Off The Record: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోనే కాదు…. మొత్తం ఏపీ పాలిటిక్స్‌లో పరిచయం అక్కరలేని పేరు ధర్మాన ప్రసారావు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా మంత్రిగా పనిచేశారాయన. కాంగ్రెస్, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీల్లో తనదైన మార్క్ రాజకీయాలు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మంత్రి పదవిలో ఉన్న ధర్మాన… ఓటమి తర్వాత పూర్తిగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్ళిపోయారు. ఏడాదిగా బయట ఎక్కడా కనిపించడం లేదాయన. బయటి జనానికే కాదు… చివరికి వైసీపీ ముఖ్య నాయకులకు కూడా అయ్యగారి దర్శనాలు అవడం లేదట. ఫలితాలు వచ్చిన కొత్తల్లోనో, ఆరు నెలల వరకో అంటే ఓకేగానీ… ఇలా ఏళ్ల తరబడి బయటికి రాకుంటే ఎలాగంటూ ఇప్పుడు సిక్కోలు వైసీపీలో చర్చ మొదలైందట. కొత్త ప్రభుత్వానికి కాస్త టైం ఇవ్వాలి , ప్రతి అంశంలో విమర్శలు చేయకూడదని మొదట్లో ధర్మాన చెప్పడంతో అనుచరులు ఏకీభవించారట. కానీ…. ఇప్పుడు పార్టీ అధినేతే డైరెక్ట్‌గా బయటికి వచ్చి… క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తుంటే… ఆయన మాత్రం గడప దాటకపోవడం ఏంటని సొంత కేడరే అసహనంగా ఉన్నట్టు సమాచారం.
Read Also: Off The Record: కాంగ్రెస్ పీఏసీలో జగ్గారెడ్డి హాట్ కామెంట్స్.. ఆంతర్యమేంటి..?
ప్రతిపక్షంలోకి వచ్చాక ఇప్పటి వరకు వైసీపీ అధిష్టానం పిలుపునిచ్చిన ఏ ఒక్క కార్యక్రమంలోనూ పాల్గొనలేదు ధర్మాన.దీంతో క్యాడర్‌కు రాంగ్ సిగ్నల్స్ వెళ్తున్నాయట. రాజకీయ పార్టీలన్నాక అధికారం రావడం, పోవడం సహజం. పైగా సుదీర్ఘ కాలం రాజకీయాలు నడిపిన ధర్మాన ప్రసాదరావు లాంటి నాయకులకు అది తెలియంది కాదు. ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన నాయకుడు… ఇప్పుడు ఇలా ఎందుకు ఉన్నారంటూ అటు పొలిటికల్ సర్కిల్స్‌లో కూడా చర్చ నడుస్తోందట. ఎన్నికలకు ముందే…. రాజకీయాలపై ఆసక్తి పోయిందని మాట్లాడ్డం, ముగిసి ఏడాది గడిచినా… బయటకు రాకపోవడంతో… అసలాయన అంతరంగం ఏంటో అర్ధం కావడం లేదంటున్నారు వైసీపీ కార్యకర్తలు. తాజాగా జరిగిన యువత పోరు, అంతకు ముందు వెన్నుపోటు దినం కార్యక్రమాలను శ్రీకాకుళం ద్వితీయ శ్రేణి నేతలు పెద్ద ఎత్తున నిర్వహించారు. కానీ ఎక్కడా ధర్మాన కనిపించలేదు. తన సీనియారిటీకి అవి చిన్న కార్యక్రమాలు, బయటకు రాకూడదని అనుకున్నా… కనీసం…బ్యాకెండ్‌లో ఉండి పార్టీని నడిపించవచ్చు కదా.. ఆ పని కూడా చేయకుంటే ఎలాగన్న ప్రశ్నలు వస్తున్నాయట.
Read Also: Off The Record: కాంగ్రెస్ పీఏసీలో జగ్గారెడ్డి హాట్ కామెంట్స్.. ఆంతర్యమేంటి..?
ఎవరికీ అందుబాటులో లేకుండా, ఏం చేయాలనుకుంటున్నారో చెప్పకుండా ఉంటే… మేమెలా అర్ధం చేసుకోవాలంటూ కింది స్థాయి నాయకులు నిష్ఠురంగా ప్రశ్నిస్తున్నారట. పార్టీ జిల్లా ఇన్ఛార్జ్‌లు, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్‌ల్లాంటి వాళ్ళు ఎవరొచ్చినా… ఆయన ఇంటికెళ్ళి కలవడం తప్ప… సదరు సీనియర్ మాత్రం ఏ మీటింగ్‌కు వెళ్ళకపోవడం ఏంటో అర్ధం కావడం లేదని రాజకీయ వర్గాల్లో సైతం చర్చ నడుస్తోందట. ఇది ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతుందో, అసలు ఆయన పార్టీలో ఉంటారో లేదో తెలియటంలేదట. తనకు వీలుకాకుంటే…నియోజకవర్గంలో కనీసం వర్కింగ్ ప్రసిడెంట్‌గా
ఎవరికైనా బాధ్యతలు ఇస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోందట. మాజీ ఎంపిపి అంబటి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ మెంటాడ పద్మావతి లాంటి వారికి బాధ్యతలు అప్పగించినా సరిపోతుందని కింది స్థాయి నేతలు అధిష్టానానికి సూచిస్తున్నారట. ధర్మాన ప్రసాదరావు సంగతి సరే…. కనీసం ఆయన కుమారుడు రామ్ మనోహర్ నాయుడు సైతం బయటకు రాకపోవడం, వాళ్ళు జనసేనలోకి వెళ్తారన్న ప్రచారాన్నిఖండించకపోవడం చూస్తుంటే… ఎక్కడో తేడా కొడుతున్నట్టు అనిపిస్తోందంటన్నాయి రాజకీయ వర్గాలు. వాళ్ళ ఉద్దేశ్యాలు ఎలా ఉన్నా… నియోజకవర్గ బాధ్యతలు మరో నేతకు అప్పగిస్తేనే… శ్రీకాకుళంలో వైసీపీ బతుకుతుందని అంటున్నారు కార్యకర్తలు.