అనంతపురం జిల్లా రాప్తాడు పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేవి రాజకీయ వివాదాలే. మాజీ మంత్రి పరిటాల సునీత, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మధ్యలో రెండు వర్గాలు శాంతించినా.. పరిటాల సునీత పాదయాత్ర చేస్తాననడంతో పొలిటికల్ టెంపరేచర్ పెరిగిపోయింది. ఇంతలో ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డిని జాకీ పరిశ్రమ వివాదం కొత్తగా చుట్టుముట్టడంతో రాప్తాడులో రాజకీయ సెగలు రేగుతున్నాయి. జిల్లాలో లేని పరిశ్రమ చుట్టూ సాగుతున్న పాలిటిక్స్ ఏకంగా తాడేపల్లిని తాకడంతో హాట్ టాపిక్‌గా మారిపోయింది.
Read Also: Off The Record: రాహుల్‌ను, పార్టీని ఏకిపారేసినా మర్రి.. సీనియర్లు సైలెంట్..!
2018లో రాప్తాడు సమీపంలో 200 కోట్లతో జాకీ కంపెనీ ఏర్పాటు చేయాలని అనుకున్నారు. APIIC ద్వారా 26 ఎకరాల భూసేకరణ జరిగింది. 6 వేల మంది మహిళలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని గత ప్రభుత్వం భావించింది. జాకీ కంపెనీ ఆ స్థలంలో కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా మొదలు పెట్టింది. ఇంతలో ఎన్నికలు రావడం.. వైసీపీ అధికారం చేపట్టాక.. ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయడం లేదంటూ జాకీ పరిశ్రమ తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయింది. సీన్ కట్ చేస్తే.. తెలంగాణలో పరిశ్రమ పెడుతున్నామని జాకీ సంస్థ ప్రకటించింది. తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో MOU కుదుర్చుకున్నట్టు తెలియజేసింది. అంతే.. ఆ ప్రకటన.. రాప్తాడులో రాజకీయ అగ్గిరాజేసింది. జాకీ సంస్థను స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి 15 కోట్లు డిమాండ్ చేయడం వల్లే వాళ్లు రాప్తాడు నుంచి వెళ్లిపోయారని పరిటాల సునీత, పరిటాల శ్రీరాం గతంలో ఆరోపించారు. అయితే ఆ ఆరోపణలు అప్పట్లో పెద్దగా అటెన్షన్‌లోకి రాలేదు. కానీ.. జాకీ సంస్థ లేటెస్ట్ స్టేట్‌మెంట్ రెండుపక్షాల మధ్య మాటల తూటాలకు వేదికైంది.
ఎమ్మెల్యే బెదిరింపుల వల్లే పరిశ్రమ వెళ్లిపోయిందని సునీత ఆరోపిస్తే.. పాత వాయిస్‌ను కొత్తగా వినిపించారు ప్రకాష్‌రెడ్డి. 2018లో పరిశ్రమ వచ్చిందని… కానీ వాళ్లకు ఇక్కడ నెలకొల్పే ఉద్దేశం లేదన్నారు ఎమ్మెల్యే. పైగా 300 కోట్ల స్కామ్ చేసేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రయత్నించిందని ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. జాకీ కోసం 140 కోట్ల విలువైన భూమిని రెండున్నర కోట్లకే సేల్ డీడ్ చేశారనేది ఆయన వాదన. 2018 అక్టోబరులోనే పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉన్నా.. ఆరోజే ఎందుకు చేయలేదని.. దీనికి టీడీపీ నేతల దగ్గర సమాధానం ఉందా అని ఎమ్మెల్యే ప్రశ్నలు సంధిస్తున్నారు. తాజాగా ఈ వివాదంలోకి కమ్యూనిస్టులు ఎంట్రీ ఇచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో ఓ బృందం ఆనాడు జాకీకి ఇచ్చిన స్థలాలను పరిశీలించింది. ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బు ఇవ్వాలని MLA ఒత్తిడి చేయడం వల్లే జాకీ వెళ్లిపోయిందని రామకృష్ణ సైతం ఆరోపణలు చేశారు. అక్కడితో ఆగకుండా ఎమ్మెల్యే గురించి ప్రస్తావిస్తూ సీఎం జగన్‌కు ఓ లేఖ కూడా రాశారు రామకృష్ణ. ఇంతకీ జాకీ సంస్థను ఎమ్మెల్యే డబ్బు డిమాండ్ చేశారో లేదో కానీ.. విపక్షాలకు ప్రకాష్‌రెడ్డి గట్టిగానే కార్నర్ అవుతున్నారు. రాప్తాడులో ప్రస్తుతం ఈ అంశంపైనే జనాల్లో చర్చ. విమర్శలు.. కౌంటర్లు వాడీవేడీగా ఉన్నాయి. మరి వాస్తవాలేంటో కాలమే చెప్పాలి.