Off The Record: ఆంధ్రప్రదేశ్‌లో ఏ నియోజకవర్గమైనా సరే కనీసం వారంరోజులైనా ప్రశాంతంగా ఉంటుందేమో కానీ..తాడిపత్రి నియోజకవర్గంలో మాత్రం అలాంటి పరిస్థితి ఎప్పుడూ ఉండదు. దీనికి కారణం ఇక్కడ నేతల మధ్య జరుగుతున్న అధిపత్య పోరు. ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా.. వారు మాత్రం నిత్యం ఏదో ఒక ఇష్యూ రగిలిస్తూనే వుంటారు. 2019 ఎన్నికల ఎన్నికల్లో పెద్దారెడ్డి గెలిచిన తర్వాత జేసీ కుటుంబం చాలా ఇబ్బందులు పడింది. జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. దీంతో 2024 ఎన్నికల్లో జేసీ అస్మిత్ రెడ్డి గెలిచిన తర్వాత పెద్దారెడ్డికి అదే స్థాయిలో ఇబ్బందులు ఎదురయ్యాయి. కనీసం ఆయన తన నియోజకవర్గంలో కూడా అడుగుపెట్టనివ్వకుండా దాదాపు 16 నెలలు పాటు ఆటంకాలు ఎదురయ్యాయి. పోలీసులు సైతం శాంతిభద్రతల సమస్యలు అంటూ పెద్దారెడ్డిని అడ్డుకుంటూ వచ్చారు. చివరకు సుప్రీంకోర్టుకు వెళ్లి తాడిపత్రికి వెళ్లేలా చేసుకున్నారు.
Read Also: Laika sacrifice: చిన్న వీధి కుక్క ‘‘లైకా’’ త్యాగం లేకపోతే, మానవుడు అంతరిక్షానికి వెళ్లే వాడా.?
కోర్టు ఉత్తర్వులు, పోలీసుల జోక్యంతో పెద్దారెడ్డి తాడిపత్రిలోకి అడుగు పెట్టగలిగారు కానీ… ఇతర కార్యక్రమాలు చేసుకోలేకపోతున్నారు పెద్దారెడ్డి. దీనికి కారణం జేసీ ప్రభాకర్ రెడ్డి. పెద్దారెడ్డి ఎక్కడికి వెళ్లినా.. జెసి ప్రభాకర్ రెడ్డి వ్యూహాత్మాక అడ్డుకుంటూ వచ్చారు. పోలీసులు సైతం మళ్లీ శాంతిభద్రతల సమస్యల అంటూ పెద్దారెడ్డికి ఆంక్షలు విధిస్తూ వచ్చారు. తాడిపత్రి నియోజకవర్గంలో తనని అడ్డుకుంటున్నారు. సరే పక్క నియోజకవర్గంలో అయినా ఏవైనా కార్యక్రమాలు చేద్దామంటే.. అక్కడ కూడా ఇలాంటి ఇబ్బందులు కలిగిస్తున్నారు. పామిడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని నిర్వహించాలని పెద్దారెడ్డి చూసారు కానీ.. అక్కడ కూడా జెసి వర్గీయులు అడ్డుకుంటామని హెచ్చరికలు చేయడంతో.. పక్క నియోజకవర్గం సమస్యలు మాకెందుకు అంటూ అక్కడ పోలీసులు పెద్దారెడ్డి మీటింగ్ కు అనుమతి ఇవ్వలేదు. దీంతో పెద్దా రెడ్డి ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. పైగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని చేస్తోంది. దాదాపు 175 నియోజకవర్గాల్లోని కార్యక్రమం జరుగుతోంది. కానీ తాడిపత్రిలో మాత్రం ఈ కార్యక్రమాన్ని జరగనివ్వడం లేదు. పెద్దారెడ్డి నేరుగా కార్యక్రమంలో పాల్గొనక పోయినా.. వైసీపీ నాయకులు పాల్గొన్నా…జేసీ వర్గీయులు అడ్డుకుంటూ వస్తున్నారు.
తాడిపత్రిలో వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. సంతకాల సేకరణను అడ్డుకునే ప్రయత్నంలో ఇరువర్గాలు రాళ్లు విసురుకున్నారు. వైసిపి నేతలకు చెందిన రెండు వాహనాలను టిడిపి నాయకులు ధ్వంసం చేశారు. ఇలా పెద్దారెడ్డి నేరుగా పాల్గొనక పోయినా.. అక్కడ మాత్రం తాము అడ్డుకుంటామన్న సంకేతాలను జేసీ వర్గీయులు పంపుతున్నారు…ఇటీవల భుజం నొప్పి కారణంగా జేసీ ప్రభాకర్ రెడ్డి శస్త్రచికిత్స చేయించుకున్నారు. దీంతో ఆయన తాడిపత్రిలో ఉండటం లేదు. ఇటు పెద్దారెడ్డి కూడా ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఇటీవల మీడియా ముందుకు కూడా ఆయన రావడం లేదు. ఈ ఇద్దరు నేతలు సైలెంట్ గా ఉన్న తాడిపత్రిలో వారు వర్గీయులు మాత్రం వారి నిత్యం ఎక్కడో చోట గొడవలు పడుతున్నారు. తాడిపత్రిలో ఎక్కడా పెద్దారెడ్డి అలికిడి లేదు. కనీసం మీడియాతోనూ మాట్లాడ్డం లేదు. పెద్దారెడ్డి సైలెన్స్ కు కారణం…జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకోవడమా…లేదంటే తనకు తానే మౌనానికి పరిమితం చేసుకున్నారా….అంటూ తాడిపత్రిలో చర్చ జరుగుతోంది.