Off The Record: కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. పదేళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే. కేసీఆర్ అంటే… ఎవరికి తెలియదని, ఆయన గురించి అంత ఉపోద్ఘాతం అవసరమా అనుకుంటున్నారా? యస్… మీరనుకునేది కరెక్టేగానీ… అసలు మేటరంతా అక్కడే ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఆ ప్రభావమే ఇప్పుడు కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న గజ్వేల్‌లో కనిపిస్తోందని అంటున్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్ గెలిచినా… పార్టీ అధికారంలోకి రాకపోవడంతో ఆయన రెగ్యులర్‌గా అసెంబ్లీకి వెళ్లడం లేదు. ఇప్పటివరకు జరిగిన సమావేశాల్లో.. ఫస్ట్‌టైం బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు, ఇటీవలి బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్ ప్రసంగానికి… కేవలం రెండంటే రెండే రోజులు సభలోకి వెళ్ళారాయన. దీంతో… ఇప్పడు కేసీఆర్ టార్గెట్‌గా ఆయన ఎమ్మెల్యేగా ఉన్న గజ్వేల్‌లో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అధికార కాంగ్రెస్‌తో పాటు, బీజేపీ నాయకులు కూడా మాజీ సీఎంని లక్ష్యం చేసుకుని సరికొత్త రాజకీయం మొదలుపెట్టారట.
మల్లన్నసాగర్ నిర్వాసితులు ఈ నెల 18న కేసీఆర్ కి బహిరంగలేఖ రాశారు. తమ 14 ముంపు గ్రామాల సమస్యలపై గజ్వేల్ ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడాలన్నది ఆ లేఖ సారాంశం. సీఎంగా ఉన్నప్పుడు తమకిఇచ్చిన హామీలపై ఇప్పటికైనా అసెంబ్లీలో గళమెత్తాలని కోరారు నిర్వాసితులు. లేకపోతే మరుసటి రోజు ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌ని ముట్టడించి అక్కడే టెంట్ వేసుకుని కూర్చుంటామని, సమస్యపరిష్కారం అయ్యే వరకు ఇక్కడే ఉండి వంట వార్పు నిర్వహిస్తామని హెచ్చరించారు. దాంతో 19న పోలీసులు కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర భద్రత పెంచారు. కానీ… మల్లన్నసాగర్ నిర్వాసితులు రాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు అంతా. అయితే అదే రోజున బీజేపీ నాయకులు గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌ని ముట్టడించారు. గేట్‌కు టు లెట్ బోర్డు పెట్టడంతో పాటు వాంటెడ్ ఎమ్మెల్యే అంటూ తగిలించారు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజల ఓట్లతో గెలిచిన కేసీఆర్ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారని, క్యాంప్ ఆఫీస్ ఖాళీగా ఉండటం, ఎమ్మెల్యే కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రజలు సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు బీజేపీ నాయకులు.
ఇక కాంగ్రెస్ నేతలైతే.. అసెంబ్లీకి రాని కేసీఆర్ పై గవర్నర్ చర్యలు తీసుకోవాలంటూ పాదయాత్ర ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి రాజ్ భవన్ వరకు 90 కిలోమీటర్ల పాదయాత్ర చేయాలన్నది వాళ్ళ టార్గెట్. గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్.. నియోజకవర్గ బాగోగులు పట్టించుకోవాలని వారు డిమాండ్ చేశారు పాదయాత్ర చేస్తున్న నాయకులు. అసలు గజ్వేల్‌కి ఎమ్మెల్యే ఉన్నాడా లేదా అన్న అనుమానం కలుగుతోందని, కేసీఆర్ తమ సమస్యలు ఎప్పుడు వింటారా అంటూ నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారని కాస్త సెటైరిక్‌గానే చెబుతున్నారు కాంగ్రెస్ లీడర్స్. నాలుగు రోజుల్లో పాదయాత్ర రాజ్ భవన్ చేరుకున్నా తమ ఎమ్మెల్యేని అసెంబ్లీకి రప్పించేలా చర్యలు తీసుకోమని వినతి పత్రం ఇస్తామంటున్నారు గజ్వేల్ కాంగ్రెస్ లీడర్స్. బీఆర్ఎస్ ఓడిపోయిన కొత్తల్లో కూడా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ మిస్సింగ్ అంటూ నియోజకవర్గంలో పలు చోట్ల పోస్టర్స్ వేశారు. అయితే ఈ తాజా ఎపిసోడ్ పై బీఆర్ఎస్ నాయకులు కూడా ధీటుగా స్పందిస్తున్నారు. కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నియోజకవర్గ రూపురేఖలే మారిపోయాయని చెబుతున్నారు. అభివృద్దిలో నియోజకవర్గాన్ని కేసీఆర్ 50 ఏళ్ల ముందుకు తీసుకెళ్లారని… కళ్లుండి చూడలేని కబోదులకు ఈ విషయాలు అర్థం కావని గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. కాంగ్రెస్ నేతలు కానీ, బీజేపీ ఎంపీగా ఉన్న రఘునందన్ రావు కానీ ఈ ఏడాదిలో గజ్వేల్ లో ఏం అభివృద్ది చేశారో చెబుతారా అంటూ సవాల్ విసురుతున్నారు బీఆర్ఎస్ లీడర్స్. ఇలా గజ్వేల్ లో కేసీఆర్ టార్గెట్‌గా మొదలైన సరికొత్త రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.