Sonam Raghuvanshi: మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియుడి కోసం సోనమ్ రఘువంశీ, తన భర్త రాజా రఘువంశీని కిరాయి హంతకులతో హత్య చేయించింది. మొత్తం మర్డర్ ప్లాన్‌కి సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా ప్లాన్ చేసినట్లు తేలింది. మే 10న వివాహమైన ఈ జంట, హనీమూన్ కోసం మే 21న మేఘాలయాకు వెళ్లారు. మే 23న రాజా రఘువంశీని ఆకాష్ రాజ్‌పూత్, వికాస్ అలియాస్ విక్కీ, ఆనంద్‌లు కలిసి హత్య చేశారు.
అయితే, ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పెళ్లికి ముందే తాను వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నట్లు సోనమ్ తన తల్లిదండ్రులకు చెప్పినట్లే తెలిసింది. సోనమ్ రాజ్ కుష్వాహాతో తనకున్న సంబంధం గురించి తన తల్లికి చెప్పినట్లు, మృతుడి అన్నయ్య విపిన్ రఘువంశీ వెల్లడించారు. అయితే, రాజాకు ఇచ్చి తనకు బలవంతంగా వివాహం చేస్తే ఏదైనా విషాదకరమైన సంఘటన జరిగే అవకాశం ఉందని ఆమె హెచ్చరించినట్లు చెప్పారు. సోనమ్ కుటుంబం మాత్రం ఆమె ప్రేమను అంగీకరించలేదని, ఆమె వివాహం తమ కులం వారితో జరగాలని పట్టుబట్టినట్లు తెలిసింది.
READ ALSO: Rajnath Singh: ‘‘పాలకు పిల్లి రక్షణ’’.. యూఎన్ వ్యవహారంపై ఆగ్రహం..
‘‘సోనమ్ కుటుంబానికి దగ్గరి పరిచయం ఉన్న వ్యక్తి, సోనమ్ తన తల్లితో ఆమె లవ్ ఎఫైర్ గురించి చెప్పినట్లు నాకు చెప్పాడు. కానీ ఆమె కుటుంబం నువ్వు ఎవరినైనా ప్రేమించినా, మన కమ్యూనిటీ వ్యక్తితోనే వివాహం జరుగుతుందని చెప్పింది. పెళ్లి చేసుకున్న తర్వాత ఏదైనా జరిగితే నా బాధ్యత లేదని సోనమ్ హెచ్చరించింది’’ అని విపిన్ రఘువంశీ వెల్లడించారు. ‘‘సోనమ్ తనతో మాట్లాడలేదని, ఆమె తనను పట్టించుకోదని రాజా చెప్పేవాడు. ఈ విషయాన్ని అతనే మాకు స్వయంగా చెప్పాడు.’’ అని విపిన్ తెలిపాడు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ హత్య తర్వాత, సోనమ్ మేఘాలయ నుంచి తప్పించుకుని స్వస్థలం ఇండోర్ రావడానికి ప్రయత్నించింది. చివరకు ఉత్తర్ ప్రదేశ్ ఘాజీపూర్‌లోని పోలీసుల ముందు లొంగిపోయింది. జూన్ 03న రాజా రఘువంశీ మృతదేహం దొరికిన తర్వాత హత్యగా పోలీసులు గుర్తించారు. భార్య ప్రమేయం తప్పకుండా ఉందని అనుమానించారు. హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీస్ వర్గాల ప్రకారం, సోనమ్,రాజ్ కుష్వాహా మధ్య జరిగిన చాటింగ్‌లలో, వివాహానికి ముందే ఆమె రాజా నుండి మానసికంగా దూరమైందని వెల్లడైంది. ఒక మెసేజ్‌లో, రాజా తనతో సన్నిహితంగా ఉండటం తనకు అసౌకర్యంగా ఉందని, అతన్ని చంపాలనుకుంటున్నానని ఆమె రాజ్‌తో చెప్పినట్లు వెల్లడైంది.