OTR : చిన్ని-కొలికపూడి కథలో కొత్త మలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాళ్ళిద్దరి మధ్య కొత్త ప్రేమలు చిగురిస్తున్నాయా? పొలిటికల్ పొలాల్లో సరికొత్త మొలకలొచ్చాయా? పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి మారిపోయిందా? పరస్పర బర్త్‌డే విషెస్ మారుతున్న వాతావరణాన్ని సూచిస్తున్నాయా? ఆ సానుకూలత వాట్సాప్ స్టేటస్‌లలోనే ఆగిపోతుందా? లేక గ్రౌండ్ రియాలిటీకి వస్తుందా? ఎవరా ఎంపీ, ఎమ్మెల్యే? ఏవా సరికొత్త రాజకీయ ప్రేమ సందేశాలు? విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మధ్య ఇన్నాళ్ళు ఉప్పు నిప్పులా ఉన్న పరిస్థితులు మారుతున్న సంకేతాలందుతున్నాయి. విభేదాలు సమసిపోతున్నట్టే కనిపిస్తోందని టీడీపీ వర్గాలే అంటున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలై… చినికి చినికి గాలివానగా మారి పూడ్చలేమనుకున్న స్థాయిలో పొలిటికల్ అగాధం పెరిగిపోయింది. గత ఎన్నికల్లో తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మొదట వేరే వారిని అనుకున్నప్పటికీ చివరి క్షణంలో పలు రకాల లెక్కలేసుకుని కొలికపూడిని తెరమీదకు తీసుకువచ్చింది టీడీపీ. ఆ విషయంలో కేశినేని చిన్ని చొరవ తీసుకుని పార్టీ బీ ఫామ్ ఇప్పించారన్నది స్థానికంగా చెప్పుకునే మాట. ఎన్నికల్లో కూడా కొలికపూడికి అన్ని విధాలుగా చిన్ని శిబిరం సహాయ సహకారాలు అందించింది. దీంతో… ఆయన మొదటి విడతలోనే ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆ తర్వాత నుంచి క్రమంగా…. ఇద్దరి మధ్య వ్యవహారం బెడిసి కొట్టడంతో చివరికి అది పార్టీ అధిష్టానానికే తలనొప్పిగా మారిపోయింది. రెండేళ్ళుగా ఇద్దరి మధ్య ఇదే తంతు జరుగుతున్నా, అధిష్టానం జోక్యం చేసుకున్నా…. సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. అయితే…కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, పరిస్థితులు కూడా ప్రతిసారి తేడాకావన్నట్టు… ప్రస్తుతం ఇద్దరి మధ్య సయోధ్య కుదురుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే శ్రీనివాస్ మధ్య కొన్నాళ్లుగా మాటలు కూడా కరువయ్యాయన్నది బయటికి కనిపిస్తున్న వ్యవహారం. ఎంపీ తన నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటున్నారంటూ కొలికపూడి ఆరోపించడం, ఆ తర్వాత మాటలు హద్దులు మీరడం లాంటివి అధిష్టానం ఆగ్రహానికి కారణమయ్యాయని కూడా చెబుతారు. ఆ విషయంలో ఇద్దర్నీ పిలిచి పార్టీ కమిటీ వివరణ కోరింది. ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో కొలికపూడి పార్టీ టార్గెట్ గా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. అదలా నడుస్తుండగానే… తాజాగా కేశినేని చిన్ని పుట్టిన రోజు సందర్భంగా కొలికపూడి పెట్టుకున్న వాట్సాప్ స్టేటస్ అందరి దృష్టిని ఆకర్షించింది.
చిన్నికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ తన వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నారాయన. దాని గురించి అందరూ ఆసక్తిగా మాట్లాడుకుంటున్న టైంలోనే రెండు రోజుల క్రితం కొలికపూడి శ్రీనివాస్ పుట్టినరోజు కావటంతో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఎంపీ చిన్ని కూడా అదే స్టైల్లో వాట్సప్ స్టేటస్ పెట్టారు. దీంతో ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందన్న చర్చ మొదలైంది రాజకీయవర్గాల్లో. పరస్పరం జన్మదిన శుభాకాంక్షలు చెప్పు కోవడాన్ని బట్టి చూస్తుంటే….కచ్చితంగా సయోధ్య కుదిరి ఉంటుందనే అంటున్నాయి రాజకీయవర్గాలు. అయితే దీనిపై రెండు వర్గాలు ఇప్పటికీ పెదవి విప్పలేదట. ఎమ్మెల్యేగా కొలికపూడి శ్రీనివాస్ గెలిచిన తర్వాత తిరువూరు టీడీపీ సీనియర్ నేతలు కొందరు ఇబ్బంది పడ్డారన్న అభిప్రాయం బలంగా ఉంది. అయితే.. పరిధికి మించి వ్యవహరించటంతోనే… ఎమ్మెల్యే వారికి అడ్డుకట్ట వేసేలా వ్యవహరించారన్నది ఆయన వర్గం మాట. ఈ క్రమంలో….. ఎమ్మెల్యే వల్ల ఇబ్బంది పడిన నేతలు ఎంపీ వర్గంగా పనిచేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరూ కలిసి పనిచేయాల్సిందేనని అధిష్టానం గట్టిగా చెప్పిందట. అందుకే ఇద్దరూ భేషజాలను పక్కన పెట్టి కలిసి పనిచేయటానికి వీలుగా… పుట్టిన రోజు శుభాకాంక్షల రూపంలో లైన్ క్లియర్ చేసుకతున్నారన్న విశ్లేషణలున్నాయి. అయితే… ఇన్ని గొడవల తర్వాత వాళ్ళిద్దరూ ఠక్కున కలిసిపోతే పోవచ్చు, భుజం భుజం రాసుకోవచ్చుగానీ…. కింది స్థాయిలో ఇబ్బందులు పడ్డవాళ్ళ మనసులు అంత తేలిగ్గా కలుస్తాయా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అదే సమయంలో ముందు ప్రధాన సమస్య పరిష్కారం అయింది కాబట్టి….ఇవాళ కాకుంటే రేపైనా…. కేడర్ సెట్ అవుతుందన్న మాటలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏర్పడ్డ సామరస్య వాతావరణం ఇలాగే కొనసాగుతుందా? లేక వాట్సాప్ స్టేటస్‌లలోనే ఆగిపోతుందా అన్నది తేలాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందేనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Also Read
తాజావార్తలు
-
Rain Alert: ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజుల పాటు వర్షాలు!
-
Shruti Haasan: AI డీప్‌ఫేక్‌లపై శృతి హాసన్‌కు హైకోర్టు రక్షణ.. కీలక ఆదేశాలు!
-
Redmi 17 5G: రెడ్ మీ 17 5G భారత్‌లో లాంచ్.. 7900mAh బ్యాటరీ.. 50MP కెమెరా!.. ధర, ఫీచర్లు ఇవే
-
Gargi story Explained: నరమేధపు నేలపై పూసిన గులాబీ! 200 ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో పుట్టిన తొలి ఆడపిల్ల!
-
Warangal Politics: కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లోకి వరంగల్ రాజకీయాలు.. గుండు సుధారాణి పదవితో కొత్త అలక!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!