Off The Record: కాళేశ్వరం ప్రాజెక్ట్ చుట్టూ తెలంగాణ పాలిటిక్స్‌లో ఎలాంటి ప్రకంపనలు రేగుతున్నాయో… ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అదంతా ప్రాజెక్ట్ నిర్మాణం చుట్టూ జరుగుతున్న రచ్చ. ఫ్రంట్ పోర్షన్‌లో ఆ స్థాయి రచ్చ జరుగుతుంటే… బ్యాక్‌లో కూడా ఆ స్థాయి కాకున్నా… దాదాపు అలాంటి గొడవే జరుగుతోంది. అక్కడ కూడా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రాజకీయ లబ్దికోసం పావులు కదుపుతూ పరస్పరం టార్గెట్ చేసుకుంటున్నాయి. చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గం అందుకు వేదికైంది. ప్రాజెక్ట్ నిండా నీళ్ళు ఉన్నప్పుడు బ్యాక్ వాటర్… ఇక్కడి రైతుల్ని నిండా ముంచేసింది. ఐదేళ్ళపాటు పలు మండలాల్లోని రైతుల పంటలు మునిగిపోవడమేగాక పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. భూములు పనికిరాకుండా పోయాయి. జైపూర్, కోటపల్లి, చెన్నూర్ మండలాల్లో రైతులు కోట్లాది రూపాయలు నష్టపోయారు. పరిహారం కావాలని నెత్తీనోరూ బాదుకున్నా… అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. గత ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపించింది.
Read Also: హాట్ శారీలో ఫరియా అబ్దుల్లా…ఫైర్
కాళేశ్వరం బ్యాక్ వాటరే తన ఓటమికి కారణం అని ఇప్పటికే చాలాసార్లు చెప్పారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. ప్రతీ సారి… పంటలు మనిగినా ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వలేదంటూ అన్ని గ్రామాల్లో అప్పట్లో పాదయాత్ర చేశారు. బ్యాక్ వాటర్ సమస్యను ముందుకు తేవడంతో అప్పటి అధికార బీఆర్‌ఎస్ ఇరుకున పడింది. అదే వివేక్ ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు, రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. దీంతో… ఇప్పుడు రివర్స్ పాలిటిక్స్ మొదలు పెట్టిందట బీఆర్‌ఎస్. రైతులకు ఎంత పరిహారం ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారంటూ నిలదీస్తున్నారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. దీంతో పరస్పర విమర్శలు, ప్రశ్నలతో రాజకీయం రక్తి కడుతోంది. కరకట్ట కట్టిస్తామని బీరాలు పలికిన నాటి పాలకుల మాటలు నీటి మూటలుగానే మిగిలిపోగా… తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏం చేస్తోందన్న ప్రశ్నలు వస్తున్నాయి. మీరు హామీ ఇచ్చిన పరిహారం 20 లక్షలేమయ్యాయంటూ బీఆర్ఎస్ నేతలు ఇటీవల ఆందోళన బాటపట్టితే…మీరు ఆందోళన చేయాల్సింది కేసీఆర్ ఇంటి దగ్గర అంటూ కౌంటర్ అటాక్ చేస్తోంది కాంగ్రెస్. దొంగే దొంగా అన్నట్లుగా బీఆర్ఎస్ నేతల వ్యవహార శైలి ఉందంటూ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రివర్స్ అవుతున్నారు. బ్యాక్ వాటర్ అంశం గతంలో బీఆర్‌ఎస్‌ని రాజకీయంగా ఇబ్బంది పెట్టింది.
Read Also: Hyderabad: పని చేస్తున్న సంస్థకే కన్నం.. ఏకంగా రూ.కోటిన్నర డైమండ్స్‌తో పరార్..
ఇప్పుడు అదే అస్త్రాన్ని తిరిగి కాంగ్రెస్ మీద ప్రయోగిస్తోంది గులాబీ పార్టీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే అంశాన్ని హైలైట్ చేసి గట్టిగా వాడేయాలన్నది బీఆర్‌ఎస్ ప్లాన్‌గా తెలుస్తోంది. వాస్తవానికి గతంలో బీఆర్ఎస్ హయాంలో ఏటా పంట నష్టపోయినా నయాపైసా పరిహారం చెల్లించలేదట. మేం ఇవ్వలేదుసరే మీరు అధికారం వస్తే ఇస్తామని చెప్పిన పరిహారం ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు గులాబీ లీడర్స్. అయితే… రెండు సార్లు నిధులు విడుదల చేశామని చెబుతున్నారు మంత్రి. అవి కలెక్టర్ అకౌంట్‌లో ఉన్నాయి తప్ప రైతుల ఖాతాల్లోకి రాలేదన్నది బీఆర్‌ఎస్ వాదన. ఈ రాజకీయ వివాదాలు, నాయకులు మారడాలు తప్ప మా తలరాత మాత్రం మారలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఏది ఏమైనా… కాళేశ్వరం బ్యాక్ వాటర్‌లో పొలిటికల్ పేలాలు ఏరుకోవడం మాని రైతులకు మేలు చేస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది నియోజకవర్గంలో.