగకుంటే బలపడటం అంత ఈజీ కాదని బీజేపీ వర్గాలే అంటున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని అయినా… ఇక మీదట జాగ్రత్తలు తీసుకోకుంటే… ఎప్పటికీ ఎదురు చూపులు తప్ప బలపడటం ఉండదన్నది కేడర్ అభిప్రాయం. తెలంగాణ కమననాధుల వ్యూహాలు ఎలా మారతాయో చూడాలి మరి.