ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కు అనే రీతిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలన ఉందని బీజేపీ ఎంపీ డా.కే. లక్ష్మణ్ విమర్శించారు. పీసీసీ కార్యవర్గం ఏర్పాటుకు 18 నెలలు పట్టిందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 46వ సారి ఢిల్లీ పర్యటన వెళ్లారు అనుకుంటా అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి 18 మాసాల పాలన విశ్లేషిస్తే.. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందన్నారు. పేద, వెనుకబడిన వర్గానికి చెందిన నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారన్నారు. ప్రపంచంలోనే ప్రధాన ఆర్దిక శక్తిగా భారత్‌ను రూపొందించే లక్ష్యంతో గత 11 ఏళ్లుగా మోడీ పాలన సాగిందని ఎంపీ లక్ష్మణ్ ప్రశంసించారు.
‘పేద, వెనుకబడిన వర్గానికి చెందిన మోడీ ప్రధాని అయ్యారు. ప్రపంచంలోనే ప్రధాన ఆర్దిక శక్తిగా భారత్‌ను రూపొందించే లక్ష్యంతో గత 11 ఏళ్లుగా మోడీ పాలన సాగింది. సబకా సాత్, సబ్ కా వికాస్ నినాదంతో పాలన సాగించారు ప్రధాని మోడీ. మినిమమ్ గవర్నమెంట్, మాగ్జిమమ్ గవర్నెన్స్‌తో ప్రజలకు పాలన అందించారు. అణగారిన వర్గాలకు, మహిళలకు ప్రభుత్వంలో అండ్ పార్టీలో పెద్ద ఎత్తున అవకాశాలు ఇచ్చారు. వికసిత్ భారత్ లక్ష్యంతో స్వావలంబన దిశగా పాలన సాగింది. కోవిడ్ నుంచి ఆపరేషన్ సిందూర్ వరకు రాజీ లేకుండా ప్రజాక్షేమం, దేశ రక్షణ కోసం పరితపించారు. జపాన్‌ను అధిగమించి నాలుగవ ఆర్ధిక శక్తిగా ఆవిర్బావం. అతి త్వరలోనే మూడవ ఆర్ధిక శక్తిగా ఆవిర్భవించనున్నాం. శత్రువు గడ్డపై అడుగు పెట్టి, తీవ్రవాదులను తుదముట్టించి ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చారు ప్రధాని మోడీ. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్తాన్‌ను ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టడంలో విజయవంతం అయ్యారు’ అని బీజేపీ ఎంపీ డా.కే. లక్ష్మణ్ అన్నారు.
Also Read: Adluri Laxman: ఆ ఇద్దరు నాకు రెండు కళ్లు.. వారి సహకారంతోనే ఇంతటి వాడిని అయ్యా!
‘పలు దేశాల్లో చిక్కుకుపోయిన లక్షలాది భారతీయలనే గాకుండా, పలు ఇతర దేశస్థులను కూడా రక్షించి స్వదేశాలకు తరలించడం మరచిపోలేని గొప్ప చర్య. దేశంలో 136 వందే భారత్ రైళ్లను కొత్తగా ప్రారంభించడం ప్రధాని మోడీ సాధించిన ఘన విజయం. 11 కోట్ల మంది రైతులకు 3.7 కోట్ల లక్షల రూపాయల ఆర్దిక తోడ్పాటును అందించడం, దేశంలో 15 కోట్ల మందికి సురక్షితమైన తాగునీరు సదుపాయం, కరోనా సమయంలో 20 కోట్ల మందికి నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారా ఆర్దిక సహాయం అందించారు ప్రధాని మోడీ. గత ప్రభుత్వ హయాంలో మాత్రం 12 లక్షల కోట్ల రూపాయల మేరకు కుంభకోణాలు’ అని ఎంపీ లక్ష్మణ్ చెప్పుకొచ్చారు.