Off The Record: తన సొంత నియోజకవర్గంలోకి వెళ్లేందుకు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు ఏడాదిగా బ్రేక్స్ పడుతూనే ఉన్నాయి. అసలు సొంత నియోజకవర్గంలోకి ఏంట్రీ లేకపోవడం ఏంటీ.. అంటే, 2024 అసెంబ్లీ ఎన్నికల దగ్గరకు వెళ్ళాల్సిందే. అప్పట్లో జరిగిన ఎన్నికల గొడవలతో… ఇటు జేసీ ఫ్యామిలీని అటు పెద్దారెడ్డి ఫ్యామిలీని తాడిపత్రిలో అడుగు పెట్టకుండా ఆంక్షలు విధించింది కోర్ట్. కొన్ని రోజుల తర్వాత ఆ ఆంక్షలు ఎత్తేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకు అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రభాకర్‌రెడ్డి మున్సిపల్ ఛైర్మన్‌గా ఉన్నారు. ఇక యధావిధిగా వాళ్ళ పాలన నడుస్తోంది. అయితే… తన రాజకీయ ప్రత్యర్థి, తాను బద్ధ శత్రువుగా భావించే… కేతిరెడ్డి పెద్దారెడ్డికి మాత్రం తాడిపత్రిలోకి నో ఎంట్రీ బోర్డు పెట్టారు జేసీ. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎప్పుడు తాడిపత్రికి వెళ్లాలన్నా పోలీసులు అడ్డుకుంటూనే ఉన్నారు. శాంతి భద్రతల సమస్యల దృష్ట్యా మీరు తాడిపత్రి వెళ్ళకూడదంటూ ఆంక్షలు విధించారు పోలీసులు. ఏడాది కాలంగా ఇదే కొనసాగుతోంది.
Read Also: Off The Record: పోగొట్టుకున్న చోటే సాధించే పనిలో గులాబీ దళం
పెద్దారెడ్డి ఎన్ని సార్లు ప్రయత్నించినా.. పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం సాధారణమైపోయింది. దీంతో హైకోర్టులో పిటిషన్ వేశారు మాజీ ఎమ్మెల్యే. 10నెలలుగా తన సొంత నియోజకవర్గంలోకి అడుగుపెట్టనివ్వడం లేదని, దాన్ని మార్చేలా ఆదేశాలివ్వమని కోరారు. చివరికి హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాసరే….. పెద్దారెడ్డికి ఎంట్రీ కష్టాలు మాత్రం తప్పడం లేదు. దీంతో వారం రోజుల క్రితం జిల్లా ఎస్పీ ఆఫీస్‌కి వెళ్ళారాయన. ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో హైకోర్టు ఉత్తర్వుల కాపీని అడిషనల్ ఎస్పీకి ఇచ్చి వెళ్ళిపోయారాయన. సీఎం పర్యటన ముగిసిన తర్వాత పెద్దారెడ్డికి లైన్ క్లియర్ అవుతుందని భావించినా… అది జరగలేదు. ఇక ఇంతలో ఇండియా-పాక్ యుద్ధం కారణంగా జిల్లా పోలీసులంతా అలర్ట్ మోడ్‌లోకి వెళ్ళారు. గోరంట్ల మండలంలో జవాన్ మురళీ నాయక్ మృతి.. అంత్యక్రియలు, వీఐపీల భద్రత కోసం పోలీసులంతా అటు వైపు వెళ్ళడంతో పెద్దారెడ్డి గురించి పట్టించుకునే అవకాశా లేకుండా పోయింది. పోలీసులంతా ఆ విధి నిర్వహణలో బిజీగా ఉండడం కారణంతో తాడిపత్రిలో బందోబస్తు ఇవ్వడానికి ఇబ్బందులు తలెత్తాయన్న ప్రచారం జరుగుతోంది.
Read Also: PM Modi: పాక్‌తో చర్చలు జరిగితే ఇకపై ఉగ్రవాదం.. పీవోకేపైనే
ఇలా… ఒకదాని వెంట ఒకటిగా రకరకాల కారణాలతో మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గంలోకి వెళ్లలేకపోతున్నారంటూ తీవ్ర అసహనంగా ఉన్నారట ఆయన అనుచరులు. వాస్తవంగా పెద్దారెడ్డి నియోజవర్గంలోకి ఎంటరైతే… శాంతి భద్రతల సమస్య వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. అటు జేసీ ప్రభాకర్‌రెడ్డి మాత్రం ఏది ఏమైనా సరే… పెద్దారెడ్డిని రానిచ్చేదే లేదంటూ ప్రతిజ్ఞలు చేస్తున్నారు. పైగా తాడిపత్రి వస్తే తిరిగి వెళ్ళడంటూ…వివాదాస్పద వ్యాఖ్యలు చేశారాయన. వైసీపీ హయాంలో జరిగిన విషయాలను పెద్దారెడ్డి ఒకసారి గుర్తు చేసుకోవాలంటూ పదేపదే చెబుతున్నారు జేసీ, ఆయన అనుచరులు. దీంతో పెద్దారెడ్డి నియోజకవర్గంలోకి అడుగుపెడితే ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు వస్తాయోనన్న ఆందోళన పెరుగుతోంది నియోజకవర్గంలో. మాజీ ఎమ్మెల్యే తాడిపత్రిలోకి వస్తున్నారన్న సమాచారం అందితే చాలు … ఎలా అడుగుపెడతాడో చూస్తామంటూ అట్నుంచి స్టేట్‌మెంట్స్ వస్తున్నాయి. రావాలని ఆయన, రానివ్వబోనని ఈయన…. పంతం, నీదా నాదా అంటూ…. తలపడటం జిల్లా పోలీసులకు పెద్ద సవాల్ గా మారింది.