Off The Record: వరుస వివాదాలకు కేరాఫ్‌గా మారుతున్న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తాజాగా మరో ఎపిసోడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఈసారి మాత్రం ఆయన గట్టిగా ఇరుక్కున్నారు అని చెప్పకనే కరెక్ట్ అంటున్నారు తుంగతుర్తి ప్రజలు. నియోజకవర్గానికి చెందిన లిక్కర్ సిండికేట్ నిర్వాహకులతో ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు తీవ్ర వివాదాస్పదం అవుతూ… సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తోంది ఆ వీడియో. ఈ వివాదం ఉమ్మడి నల్గొండ హస్తం పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. ఎవరు సంసారి…. ఎవరు సుద్దపూస…. ఎన్నికల్లో గెలవడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశాం.. బయటకు వెళ్తే లక్షలు ఖర్చు అవుతున్నాయి. మీరిచ్చే డబ్బులు చిల్లర ఖర్చులకేనంటూ ఎమ్మెల్యే అన్న మాటల చుట్టూ కొత్త వివాదం మొదలైంది. నేనేమైనా మిమ్మల్ని ఎక్కువగా అడిగానా…? గత పదేళ్ళలో ఇచ్చిందే నాకు ఇవ్వమని అడుగుతున్నా అంటూ లిక్కర్ సిండికేట్ వాళ్లతో సూటిగా, సుత్తిలేకుండా ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు కలకలం రేపుతున్నాయి. వాటిని ఎవరో రికార్డ్ చేసి బయటికి వదలడంతో… రచ్చ రచ్చ అవుతోంది. అన్నిటికీ మించి ఎవరు సుద్దపూస అన్న మాటలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయంశం అయ్యాయి.
Read Also: Dr K Laxman: పీసీసీ కార్యవర్గం ఏర్పాటుకు 18 నెలలు పట్టింది.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఎద్దేవా!
అంటే… సామేల్ తనతో పాటు అందర్నీ ఈ వివాదంలోకి లాగుతున్నారా అని మాట్లాడుకుంటున్నాయి రాజకీయవర్గాలు. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి మందుల సామేల్ ఏదో ఒక వివాదంతో అంటకాగుతున్నారన్న టాక్ నడుస్తోంది నియోజకవర్గంలో. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిన మందులకు…. గెలిచిన కొద్దిరోజులకే తుంగతుర్తి పాత కాంగ్రెస్ నేతలతో విభేదాలు మొదలైనట్టు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే తీరుతో ఇప్పటికే నియోజకవర్గంలో పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్ అంటూ… గ్రూపులు ఏర్పడ్డాయంటున్నారు. ఆయన దూకుడు, నోటి దురుసు, పదవుల పంపకాల్లో తలెత్తిన విభేదాలతో ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట స్థానిక కాంగ్రెస్ నాయకులు. ఎమ్మెల్యేతో విభేదిస్తున్న నాయకులు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేతల వెంట నడుస్తున్నారు. అటు పార్టీ కార్యకలాపాల్లో, అధికారిక కార్యక్రమాలలో ఎమ్మెల్యే కొడుకుల అనవసర జోక్యం పెరుగుతోందన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఇసుక వివాదాలు, సొంత పార్టీ నేతలతో గొడవలు, ఉమ్మడి నల్లగొండ జిల్లా కీలక నాయకులతో గ్యాప్ లాంటివి ఉండగా… వాటికి తాజాగా లిక్కర్ సిండికేట్ వీడియో తోడై… కాక రేగుతోందట.
Read Also: Sonam Raghuvanshi: సోనమ్ కేసులో బిగ్ ట్విస్ట్.. లవ్ ఎఫైర్ గురించి ముందే తెలుసు..
దీనిపై హస్తం పార్టీ నేతల్లోనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవున్నట్టు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే వెంట అన్నం పెట్టే వాళ్ల కంటే సున్నం పెట్టే వాళ్ళే ఎక్కువగా ఉన్నారని, అందుకే పార్టీకి, ఆయనకు ఈ పరిస్థితి వచ్చిందని గుసగుసలాడుకుంటున్నారట. సామేల్ గెలిచిన నాటి నుండి ఐనోళ్లకు ఆకుల్లో… కానోళ్లకు కంచాల్లో పెట్టడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట పాత కాంగ్రెస్ నాయకులు. ఊరందరిదీ ఒకదారైతే ఉలిపి కట్టేదొక దారి అన్నట్లుగా గెలిచిన నాటి నుంచి ఎమ్మెల్యే తేడాగా వ్యవహరించడం వల్లే నియోజకవర్గంలో బలమైన పునాదులు ఉన్న కాంగ్రెస్ కాంట్రవర్సీకీ కేరాఫ్ అయిందని మాట్లాడుకుంటున్నారట. ఇంకొంతమంది అయితే… కాస్త గడుసుగా…. కంచం.. చెంబు బయట పారేసి… రాయి రప్ప లోపల వేసుకున్నారు కదా… అనుభవించండి అంటూ కాంగ్రెస్ పెద్దలనుద్దేశించి అంటున్నారట. పార్టీ, భవిష్యత్ రాజకీయంలాంటి వాటి గురించి ఆలోచించకుండా….. దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలని ఎమ్మెల్యే భావించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని బహిరంగంగానే కామెంట్ చేస్తున్నారు తుంగతుర్తి కాంగ్రెస్ కార్యకర్తలు. మరోవైపు కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారంటూ…ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో బిజీ అయ్యాయట విపక్షాలు. వరుస వివాదాలతో జరుగుతున్న డ్యామేజ్ ను కంట్రోల్ చేయాలని పార్టీ పెద్దలను కోరుతున్నారు తుంగతుర్తి హస్తం పార్టీ నేతలు.