Off The Record: కృష్ణాజిల్లా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆఫీస్ వ్యవహారాల గురించి ఇప్పుడు తెగ గుసగుసలాడేసుకుంటున్నారు నియోజకవర్గంలో. సప్త సముద్రాలు ఈదిన గజ ఈతగాడు పిల్ల కాలువలో పడి కాళ్ళు విరగ్గొట్టుకున్నట్టుంది ఆయనగారి వ్యవహారం అంటూ సెటైర్స్ వేసేవాళ్ళు కూడా పెరుగుతున్నారు. ఇంతకీ.. మేటర్ ఏంటంటే….. ఈ ఎన్నారై టర్న్‌డ్ ఎమ్మెల్యే గెలిచాక గుడివాడలో ఒక ఆఫీస్ ఓపెన్ చేశారు. తాను అందుబాటులో లేని సమయంలో రకరకాల పనుల కోసం వచ్చే నియోజకవర్గ ప్రజలకు సాయపడాలన్నది అసలు ఉద్దేశ్యం. కానీ….. చివరికి అదే ఆఫీస్ పలు అక్రమాలకు వేదికైందట. ముఖ్యంగా ఎమ్మెల్యేకు సన్నిహితంగా విధులు నిర్వహించే సిబ్బంది చేస్తున్న పనుల గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. వాళ్ళ వ్యవహారాలు హద్దులు దాటాయనేది లోకల్ టాక్. నియోజకవర్గంలో రేషన్ బియ్యాన్ని మాఫియాకు అమ్మడం కోసం… లోకల్‌గా ఉండే ఓ బియ్యం డాన్‌తో ఎమ్మెల్యే ఆఫీస్‌లోని కీలకమైన వ్యక్తి చేతులు కలిపారన్న గుసగుసలు ఉన్నాయి. లోకల్ రేషన్ డీలర్లంతా మారు మాట లేకుండా ఆ డాన్‌కు పీడీఎస్ బియ్యం ఇస్తేసరి. లేదంటే మాత్రం కేసులు బుక్ అవుతాయని కూడా హెచ్చరించారట.
ఇక గుడివాడ నియోజకవర్గంలో చెరువుల పూడికలు, మట్టి తవ్వకాలు చేపట్టాలన్నా కూడా ఎమ్మెల్యే కార్యాలయంలోని ఆ వ్యక్తి చెయ్యి పడాల్సిందేనంటున్నారు. పోలీస్ స్టేషన్లలో సెటిల్ మెంట్లు, బెల్టు షాపులకు సంబంధించి ఎక్సైజ్ శాఖ అధికారులకు కూడా ఇతనే ఆదేశాలు జారీ చేస్తున్నారన్నది ఇంటర్నల్ టాక్. ఎమ్మెల్యే ఆఫీస్‌కు సహాయం కోసం వచ్చే వారి కంటే…. తనకు పైసలు దండిగా వచ్చే పనులపైనే ఆఫీస్‌లోని సదరు వ్యక్తి సీరియస్‌గా దృష్టి పెడతారట. అధికారుల బదిలీలు మొదలు పోస్టింగుల వరకు ఇతనే రేట్లు ఫిక్స్ చేసిమరీ వసూలు చేస్తారన్న మాట గట్టిగా వినిపిస్తోంది. వెనిగండ్ల రాముకు అత్యంత సన్నిహితుడినని చెప్పుకుంటూ నియోజకవర్గంలో ప్రతి పనికి రేటు కట్టి మరీ వసూలు చేస్తున్న వ్యవహారం ఇప్పుడు నియోజకవర్గమంతా చర్చగా మారింది. అత్యంత సన్నిహితుడు చేస్తున్నాడంటే….. అందులో ఎమ్మెల్యేకు కూడా వాటా లేకుండా ఉంటుందా ఏంటి…? అంటూ లాజిక్ లాగేవాళ్ళు కూడా పెరుగుతున్నారు గుడివాడలో. వసూళ్ళ సొమ్ము ఆయనకు ముడుతోందా లేదా అన్న దాంతో సంబంధం లేకుండా… ఎమ్మెల్యే మాత్రం బాగా బద్నాం అవుతున్నారన్నది గుడివాడ టాక్. ఇక నియోజకవర్గంలో మట్టి తరలింపుకు సంబంధించి కూడా అనుమతుల పేరుతో దందా చేస్తున్నట్టు తెలుస్తోంది. అతని వ్యవహారాలు అలా ఉంటే… ఇక ఎమ్మెల్యేకి బంధువునని చెప్పుకునే మరో వ్యక్తిది ఇంకో లెవల్. సదరు బంధువు ఏకంగా ఎమ్మెల్యే సిఫారసు లేఖల్ని కూడా అమ్మేసుకుంటున్నారట. ఈ రకంగా ఎవరి పరిధిలో వాళ్ళు, ఎవరికి అందినంత వాళ్లు దోచేసుకుంటున్న వ్యవహారం కాస్త ఆలస్యంగా ఎమ్మెల్యేకి చేరినట్టు తెలుస్తోంది. దీంతో నష్టనివారణ చర్యలపై ఫోకస్ పెట్టినా…. ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో అర్ధంకాని గందరగోళంలో ఉన్నారట. వీళ్ళని ఇలా వదిలేస్తే నన్ను భ్రష్టు పట్టిస్తారు.
అలాగని ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకుంటే… ఇన్నాళ్లు వాళ్ళు దోపిడీకి పాల్పడ్డట్టు అంగీకరించినట్టు అవుతుందనుకుంటూ… టైం కోసం చూస్తున్నట్టు సమాచారం. ఏది ఏమైనా ఈ వ్యవహారాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదన్న ఉద్దేశ్యంతో… టోటల్‌గా ఆఫీస్ స్టాఫ్ మొత్తాన్ని మార్చేసి…ఎన్నికల సమయంలో పనిచేసిన వెనిగండ్ల ఛారిటబుల్ ట్రస్ట్ టీంను ఇక్కడికి తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకేసారి అందర్నీ మార్చేస్తే… ప్రత్యేకంగా ఒక్కొక్కరి వ్యవహారాల గురించి వివరణలు ఇవ్వాల్సిన అవసరం ఉండబోదని ఆలోచిస్తున్నారట ఎమ్మెల్యే. అయితే… ఆ తొలగింపులు కూడా ఇప్పటికిప్పుడు చేయకుండా…అడ్డగోలు మనుషుల్ని ముందు కట్టడి చేసి… మెల్లిగా మార్చేసే ప్రతిపాదన ఉందని అంటున్నారు. వెనిగండ్ల రాము ఇప్పటికే లోకల్‌గా తన వ్యక్తిగత బాధ్యతల్ని వేరే వారికి అప్పగించినట్టు తెలిసింది. ఇక సంక్రాంతి తర్వాత పూర్తి స్థాయి ప్రక్షాళన ఉండవచ్చని అంటున్నారు. అయితే… ఆఫీస్ సిబ్బంది మధ్య వాటాల పంపకంలో తేడాలు రావటంతోనే ఇది రచ్చకెక్కిందని, ఎమ్మెల్యేకు తెలియకుండానే సిబ్బంది వసూళ్ళ దందాకు దిగుతారా అనే చర్చ కూడా ఉంది లోకల్ పొలిటికల్ సర్కిల్స్‌లో. ఇంత జరిగాక ఎమ్మెల్యే రాము తీసుకుంటున్న నష్టనివారణ చర్యలు చేతులు బాగా…. కాలిపోయాక ఆకులు పట్టుకున్నట్టుగా ఉన్నాయన్న సెటైర్స్ సైతం వినిపిస్తున్నాయి.