ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్‌లో కొట్లాటలు.. గ్రూప్ రగడ కొత్తమీ కాదు. ఢిల్లీ స్థాయి నేతల మధ్య కూడా గల్లీ లెవల్లో విభేదాలు బయట పడుతుంటాయి. ఒక్కో సెగ్మెంట్‌లో మూడు ముక్కలాటలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మధ్య విభేదాలు ఉన్నాయి. తాజాగా రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక.. ఆయనదో వర్గం ముందుకొచ్చింది. ఈ విధంగా ముగ్గురు కీలక నాయకుల పేర్లు చెప్పి పార్టీ కేడర్ మూడుగా విడిపోయిన పరిస్థితి. ఎవరిని టచ్ చేసినా.. మరొక నాయకుడు పేరు చెప్పి కస్సుమంటారు.
Read Also: Off The Record: ‘జాకీ’ వివాదంలో ఎమ్మెల్యే.. రాప్తాడులో రాజకీయ సెగలు
కరీంనగర్‌లో పొన్నం వర్గం నుంచి MSR వారసుడు రోహిత్‌రావు టికెట్ ఆశిస్తున్నారు. ఇదే సీటును శ్రీధర్‌బాబు వర్గం నుంచి నరేందర్‌రెడ్డి కర్చీఫ్ వేశారు. ఇద్దరు నేతల మధ్య కరీంనగర్ కాంగ్రెస్ కుతకుత లాడుతోంది. రెండు వర్గాలు రెండు శిబిరాలు అన్నట్టుగా మారిపోయింది పార్టీ తీరు. రాజకీయ పోరాటాల కంటే.. తమ వ్యక్తిగత ప్రతిష్టను పెంచే అంశాలనే నేతలు టేకప్ చేస్తున్నారు. దీంతో కేడర్ కూడా విసిగిపోయి.. చెల్లాచెదురవుతోంది. రేవంత్ అనుచరుడిగా ముద్రపడిన డీసీసీ ప్రెసిడెంట్ కవ్వంపల్లి సత్యనారాయణ సైతం మరో గ్రూపును తయారు చేసుకున్నారట.
ఈ మూడు గ్రూపులు ఎవరికి వారుగా నియోజకవర్గాల్లో కుంపట్లు రాజేస్తున్నాయి. ఒకరి పొడ మరొకరికి గిట్టడం లేదు. స్థానికంగా పార్టీలో నెలకొన్న సమస్యలు తెలిసినా.. వారి వెనుక ఉన్న పెద్దలను గుర్తు చేసుకుని పీసీసీ జోక్యం చేసుకునే సాహసం చేయడం లేదు. దాంతో విభేదాలు పెరుగుతున్నాయే తప్ప సమసే వాతావరణం కనిపించడం లేదు. ఒకప్పుడు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా కనిపించేది. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో పార్టీ పట్టుకోల్పోతోంది. ఒకవైపు టీఆర్ఎస్, బీజేపీలు పోటాపోటీగా రాజకీయాలు చేస్తుంటే.. వాటి మధ్యలో కాంగ్రెస్ పోరాటాలు తేలిపోతున్నాయని కేడర్ వాపోతుంది. సమస్యను ఇదే విధంగా నాన్చితే పార్టీకి.. కాంగ్రెస్ నేతలకు అసలుకే ఎసరు రావొచ్చనే ఆందోళన ఉన్నా.. ఎవరికి వారు సైలెంట్‌గానే ఉండిపోతున్నారు. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. కాంగ్రెస్ పుంజుకోవాలంటే ఇప్పటి నుంచే ఫీల్డ్‌లో ఉండాలనేది శ్రేణుల వాదన. కానీ.. నేతలు మాత్రం ఎవరికి వారు యమునా తీరేలా అడుగులు వేస్తున్నారు. మరి.. ఈ సమస్యకు కాంగ్రెస్ అధిష్ఠానం చికిత్స చేస్తుందా లేదో చూడాలి.