Off The Record: తెలంగాణలో బీజేపీ వ్యవహారాల మీద ఆ పార్టీ ఢిల్లీ నాయకత్వం ఇక సీరియస్‌గా ఫోకస్ పెడుతున్నట్టు కనిపిస్తోంది. అందులో భాగంగానే… రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సర్ ఇక్కడి నేతలకు గట్టిగా క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన సంస్థాగత ఎన్నికల సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌కు రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా సంఘటన సంరచన ఇన్ఛార్జ్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగానే… పార్టీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్చార్జి సునీల్ బన్సల్ పార్టీ అంతర్గత వ్యవహారాలను సమీక్షించారట. సంస్థాగత ఎన్నికలు, సభ్యత్వం, స్థానిక ఎన్నికలకు సన్నద్ధత, నేతల మధ్య సమన్వయం లాంటి రకరకాల అంశాలపై రివ్యూ జరిగినట్టు సమాచారం. ఈ సందర్భంగా నేతలు ఇచ్చిన రిపోర్ట్‌ను చూసి సునీల్ బన్సల్ ముందు షాయినా… వెంటనే తేరుకుని రాష్ట్ర నేతల మీద ఓ రేంజ్‌లో ఫైరై పోయినట్టు చెప్పుకుంటున్నారు. అంతా కలిసి పార్టీని మోసం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
Read Also: Rahul Gandhi: ‘‘మా విజన్ స్వీకరించినందుకు సంతోషం’’.. కుల గణనపై రాహుల్ గాంధీ..
చివరికి యాక్టివ్ మెంబర్‌షిప్ విషయంలో కూడా చీట్ చేశారని మండిపడ్డారట బన్సల్. ఆ విషయంలో పూర్తిగా తప్పుడు సమాచారం ఇచ్చారని, అంత సీన్ లేకున్నా… సుమారు 9 వేల మంది క్రియాశీల సభ్యత్వం తీసుకున్నట్టు లెక్కలు చూపారంటూ సీరియస్ అయినట్టు తెలిసింది. కేవలం కోపం ప్రదర్శించడమేగాక గట్టిగా తిట్టినట్టు చెప్పుకుంటున్నాయి బీజేపీ శ్రేణులు. మూడు నెలల క్రితం పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉందని, నేను డైరీలో అప్పుడు ఏం రాసుకున్నానో ఇప్పుడు కూడా అదే విషయం చెబుతున్నారంటూ కోప్పడ్డారట రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్. ఇంకా వేయని చోట మండల అధ్యక్షుల నియామకం పూర్తి చేయాలని… మే15 లోపు పూర్తి స్థాయి మండల కమిటీలు ఉండాల్సిందేనని ఆదేశించినట్టు తెలిసింది. దీంతో మీటింగ్‌కు అటెండ్‌అయిన నాయకుల నోట మాట రాలేదని తెలిసింది. అసలు బన్సల్‌లో ఈ స్థాయి కోపాన్ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదని అంటున్నారు ఆ మీటింగ్‌లో ఉన్న నేతలు. పార్టీలో ఉంటే ఉండండి వెళ్లిపోతే పోండన్న రేంజ్‌లో ఆయన మాట్లాడినట్టు చెప్పుకుంటున్నారు. ప్రజల్లోకి వెళ్లాలని మేం నెత్తీనోరూ బాదుకుంటుంటే… మీరు మాత్రం ఏసీ రూంలు వదలకుండా మీటింగ్‌ల పేరుతో కాలక్షేపం చేయడం ఏంటని గట్టిగా ప్రశ్నించారట బన్సల్. మీటింగ్‌లు పార్టీ నాయకులతో కాదు… ప్రజలతో పెట్టండని తలంటేశారట ఆయన. దీంతో బన్సల్ ఉన్నట్టుండి ఎందుకు ఇంత సీరియస్ అయ్యారు? బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏంటని ఆరా తీస్తున్నారట చాలా మంది.
Read Also: YS Jagan: సింహాచలం ఘటన మృతుల కుటుంబాలకు జగన్ పరామర్శ.. ఇది ప్రభుత్వ వైఫల్యమే..!
ఆ క్రమంలోనే… ఆయన మాట్లాడిన కొన్ని మాటలు పార్టీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీని ఉద్దేశించి అన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన పార్టీ ఆఫీస్‌ని వదలకపోవడం, రాష్ట్ర కార్యాలయంలోనే మీటింగ్‌లు పెట్టి రివ్యూలు చేస్తుండటాన్ని దృష్టిలో ఉంచుకునే….అలా మాట్లాడి ఉండవచ్చంటున్నారు. పార్టీ నేతలు వచ్చినా కలవకపోవడం, టైమ్ ఇవ్వకపోవడంపై తివారీ విషయంలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది గులాబీ దళంలో. బన్సల్ తాజా వార్నింగ్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి మరి.