Off The Record: 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది తెలుగుదేశం పార్టీ. అదే సమయంలో ఊహించని విధంగా సీట్లు సంపాదించుకున్న ఇద్దరు నాయకులు ఎమ్మెల్యేలవడమేకాదు…నాటి చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రులు కూడా అయ్యారు. అందులో ఒకరు చింతలపూడి నుంచి పీతల సుజాత కాగా… మరొకరు కొవ్వూరు నుంచి కె ఎస్ జవహర్. ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే… సుజాత గనుల శాఖ మంత్రిగా అవకాశాన్ని దక్కించుకోగా…. మంత్రివర్గ విస్తరణలో ఎక్సైజ్ మంత్రి అయ్యారు జవహర్. కానీ… వీళ్ళిద్దరూ ఎంత స్పీడుగా అవకాశాలు దక్కించుకున్నారో తర్వాతి కాలంలో అంతే స్పీడ్‌గా రాజకీయ భవిష్యత్తును డామేజ్ చేసుకున్నారన్న అభిప్రాయం ఉంది రాజకీయ వర్గాల్లో. చింతలపూడి , కొవ్వూరు.. గ్రూపు తగాదాలకు కేరఫ్ అడ్రస్.. అలాంటి చోట్లనుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో నాటి ఇద్దరు మంత్రులు వర్గ పోరుకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు తప్ప భవిష్యత్తు ప్రణాళికలపై ఫోకస్ పెట్టలేకపోయారట. ఫలితంగా మంత్రి పదవులు పోవడమే కాదు.. తర్వాతి ఎన్నికల్లో కనీసం పోటీ చేసే అవకాశం కూడా దక్కలేదు. తిరిగి ఆయా స్థానాల్లో పోటీ చేయాలని ఆ ఇద్దరు నేతలు భావించినా… స్థానిక నాయకులు మాత్రం ఒప్పుకునేదే లేదంటూ పట్టుబట్టి కూర్చున్నారు. వాళ్ళొస్తామంటే… మేం వద్దంటామంటూ రోడ్డు ఎక్కి సైతం ఆ రెండు నియోజకవర్గాల్లో నేతలు, కార్యకర్తలు ఆందోళనలు చేశారు.
దీంతో పార్టీ పెద్దలు ఇద్దరినీ పక్కకు పెట్టక తప్పలేదు. 2019, 24 ఎన్నికల్లో కనీసం వీరికి అవకాశాలు ఇచ్చే దిశగా ఆలోచన కూడా చేయలేదట అధిష్టానం. దీంతో పదేళ్లుగా మాజీ మంత్రులు ఇద్దరూ… జస్ట్ ఎక్స్ మినిస్టర్స్‌గానే మిగిలిపోయారు. కట్ చేస్తే… పదేళ్ళ తర్వాత ఈ మాజీలిద్దరికీ… కనీసం నామినేటెడ్ పోస్టులైనా దక్కుతాయా అన్న సందేహాలు మొదలయ్యాయట కేడర్‌లో. చివరికి జిల్లా స్థాయి పోస్ట్‌లకు కూడా వీళ్ళని పరిగణనలోకి తీసుకోకపోవచ్చని టీడీపీ వర్గాలే మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఎంత స్పీడ్‌గా పైకి వెళ్ళారో అంతే స్పీడ్‌గా కిందపడ్డ ఇద్దరూ… సుదీర్ఘకాలంగా పార్టీలోనే పనిచేస్తున్నా.. ప్రాధాన్యత మాత్రం దక్కడం లేదు. గత ఎన్నికల్లో ఏదోరకంగా , ఎక్కడోచోట పోటీ చేసే అవకాశం దక్కుతుందని చివరి వరకు ఎదురుచూసినా ఫలితం లేకపోయింది. 2024లో సీటు దక్కితే ఎలాగో గెలుస్తాం.. అధికారంలోకి రాగానే మంత్రి పదవి రేస్‌లో తామే ఉంటామని ఊహించుకున్నా మొత్తం జీరో అయింది. మంత్రులుగా పనిచేసిన దశాబ్ద కాలం తర్వాత కూడా… ఒక్క నామినేటెడ్ పోస్ట్ ప్లీజ్ అంటూ…. ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందంటే మాత్రం… ఆ పార్టీ నేతలు చెబుతున్న మాట ఒకటే. అవకాశం వచ్చినప్పుడు సొంత పెత్తనాలు చేయకుండా, గ్రూపు తగదాల్లో వేలు పెట్టకుండా, చెప్పిన పని చేసుకోపోయి ఉంటే ఈ తిప్పలు తప్పేవని అంటున్నారు. సీనియర్ నేతలుగా పేరు ఉన్నా.. అవకాశాలు దక్కించుకోవడంలో మాత్రం వెనుకబడిపోవడంతో ఈ ఇద్దరి రాజకీయ భవిష్యత్తు డైలమాలో పడినట్టే కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
అవకాశం ఇచ్చినప్పుడు ఉపయోగించుకోకుండా.. ఇప్పుడు పార్టీలకు వీర విధేయులుగా వ్యవహరించినా ఫలితం ఉండబోదన్న మాటలు వినిపిస్తున్నాయి. అప్పట్లో పిలిచి మంత్రి పదవులు ఇచ్చిన పార్టీ పెద్దలు కనీసం తమని ఇప్పుడైనా గుర్తించకపోతారా అని మాజీ మంత్రులు ఇద్దరు ఎదురుచూస్తున్నారట. ఏదన్నా నామినేటెడ్ పోస్ట్ ఇవ్వకుంటే మాత్రం… ఇక సైడ్ సైడ్ సైడ్ అన్నట్టేనన్న మాటలు వినిపిస్తున్నాయి పశ్చిమ గోదావరిలో. పార్టీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. నిజంగానే మరో అవకాశం వస్తే మాజీ మంత్రులు ఇద్దరూ పద్ధతి మార్చుకుంటారో లేదో చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు