Off The Record: తెలుగుదేశం పార్టీ పూర్తి ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయా? అంటే… ఎస్.. వాతావరణం చూస్తుంటే అలాగే అనిపిస్తోందని అంటున్నాయి హైకమాండ్‌కు అత్యంత సన్నిహిత వర్గాలు. అధ్యక్షుడు చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ దీని మీద సీరియస్‌గా వర్కౌట్ చేస్తున్నట్టు సమాచారం. ఈసారి గెలిచాక గతంలో ఎన్నడూ లేని విధంగా కేడర్‌లో పెరుగుతున్న అసంతృప్తిని పరిగణనలోకి తీసుకోవడంతో పాటు అందరికీ అవకాశాలన్న పాయింట్‌ని బేస్ చేసుకుని ఈ ప్రక్షాళన కార్యక్రమం ఉండవచ్చంటున్నారు. ఇందుకోసం పార్టీ కొన్ని కొత్త రూల్స్ కూడా పెట్టుకోబోందట. ఆ రూల్స్ గ్రామ స్థాయి నుంచి పొలిటిట్‌బ్యూరో వరకు అందరికీ అప్లయ్ అవుతాయని, అవి అమల్లోకి వస్తే… పార్టీ ముఖ చిత్రమే మారిపోతుందని చెప్పుకుంటున్నాయి టీడీపీ వర్గాలు. అలాగే తొలిసారి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ కూడా రాబోతోందట. ప్రస్తుతం గ్రామ, మండల స్థాయిలో పదవుల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. అక్కడి నుంచే కొత్త నిబంధనల అమలు మొదలవుతుందంటున్నారు పార్టీ నాయకులు. ఇక మారబోతున్న రూల్స్ ప్రకారం ఒక నాయకుడికి పార్టీ పదవి ఒకటే ఉంటుంది. అది కూడా రెండేళ్ళు మాత్రమే. అలా ఎందుకని అంటే… అందరికీ అవకాశాలన్నదే పార్టీ వర్గాల సమాధానం. ఏళ్ళ తరబడి, ఆ మాటకొస్తే… దశాబ్దాల తరబడి కూడా పార్టీ పదవులు నిర్వహిస్తున్న నాయకులు చాలా మందే ఉన్నారు.
Read Also: TG Venkatesh: మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలోనే అభివృద్ధి..!
టీడీపీ అధికారంలో ఉన్నా, లేకున్నా… వాళ్ళు మాత్రం అలాగే కొనసాగుతుండటంపై తర్వాతి తరం నేతల్లో తీవ్ర అసంతృప్తి రేగుతోందట. జీవిత కాలం వాళ్ళే పదవుల్లో ఉంటే… ఇక సంగతేంటి? మేం ఇలాగే రిటైరైపోవాలా అన్న నిట్టూర్పులు సైతం పెరుగుతున్నాయట. అందుకే… అలాంటి వాటికి చెక్ పెట్టి అందరికీ ఛాన్స్ దక్కేలా పావులు కదుపుతోందట అధిష్టానం. ద్వితీయ శ్రేణిలో అసంతృప్తి, అసహనం పెరగకుండా ఉండాలంటే… ఈ మార్పు తప్పనిసరని పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అటు పార్టీ అత్యున్నత విభాగం పొలిట్ బ్యూరోలో మార్పులపై కూడా అంతర్గతంగా గట్టి చర్చే జరుగుతోందట. సీనియర్స్, సూపర్ సీనియర్స్, ఏళ్ళ తరబడి పొలిట్ బ్యూరో పోస్టుల్లో ఉంటున్న వారిని తప్పించి ఆ స్థానాల్లో యువ నాయకులకు అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నట్టు సమాచారం. ఈ విషయంలో ఏం చేయాలనుకుంటున్నారో బయటికి పొక్కకుండా అధిష్టానం జాగ్రత్తలు తీసుకుంటోందట. అలాగే… అవకాశం వచ్చిన యువ నాయకులు కూడా జీవితకాలం ఆయా పదవుల్లో ఉండిపోకుండా… ప్రతి రెండేళ్ళకు మార్చాలని భావిస్తోందట టీడీపీ అధిష్టానం. ఇందుకోసం పార్టీకి లాయల్‌గా ఉండటం, టాలెంట్, వయసు లాంటి అనేక అంశాలను ప్రామాణికంగా తీసుకోబోతున్నట్టు చెప్పుకుంటున్నాయి టీడీపీ వర్గాలు.
Read Also: Off The Record: బీజేపీ వైపు మెగాస్టార్ అడుగులు..? డిసైడయ్యారా..? కన్ఫ్యూజన్‌లో ఉన్నారా..?
ఇక అదే ఊపులో….. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌కు కూడా ప్రమోషన్ దక్కవచ్చంటున్నారు. ఆయన్ని వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించవచ్చంటున్నారు. అంటే… లోకేష్ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతల్లో ఉండి… పొలిటిబ్యూరోలో యువ నాయకత్వానికి చోటిస్తున్నారంటే… పార్టీలో కొత్తగా లోకేష్ టీమ్‌ని తయారు చేస్తున్నట్టు భావించాల్సి ఉంటుందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. దశాబ్దాలుగా పార్టీ పదవుల్లో ఉండి… టీడీపీ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే పది పన్నెండు మంది నాయకులున్నారు. అలాంటి వాళ్ళని కూడా తప్పించి యువ నాయకత్వానికి బాధ్యతలు ఇవ్వడం ద్వారా… నాడు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఉన్న యంగర్ లుక్ అండ్ ఫీల్ తీసుకురావాలనుకుంటున్నట్టు సమాచారం. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రస్తుతం ఈ విషయంపై సీనియస్‌గా దృష్టి పెట్టినట్టు చెప్పుకుంటున్నాయి టీడీపీ వర్గాలు. అటు ప్రభుత్వం, ఇటు పార్టీ సజావుగా, సమన్వయంతో నడవాలంటే… ఈ మార్పులు తప్పనిసరని భావిస్తున్నారట. ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటన తర్వాత సీనియర్స్ మీటింగ్ ఉంటుందని, ఆ సమావేశం తర్వాత కార్యాచరణపై స్పష్టత వస్తుందని అంటున్నారు. అందరికీ అవకాశాలు, కొత్త వాళ్ళకు ప్రోత్సాహం ప్రాతిపదికన అధిష్టానం తీసుకోబోయే నిర్ణయాల పర్యవసానాలు, సీనియర్స్ రియాక్షన్స్ ఎలా ఉంటాయోనని ఉత్కంఠగా చూస్తున్నాయి టీడీపీ వర్గాలు.