Off The Record: గద్వాల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మార్పుతో లోకల్ కేడర్‌లో గందరగోళం పెరిగింది. దాంతో నడిగడ్డ కారుకు గట్టి రిపేర్లు చేసి గాడిన పెట్టేందుకు తీవ్ర కసరత్తు చేస్తోందట గులాబీ అధిష్టానం. నెలల తరబడి స్తబ్దుగా ఉన్న గద్వాల్ కేడర్‌లో ఊపు తెచ్చే ప్రయత్నం మొదలైనట్టు తెలుస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…. ఈ నెల 13న గద్వాల్ టూర్ పెట్టుకోవడం వెనక ప్రధాన ఉద్దేశ్యం అదేనని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. తాను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనేనని కృష్ణమోహన్ రెడ్డి టెక్నికల్‌గా మాట్లాడుతున్నా… ఆయన పార్టీని వదిలి వెళ్ళినట్టేనని నమ్ముతున్న అధిష్టానం… పరిస్థితుల్ని చక్కదిద్ది కొత్త జవసత్వాలు నింపే పని మొదలుపెట్టిందట. బండ్ల పార్టీకి దూరంగా ఉంటుండడంతో నాయకుడు లేని క్యాడర్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నెలల తరబడి పార్టీ జిల్లా అధ్యక్షుడుతో పాటు నియోజకవర్గ ఇంచార్జి కూడా లేకపోవడంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు మారిపోయింది. ముగ్గురు, నలుగురు లీడర్లు ఎవరి గ్రూప్‌ని వారు మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. అంతేతప్ప… ఐక్యంగా కార్యకర్తల్లో భరోసా నింపే ప్రయత్నం మాత్రం జరగడం లేదు.
Read Also: Minister Nara Lokesh: జగన్ వ్యాఖ్యలకు మంత్రి లోకేష్ కౌంటర్..
పైగా…ఎవరికి ఎలాంటి బాధ్యతలు అప్పగించకపోవడంతో అంతా అధిష్టానం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఓవైపు పార్టీ ఫిరాయింపులపై సీరియస్‌గా పోరాడుతూనే… అంతే స్థాయిలో డిస్ట్రబ్ అయిన ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తోందట బీఆర్‌ఎస్. అందులో భాగంగానే… గద్వాలను కూడా గాడినపెట్టే పని మొదలైనట్టు చెబుతున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ నియామకం కోసం… హైదరాబాద్ తెలంగాణ భవన్ వేదికగా పలుమార్లు చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. దీనికి తోడు ఇటీవలే జడ్చర్ల పర్యటనలో కేటీఆర్, హరీష్ రావు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం అయినట్లు సమాచారం. ఈ పరిణామ క్రమంలో….13న కేటీఆర్ టూర్‌లోనే కొత్త ఇన్ఛార్జ్‌ని ప్రకటించవచ్చని తెలుస్తోంది. ఆ ప్రకటనతో పార్టీ శ్రేణుల్లో సరికొత్త జోష్ నింపాలన్నది పెద్దల ఆలోచనగా తెలుస్తోంది.
Read Also: 2026 Pongal : తమిళ తంబీల జేబులే టార్గెట్ !
ఇక గద్వాల ఇన్ఛార్జ్ కోసం ఆశావహులు కూడా ఎక్కువగానే ఉన్నారట. ఇప్పుడా పదవి దక్కించుకుంటే… వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా బీ ఫామ్ గ్యారంటీ అన్నది అందరి అభిప్రాయంగా తెలుస్తోంది. అందుకే ఎవరికి వారు తమకు తెలిసిన పెద్దల ద్వారా గట్టిగా లాబీయింగ్ చేస్తున్నారట. ఈ పదవి కోసం ప్రధానంగా… హనుమంత్ నాయుడు, ఆంజనేయులు గౌడ్, కుర్వ విజయ్ పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే అధిష్టానం ఆలోచన మాత్రం మరోలా ఉన్నట్టు తెలుస్తోంది… గతంలో బీఆర్‌ఎస్‌లో ఉండి, ప్రస్తుతం కాంగ్రెస్ గూటికి చేరిన ఓ నేత కోసం మాజీ మంత్రి ఒకరు గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఐతే అధికార పార్టీని వీడేందుకు ఆ నేత అంత సుముఖంగా లేనట్టు సమాచారం. మొత్తం మీద గద్వాల కారుకు రిపేర్స్ చేసి మళ్ళీ రోడ్డెక్కించేందుకు అధిష్టానం గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే… సమర్ధులైన డ్రైవర్‌ని ఎంపిక చేయగలుగుతారా లేదా అన్నదే ఇక్కడ బిగ్ క్వశ్చన్.