Off The Record: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఘాటైన పాలిటిక్స్‌కు కేరాఫ్ జిల్లా గుంటూరు. జిల్లాలో ఏ పార్టీ మెజార్టీ సీట్లలో గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి రావడం ఆనవాయితీగా మారింది. వైసీపీకి మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీలు బలమైన ఓటుబ్యాంక్ గా ఉన్నారు. గుంటూరు జిల్లాలో ఈ సామాజికవర్గాలు గెలుపోటములను ప్రబావితం చేసేస్థాయిలో ఉన్నాయి. ప్రధానంగా వైసీపీకి ఎస్సీ సామాజికవర్గం బలమైన మద్దతుదారులుగా ఉన్నారు. ఉమ్మడి గుంటూరుజిల్లాలో ఎస్సీ రిజర్వుడ్ స్థానాలు మూడు ఉన్నాయి. ప్రత్తిపాడు, తాడికొండ, వేమూరు నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వుడ్ గా ఉన్నాయి. 2019 ఎన్నికల్లో ఈ మూడు స్థానాల్లో వైసీపీ అభ్యర్దులు ఘనవిజయం సాధించారు. అయితే గత ఎన్నికల్లో మాత్రం ఈ మూడు స్థానాల్లో ఓటమి పాలయ్యారు. అయితే ఇప్పుడు ఈ మూడు నియోజకవర్గాల్లో వైసీపీలో జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీకి ఇబ్బందిగా మారాయి. వేమూరు, ప్రత్తిపాడు, తాడికొండ నియోజకవర్గాల్లో వైసీపీలో గ్రూపు విబేధాలు శృతిమించుతున్నాయన్న చర్చ జరుగుతోంది. నియోజకవర్గ సమన్వయకర్తలు మారుతూ వచ్చినా పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు.
2019లో తాడికొండలో వైసీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన ఉండవల్లి శ్రీదేవిని పార్టీ నుంచి బహిష్కరించడంతో డొక్కా మాణిక్యవరప్రసాద్ ను సమన్వయకర్తగా నియమించారు. అయితే గ్రూపు విబేధాలతో తర్వాత కత్తెర సురేష్ నియమితులయ్యారు. ఎన్నికలు వచ్చేసరికి ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా ఉన్న సుచరిత తాడికొండనుంచి పోటీ చేశారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమె సైలెంట్ కావడంతో గుంటూరు కార్పోరేషన్ డిప్యూటీ మేయర్ డైమండ్ బాబును సమన్వయకర్తగా నియమించారు. అయితే ఇప్పటికీ తాడికొండ వైసీపీలో మెజార్టీ నేతలు డైమండ్ బాబు తీరును వ్యతిరేకిస్తూనే వస్తున్నారు.
ఇక ప్రత్తిపాడునుంచి పోటీ చేసి ఓటమిపాలైన బాలసాని కిరణ్ ఇన్ ఛార్జిగా కొనసాగుతున్నారు. ప్రత్తిపాడు నుంచి మూడుసార్లు గెలిచిన సుచరిత ఇప్పుడు నియోజకవర్గంపై దృష్టిపెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. దీనికితోడు ఆమె నియోజకర్గంలో పదేపదే పర్యటిస్తుండటంతో ఆ ప్రచారానికి బలం చేకూరుతోంది. దీంతో అక్కడ కూడా గ్రూపులు మొదలయ్యాయి. సుచరితకు బలమైన పట్టున్న నియోజకవర్గం కావడంతో సాధారణంగా క్యాడర్ కూడా ఆమెతో టచ్ లోకి వెళ్లిపోయారు. దీంతో అక్కడ ఇన్ ఛార్జ్ బలసాని కిరణ్ పరిస్థితి ప్రశ్నార్దకంగా మారింది.
ఇక వేమూరులో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. గత ఎన్నికల్లో వేమూరు నుంచి పోటీచేసిన వరికూటి అశోక్ బాబు టీడీపీ అభ్యర్ది నక్కా ఆనందబాబు చేతిలో ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచి నియోజకవర్గ సమన్వయకర్తగా కొనసాగుతున్నారు. అయితే గతంలో మూడుసార్లు వేమూరునుంచి పోటీచేసిన మాజీ మంత్రి, బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడు మేరుగ నాగార్జున వేమూరుపై కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో వేమూరు వైసీపీ ఇన్ ఛార్జ్ అశోక్ బాబు వర్గంలో అలజడి మొదలయ్యింది. ఇలా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న మూడు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో వైసీపీలో గ్రూపు విబేధాలు ఆ పార్టీకి, నేతలకు తలనొప్పిగా మారాయి. గ్రూపు విబేధాలపై కొంతమంది నేతలు అధిష్టానం దగ్గరకు వెళ్లి ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. పార్టీ పెద్దకు నచ్చచెప్పినా కొంతకాలం సద్దుమణిగినట్లు ఉన్న విబేధాలు మళ్లీ మొదలవుతున్నాయట. చివరికి ఈ కోల్డ్‌వార్ ఎలాంటి మలుపు తిరుగుతుందోనని కేడర్‌లో చర్చ జరుగుతోంది.