Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు పంచాయతీ అంతా.. పదవుల కోసమే. వీలైనంత త్వరలో పిసిసి కమిటీతోపాటు.. కార్పొరేషన్ చైర్మన్స్ ఖాళీలను భర్తీ చేయబోతున్నారు. దీంతో ఆశావాహులంతా పార్టీ నాయకత్వం చుట్టూ తిరుగుతున్నారు. ఎవరి ట్రయల్స్‌లో వాళ్ళు ఉన్నారు. అంతవరకైతే ఫర్లేదుగానీ…. ఏకంగా గాంధీభవన్లో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఛాంబర్ ముందు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు తన కార్యవర్గ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగడం కలకలం రేపుతోంది. మహిళా కాంగ్రెస్ నాయకులకు పదవుల్లో ప్రాధాన్యత దక్కడం లేదన్నది ఆమె ఆరోపణ. అరగంట పాటు మహేష్ గౌడ్ ఛాంబర్ ముందు గలాటా జరిగింది. దీంతో సునీతారావు మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోమంటూ… పార్టీ పెద్దలకు లేఖ రాశారు గాంధీభవన్ వ్యవహారాలు చూసే కుమార్‌రావు. ప్రస్తుతం పార్టీ పదవుల పంపకానికి సంబంధించి చేస్తున్న కసరత్తులో మహిళా కాంగ్రెస్ నుంచి కూడా జాబితా తీసుకున్నారట. ఇంకా పార్టీ కమిటీలు రాలేదు. కార్పొరేషన్ పదవుల భర్తీ కూడా జరగలేదు.
Read Also: India-Pak DGMO Meeting: కాల్పుల విరమణపై మరోసారి కీలక నిర్ణయాలు
ఇంతలోనే…. మహిళా కాంగ్రెస్ నేతలు పిసిసి చీఫ్ చాంబర్ ముందు ధర్నా చేయడాన్ని సీరియస్‌గానే భావిస్తున్నారట పెద్దలు. అటు మీడియాలో సునీతరావు చేసిన కామెంట్స్ పై అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నేరుగా పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ పైననే ఆరోపణలు చేశారామె. పీసీసీ చీఫ్ తనవారికి మాత్రమే పదవులు ఇచ్చుకుంటున్నారని… పేరు చివరన గౌడ్… లేదా రెడ్డి ఉంటేనే పదవులు వస్తాయా అంటూ ప్రశ్నించడంపై కాంగ్రెస్‌లోనే అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయట. ఇది పార్టీ వ్యతిరేక కార్యకలాపంతోపాటు ప్రతిపక్షానికి ఒక అస్త్రం ఇచ్చినట్టు అయిందని మాట్లాడుకుంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. మహిళా కాంగ్రెస్‌లో పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు ఇచ్చి తీరాల్సిందే. అందులో పార్టీ ఈక్వేషన్లు ఎలా ఉన్నా ప్రాధాన్యత కల్పించాల్సిందే. అలాగని సమయం, సందర్భం, ప్రాంతం అన్న విచక్షణ లేకుండా… నేరుగా బయటి వాళ్లు వచ్చి ధర్నాలు చేసినట్టు పార్టీలో అనుబంధ సంఘం ధర్నాకు దిగడమన్నది తీవ్రమైన చర్యగా భావిస్తోందట అధిష్టానం. మహిళా కాంగ్రెస్ నేతలకు ఒకటి రెండు రోజుల్లో షోకాజ్ నోటీసులు ఇవ్వాలనుకుంటున్నట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ మామూలుగానే అంతంతమాత్రం అంటారు.
Read Also: India-Pak DGMO Meeting: కాల్పుల విరమణపై మరోసారి కీలక నిర్ణయాలు
కొద్ది రోజుల నుంచి అది కూడా పూర్తిగా కట్టు తప్పినట్టు కనిపిస్తోందని పార్టీ వర్గాలే చెప్పుకుంటున్న పరిస్థితి. పార్టీ నాయకత్వం చూసీ చూడనట్టు వదిలేయడంవల్లే…. అందరికీ చులకనైపోయామన్న అభిప్రాయం వ్యక్తం అవుతోందట. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు దిగేది ఎవరైనా సరే కఠినంగా వ్యవహరిస్తేనే కంట్రోల్‌లో ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గాంధీభవన్‌లో కాస్త దబాయించి మాట్లాడేవారికి మినహాయింపులు ఉంటాయని, అందుకే ఏకంగా పీసీసీ అధ్యక్షుడి ఛాంబర్ ముందు ధర్నా చేసే దాకా వ్యవహారం వెళ్ళిందన్న చర్చ జరుగుతోంది. కొందరు మాట్లాడితే షో కాజ్ నోటీసులు, పార్టీ నుంచి గెంటివేతలు ఉంటున్నాయి. కానీ మరి కొందరు ఏం మాట్లాడినా చూసీ చూడనట్లు వదిలేస్తున్నారన్న అభిప్రాయం మాత్రం బలంగా ఉందట పార్టీలో. పార్టీ చేస్తున్న పెద్ద పొరపాటు ఇదేనంటున్నారు. అందరూ సమానమేనన్న ఇండికేషన్ ఇస్తే ఎవరికి వారు బాధ్యతగా ఉంటారని చెప్పుకుంటున్నారు. గాంధీభవన్ లో ధర్నా ఒకటే కాదు… అంతకు ముందు మంత్రివర్గ విస్తరణ అంశంలో కూడా ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడారు. అది చినికి చినికి గాలి వానలా మారి ప్రతిపక్షానికి ఒక అస్త్రాన్ని ఇచ్చినట్టు అయింది. ఇలా పార్టీ నాయకులే కాంగ్రెస్ పరువును రోడ్డుకు ఈడుస్తుంటే.. నాయకత్వం ఎందుకు ఉదాసీనంగా ఉంటోందన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్.
Read Also: CM Chandrababu: స్వచ్ఛ పల్లెలతోనే స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధ్యం.. డ్వాక్రా మహిళలకు బాధ్యత..
రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజ్ కూడా వచ్చిన మొదటి రోజే పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదని కఠినంగా చెప్పారు. సమస్యలు ఉంటే నాలుగు గోడల మధ్య చెప్పండని కూడా అన్నారామె. కానీ… ఇప్పుడు ఏకంగా… గాంధీభవన్ లోనే ఆందోళనలు.. సొంత పార్టీ నేతలకు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నా… ఆమె ఎందుకు మౌనంగా ఉన్నారన్న ప్రశ్న వస్తోందట పార్టీ సర్కిల్స్‌లో. పార్టీలో జరుగుతున్న వ్యవహారాలను ఇన్ఛార్జ్ పెద్దగా పట్టించుకోవడం లేదా లేదంటే చూసి చూడనట్టు వదిలేస్తున్నారా అనేది కూడా అర్థం కావడం లేదంటున్నారు. మీనాక్షి నటరాజ్ గాంధీ కుటుంబానికి చాలా దగ్గర మనిషి అని.., పార్టీని గాడిలో పెట్టేందుకే అధిష్టానం ఆమెని ఇక్కడికి పంపిందని అంతా భావించారు. కానీ జరుగుతున్న పరిణామాలు మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయంటున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇప్పటికైనా రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కొరడా ఝుళిపిస్తేనే..మంచిది. లేదంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొందరు నోటికి… మరికొందరు చేతలకు పని చెప్తారు. మొత్తం రచ్చ రచ్చ అయిపోతుందన్న ఆందోళలు వ్యక్తం అవుతున్నాయి.