Off The Record: బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కున్న భక్తిప్రపత్తుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. సమకాలీన రాజకీయాల్లో యాగాలతో సెంటిమెంట్‌ను పండించే అతికొద్ది మంది నేతల్లో ఒకరు కేసీఆర్. గతంలో ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో చండీయాగం, రాజశ్యామల యాగంతోపాటు రకరకాల పూజలు నిర్వహించారాయన. అయితే ఈసారి గతానికి భిన్నంగా నవగ్రహ శాంతి యాగం నిర్వహించారట. శుక్ర, శనివారాల్లో రెండు రోజుల పాటు జరిగిన పూజా కార్యక్రమాల్లో కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. కేసీఆర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ యాగ నిర్వహణే పొలిటికల్ హాట్ టాపిక్ అయింది. ఇటీవలి కాలంలో రాజకీయంగా, వ్యక్తిగతంగానూ ఆయనకు ఏదీ కలిసి రావడంలేదని, అందుకే గ్రహ శాంతి కోసమే ఈ పూజలు చేయించారా అన్న చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో. ప్రత్యేకించి కుమార్తె కవిత అరెస్ట్ ఆయన్ని బాగా కుంగదీసిందన్న టాక్ బలంగా నడిచింది. ఇప్పుడు ఆమె విడుదల తర్వాత పూర్తిగా గ్రహ శాంతి కోసం ఆయన ఈ మార్గాన్ని ఎంచుకుని ఉండవచ్చంటున్నారు.
Read Also: Health Tips: షుగర్ వ్యాధి ఉన్న వాళ్లు ఈ తప్పులు చేయకండి.. లేదంటే కష్టమే..!
అలాగే ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే ముందు, కొత్త పనులు మొదలుపెట్టబోయేటప్పుడు ప్రత్యేక పూజలు, హోమాలు, యాగాలు చేయడం కేసీఆర్‌కు అలవాటు. ఇప్పుడీ నవగ్రహ శాంతి యాగాన్ని కూడా ఆ కోణంలోనే చూడవచ్చన్న టాక్ సైతం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత ప్రమాదం, ఆపరేషన్‌లాంటి వాటితో చాలా రోజులు ప్రజల్లోకి వెళ్ళలేదు బీఆర్ఎస్ అధ్యక్షుడు. ఇక లోక్‌సభ ఎన్నికల్లో పరిమితంగా ప్రచారం చేశాక మళ్లీ బయటికి వచ్చిన సందర్భాలు పెద్దగా లేవు. ఇక నుంచి ఆయన రెగ్యులర్‌గా ప్రజల మధ్య ఉండేలా కార్యాచరణ రూపొందించుకుంటున్నారని, ఆ క్రమంలోనే దోష పరిహారాల కోసం నవగ్రహ శాంతి యాగం నిర్వహించినట్టు ప్రచారం ఉంది రాజకీయవర్గాల్లో. అలాగే జాతకరీత్యా ఏదీ కలిసి రానప్పుడు, శాంతి పూజలు చేస్తుంటారు కొందరు. దీన్ని ఆ కోణంలోకూడా చూడాల్సి ఉంటుందన్న మరో వాదనా ఉంది. కొంతకాలంగా తరచూ అనారోగ్యానికి గురవడం, ఎన్నికల్లో ఓటమి, రాజకీయంగా ఏదీ కలిసిరాకపోవడం లాంటి వాటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని కూడా ఈ నవగ్రహ శాంతి యాగం చేసి ఉండవచ్చంటున్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఆర్భాటంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే అలవాటు కేసీఆర్.. ఈసారి మాత్రం చాలా సింపుల్‌గా ముగించేశారట. కేసీఆర్ దంపతులతో పాటు అతికొద్ది మంది మాత్రమే ఇందులో పాల్గొన్నట్టు తెలిసింది. తొమ్మిది గ్రహాలకు తొమ్మిది రకాల పూలతో వేదమంత్రోచ్ఛరణ మధ్య పూజలు నిర్వహించారట. జాతక రీత్యా వచ్చిన గ్రహపీడలు పోవడానికే ఇలాంటి పూజలు చేస్తారన్నది పండితుల మాట. ఎన్నికలకు ముందు కూడా రాజశ్యామల యాగం నిర్వహించారు కేసీఆర్. కానీ ఎన్నికల్లో ఓటమి, అధికారం కోల్పోయిన తర్వాత… పూజాదికాల్లో ఎక్కడో తప్పు జరిగిందన్న భావనతో మళ్లీ దోష నివారణ పూజలు కూడా చేశారట. తిరిగి ఇప్పుడు తాజాగా నవగ్రహ పూజలతో పాటు యాగం నిర్వహించడం ఆసక్తికరంగా మారింది.
Read Also: Giorgia Meloni: ఉక్రెయిన్ యుద్ధాన్ని భారత్ పరిష్కరించగలదు.. ఇటలీ ప్రధాని కామెంట్స్..
మొదటిసారి 1996లో సహస్ర లక్ష్మీ సూక్త పారాయణాలు, సహస్ర లక్ష్మీ సూక్త పారాయణ సహిత అభిషేకాలు నిర్వహించారు కేసీఆర్. తర్వాత 1997లో బాపిశాస్త్రి ఆధ్వర్యంలో చండీహోమం, 2005లో కేంద్రమంత్రిగా ఢిల్లీలోని తన నివాసంలో నవగ్రహ మఠం, చండీయాగం, 2006లో సహస్ర చండీయాగం, 2007లో మరోసారి చండీయాగం, సుదర్శన యాగం, 2008లో సిద్దిపేట కోటిలింగాల ఆలయంలో గాయత్రీ యాగం, 2009లో తెలంగాణ భవన్లో 27 రోజుల పాటు నక్షత్ర మండల యాగం, 2010లో తెలంగాణ భవన్లో చండీయాగం, 2011లో బండ్లగూడలోని ఎంపీ జితేందర్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో శత చండీయాగం చేశారు కేసీఆర్. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అధికారంలోకి వచ్చిన తరువాత 2015 నవంబర్ 27న నవ చండీయాగం, అదే ఏడాది డిసెంబర్ 23 నుంచి 27వరకు ఆయుత శతచండీయాగం, 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజశ్యామల యాగం చేశారాయన. రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 జనవరిలో మహా రుద్ర సహిత సహస్ర చండీయాగం, 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా రాజశ్యామల యాగం నిర్వహించారు కేసీఆర్. అయితే… ప్రతిపక్షంలోకి వచ్చిన తరువాత మొదటిసారి నిర్వహించిన నవగ్రహ శాంతి మహాయాగం పై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఏం ఫలితం ఆశించి చేస్తున్నారన్న విషయంలో ఎవరికి నచ్చిన భాష్యం వాళ్లు చెబుతున్నా… మొత్తంగా జాతక రీత్యా వచ్చిన గ్రహ దోషాల నివారణకేనన్నది ఎక్కువ మంది పండితులు చెబుతున్న మాట. మరి ఈ యాగంతో పరిహారం జరిగి గులాబీ బాస్ రీ ఛార్జ్ అవుతారా? లేదా ? అన్నది చూడాలి మరి.