Off The Record: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి విషయంలో వైసీపీ నేతలు పూర్తి స్థాయి మైండ్‌సెట్ మార్చుకున్నారా అంటే….. అవును, వాళ్ళ తాజా మాటలు అదే విషయం చెబుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నాయకులైతే… మూడు రాజధానుల మూడ్ నుంచి పూర్తిగా బయటికి రావడమే కాకుండా….. అధిష్టానం దగ్గర కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి స్థాయి, ఏకైక రాజధానిగా అమరావతికే జై కొట్టాలని డిసైడయ్యారట వాళ్ళంతా. వైసీపీ హయాంలో మూడు రాజధానులు ప్రతిపాదనలు రావటంతోపాటు అమలు ప్రయత్నాలు జరగడంతో.. అమరావతి ప్రాంతంలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. ఎన్నికలు ముగిసి, రాష్ట్రంలో ప్రభుత్వం మారే వరకు అమరావతి ఏరియాలో ఆందోళనలు కొనసాగిన పరిస్థితి. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పరిధిలో ఉన్న రెండు ఉమ్మడి జిల్లాలైన కృష్ణా, గుంటూరులో వైసీపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. అప్పట్లో ఈ ప్రాంత వైసీపీ ప్రజాప్రతినిధులకు రాజధానిని మార్చడం ఇష్టం లేకున్నా.. జగన్‌కు నేరుగా చెప్పే సాహసం చేయలేకపోయారట.
Read Also: Gaddar Awards : గద్దర్ అవార్డ్స్ మెమెంటో రిలీజ్ చేసిన ప్రభుత్వం
నాడు మైలవరం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ అమరావతిని మార్చటం సరికాదని ఒకటి రెండు సార్లు అన్నా… తర్వాత ఆయన కూడా సైలెంట్ అయిపోయారు. మిగతా వాళ్ళు ఎవ్వరూ.. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. అయితే… తర్వాత వచ్చిన ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీ ఖాతా కూడా ఓపెన్ చేయలేకపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీకి ఊహించని ఫలితాలు వచ్చినా…. ఇక్కడ మాత్రం ఆ స్థాయిలో దెబ్బపడటానికి ప్రధాన కారణం అమరావతే అన్న విశ్లేషణలు గట్టిగానే ఉన్నాయి. అంతర్గత చర్చల్లో కూడా పార్టీ నేతలు ఈ అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. దీంతో… ఈ రెండు ఉమ్మడి జిల్లాల వైసీపీ నాయకులు…. ప్రస్తుతం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మళ్ళీ తాము అధికారంలోకి వచ్చినా సరే… రాజధానిని మాత్రం ఇక్కడే కొనసాగిస్తామని గట్టిగా చెప్పాలని, ఇదే విషయాన్ని పార్టీ అధినేత జగన్ దృష్టికి తీసుకువెళ్ళాలనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ అధికారం కోల్పోయి ఏడాది అయింది.
Read Also: Off The Record: రివెంజ్ పాలిటిక్స్ వద్దు.. అభివృద్దే ముఖ్యం అంటున్న మంత్రి..
అటు కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి మాత్రమేనని క్లియర్‌గా చెప్పేసి పునః నిర్మాణ పనులు ప్రారంభించేసింది. కార్యక్రమానికి ప్రధాన మంత్రిని పిలవడం ద్వారా… బలమైన సంకేతాలు పంపింది ప్రభుత్వం. ఇలాంటి సమయంలో… మనం ఇప్పటికీ క్లియర్‌గా చెప్పకుంటే… రాజధాని ఏరియాలో… ఇక పార్టీ కోలుకోలేని దెబ్బ తింటుందన్న అభిప్రాయం పెరుగుతోందట ఇక్కడి నాయకుల్లో. అందుకే మూడు రాజధానుల మూడ్ నుంచి పూర్తిగా బయటికి వచ్చేసి…. లోకల్ వైసీపీ నాయకులు పూర్తిగా అమరావతి స్టాండ్ తీసుకోవాలని డిసైడైనట్టు సమాచారం. మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన తాజా వ్యాఖ్యలు కూడా ఇందులో భాగమేనని చెప్పుకుంటున్నారు. స్థానిక ప్రజల అభిప్రాయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్తామని, తాము ఓడిపోవటానికి ప్రధాన కారణాల్లో రాజధాని అమరావతి అంశం కూడా ఒకటని క్లారిటీగా చెప్పేశారు జోగి. దీంతో… ఇక వైసీపీ టోన్ మారినట్టేనా అన్న చర్చ మొదలైంది పొలిటికల్ సర్కిల్స్‌లో. రాబోయే రోజుల్లో మరింత మంది వైసీపీ నేతలు ఇదే వాదన వినిపించే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతానికైతే… ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ నాయకులు తమలో తాము ఈ విషయాన్ని చర్చించుకుంటున్నారు. మరి పార్టీ అధ్యక్షుడి దృష్టికి తీసుకువెళ్తే… ఆయన ఎలా రియాక్ట్ అవుతారు? అసలు పిల్లి మెడలో గంట కట్టేది ఎవరన్న తర్జన భర్జనలు జరుగుతున్నాయట. మొత్తం మీద రాజధాని వ్యవహారం మరోసారి వైసీపీలో చర్చనీయాంశం అయ్యింది.