Off The Record: మెదటిసారి ఎమ్మెల్యే అయినా టైం కలిసి రావడంతో మంత్రి పదవి దక్కించుకున్నారు సీదిరి అప్పలరాజు. ప్రస్తుతం పలాసలో జరుగుతున్న పరిణామాలే ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సొంత మనుషులే రెబల్స్‌గా మారి తెగ టెన్షన్ పెడుతున్నారట. ఒక్క మాటలో చెప్పాలంటే అప్పలరాజు నాయకత్వం మాకొద్దు అని బహిరంగంగానే చెప్పేస్తున్నారు అనుచరులు. మొదట్లో పరిస్ధితులు అంతా బాగానే ఉండేవట. పలాసలో ఎవరికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి? ఎవరు పార్టీ గెలుపు కోసం కృషి చేశారు? అనే ప్రాతిపదికన ప్రయారిటీ లభించేది. మంత్రి అయ్యాక అప్పలరాజు వ్యవహార శైలిలో మార్పు వచ్చింది. ప్రస్తుతం మంత్రి చుటూ ఓ కోటరీ ఏర్పడిందని.. ఆ కోటరీలో ఉన్న వారు చెప్పిన మాటలే మంత్రి వింటున్నారని ఆరోపిస్తున్నారు అనుచరులు.
Read Also: Off The Record: పవన్‌ను బీజేపీ నమ్మడం లేదా? అనుమానం వచ్చిందా?
ఇటీవల పలాసలో అధికారపార్టీ రెండు గ్రూపులుగా విడిపోయింది. మంత్రి అనుచరులంతా ఓ వైపు, ఆయన వ్యతిరేకవర్గం మరోవైపు అన్నట్టుగా రాజకీయం సాగుతోంది. అసమ్మతి నేతలు రోజు రోజుకూ స్పీడ్ పెంచుతున్నారు. వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడితో ఆగకుండా వచ్చే ఎన్నికల్లో అప్పలరాజుకు టికెట్ ఇస్తే ఓడిస్తామని బహిరంగంగానే వార్నింగ్ ఇస్తున్నారు. పార్టీ పెద్దలకు ఫిర్యాదులు చేస్తున్నారట. దీంతో ఏం చేయాలో తెలియక అప్పలరాజు తల పట్టుకున్నారని సమాచారం. నాడు అప్పలరాజుకు అన్నీ తానై వ్యవహరించిన హేంబాబు చౌదరి, దువ్వాడ శ్రీకాంత్‌లు అసమ్మతి వర్గానికి సారథ్యం వహిస్తున్నారట.
Read Also: Off The Record: పార్లమెంట్ సమావేశాల్లో బీఆర్‌ఎస్ వ్యూహం మారుతోందా..?
పలాస పట్టణ వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న దువ్వాడ శ్రీకాంత్ కు మొదట మున్సిపల్ చైర్మన్ పదవి ఆఫర్ చేశారు. కానీ ఎన్నికల తర్వాత తనకు ఇచ్చిన మాట మేరకు ఆ పదవి ఇవ్వకపోవటంతో శ్రీకాంత్ మంత్రిపై గుర్రుగా ఉన్నారట. అందుకే మినిస్టర్‌కు కునుకు లేకుండా చేస్తున్నారట. నియోజకవర్గంలో తిరుగుతూ అసమ్మతి నేతల సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాలింగ కమ్యూనిటీలోని కీలక నేతలు మంత్రికి వ్యతిరేకంగా పావులు కదుపుతుండటంతో ఓ వర్గం అధికారపార్టీకి దూరం అయ్యేభావన కలుగుతోందట. మంత్రి సీదిరి కొద్ది మందిని మాత్రమే వెనుకేసుకురావడం వివాదాలకు కారణమని చెబుతున్నారు. పలాసలో ప్రతిపక్షాల కంటే స్వపక్షంలో విపక్షంగా మారిన నేతలతోనే మంత్రికి ఇబ్బందుల ఎదురౌతున్నాయట. ఐతే వివాదం చినికి చినికి గాలివానలా మారుతున్నా అధిష్ఠానం కానీ మంత్రి కానీ ఎలాంటి దిద్దుబాటు చర్యలూ చేపట్టడం లేదట. అసమ్మతి నేతలు తీరు ఇలాగే ఉంటే మున్ముందు పలాసలో పార్టీకి కష్టాలు తప్పవన్నది కేడర్ ఆందోళన.