Off The Record: మహబూబ్‌నగర్-రంగారెడ్డి- హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉన్న ఓటర్లు 29 వేల 7 వందల 20. బరిలో ఉన్న అభ్యర్థులు 21 మంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి మరోసారి బరిలో దిగగా.. PRTU నుంచి ఆ సంఘం నేత చెన్నకేశవరెడ్డి పోటీ చేస్తున్నారు. అధికారపార్టీ BRS మద్దతు తనకే అని చెన్నకేశవరెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన హర్షవర్దన్‌రెడ్డి సైతం అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఇక ఈ ఎన్నికల్లో తొలిసారి అధికారిక అభ్యర్ధిని ఫీల్డ్‌లోకి దించింది బీజేపీ. AVNరెడ్డితో నామినేషన్ వేయించి.. ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్నారు కమలనాథులు. ఇందులో ప్రత్యేకత లేకపోయినా.. బీజేపీ నేతలు టీచర్ MLC ఎన్నికల కోసం తీసుకుంటున్న శ్రద్ధే చర్చగా మారుతోంది.
Read Also: Off The Record: భూమా మౌనిక పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా..? ఏ పార్టీ నుంచి పోటీ..?
తెలంగాణలో అధికారంలోకి రావాలన్నది కమలనాథుల ఆశ. అందుకే ఎన్నిక ఏదైనా వదులుకోవడానికి సిద్ధంగా లేరు బీజేపీ నేతలు. ప్రస్తుతం శాసనమండలిలో బీజేపీకి ప్రాతినిథ్యం లేదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న రామచంద్రరావు మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడంతో.. మండలిలో బీజేపీకి చోటు లేకుండా పోయింది. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేసుకునే పట్టుదలతో కనిపిస్తోంది కమలం పార్టీ. అందుకే ఈ మూడు జిల్లాల బీజేపీ నేతలతోపాటు.. రాష్ట్ర నాయకులు ప్రచారంపై ప్రత్యేక ఫోకస్ పెడుతున్నారు. ఢిల్లీ నుంచి బీజేపీ అగ్ర నేతలు వచ్చి సమీక్షలు చేస్తున్నారు. మొత్తం 29వేల మంది టీచర్ ఓటర్లలో 25 మందికో ఇంఛార్జ్‌ను ఏర్పాటు చేసింది బీజేపీ. ఈ పని మొత్తాన్ని సీనియర్ నేత ఇంద్ర సేనారెడ్డి కోఆర్డినేట్ చేస్తున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, తెలంగాణ బీజేపీ సహా ఇంఛార్జ్ అరవింద మీనన్ తదితరులు సమీక్షలు పెడుతున్నారు. అన్నీ కార్యక్రమాలను పక్కన పెట్టి.. ఎక్కువసార్లు ఓటర్లను కలవాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. వివిధ టీచర్ యూనియన్ల నుంచి అభ్యర్థులు పోటీలో ఉండటంతో.. ఓట్లు చీలుతాయనే లెక్కలు వేస్తున్నారు పార్టీ నేతలు. మొదటి ప్రాధాన్యత కాకపోయినా రెండో ప్రాధాన్యత ఓటు AVN రెడ్డికి పడుతుందని ఆశిస్తున్నారు. వీటిని పక్కాగా సమన్వయం చేసుకుంటే ఆశించిన ఫలితం రావొచ్చన్నది వారి అభిప్రాయం.