Off The Record: పదేళ్ళు అధికారంలో ఉండి ప్రతిపక్షంలోకి వచ్చిన బీఆర్‌ఎస్… తిరిగి పుంజుకుని జనాల్లో ఉండడానికి సరికొత్త ప్లానింగ్‌లో ఉందట. ఏది ఏమైనా సరే… ప్రభుత్వం మీద పోరాటం విషయంలో వెనక్కి తగ్గకూడదని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు తెలిసింది. అందుకు తగ్గట్టే ముందస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయట. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ… వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే… కొన్ని సందర్భాల్లో కేసులు పెట్టే పరిస్థితులు తలెత్తుతున్నాయని, అలాంటి సందర్భాల్లో… కేడర్ వెనక్కి తగ్గకుండా వాళ్ళకు భరోసా ఇవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. తమ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకుల మీద ప్రభుత్వం కేసులు పెడితే… ఎదుర్కొనేందుకు స్పెషల్ లీగల్ టీమ్‌ని సిద్ధం చేసినట్టు సమాచారం. దీనిద్వారా… ఏం ఫర్లేదు, మీరు దూసుకుపోండి. ఏదన్నా అయితే మేం చూసుకుంటామని చెబుతున్నారట పార్టీ పెద్దలు. పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ నుంచి ఈ కొత్త లీగల్ వింగ్ ఆపరేట్ అవుతోందట.
బీఆర్ఎస్ తరుపున మాట్లాడే, సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టే వారిపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని, అలాంటి వాటిని ఎదుర్కోవడానికి ఈ లీగల్ టీమ్ ఉపయోగపడుతుందని, కేడర్‌కు నిజంగా ఇదో భరోసాయేనని అంటున్నారు గులాబీ లీడర్స్. ఆ మధ్య బీఆర్‌ఎస్ సోషల్ మీడియా విభాగంలో కీలకంగా ఉండే కొణతం దిలీప్, అంతకు ముందు బాల్క సుమన్, క్రిశాంక్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళ మీద బుక్ అయిన కేసుల్లో వెంటనే బెయిల్స్ వచ్చేలా ఈ లీగల్ టీమ్ పనిచేసినట్టు చెప్పుకుంటున్నారు. పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎపిసోడ్‌లో కూడా కొత్త లీగల్ టీమ్‌దే కీలకపాత్ర అన్నది బీఆర్‌ఎస్ వాయిస్. ఇలా వరుసగా తమ నేతలకు, కార్యకర్తలకు అండగా ఉంటున్న పార్టీ న్యాయ విభాగాన్ని ఇంకా విస్తరించాలన్న ప్లాన్ ఉందట. కేవలం పార్టీకే పరిమితం అవకుండా… ప్రభుత్వం మీద కొట్లాడే సామాన్య ప్రజలకు కూడా లీగల్ సపోర్ట్ ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అలా చేస్తే… రాజకీయంగా కూడా అది పార్టీకి కలిసి వస్తుందని భావిస్తున్నారట బీఆర్‌ఎస్ పెద్దలు. అందుకోసం తెలంగాణ భవన్‌లో ఒక ప్రత్యేక విభాగం ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారట.
ఇటీవల హైడ్రా బాధితులు కోర్టులో కేసులు వేయడానికి ఈ లీగల్ టీమ్ సహకరించింది. దీనితో వందల సంఖ్యలో బాధితులు తెలంగాణ భవన్ కు వచ్చారు. ఆ తరువాత లగచర్ల ఘటన లో అరెస్ట్ అయిన వారి తరుపున కూడా కోర్టులో బీఆర్‌ఎస్ లీగల్ టీమ్ వాళ్లే వాదించారు. ఇలా పార్టీ వాళ్లకు మాత్రమే కాకుండా బయట వాళ్లకు కూడా ఉచిత సర్వీస్ అందించడం ద్వారా…ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టే ప్లాన్‌లో ఉన్నట్టు సమాచారం. మెల్లిగా విషయం ఆనోట ఈ నోట పాకుతుంటడంతో… ప్రభుత్వం సమస్యలు కాకుండా… వ్యక్తిగత ఇబ్బందులు ఉన్నవాళ్లు కూడా న్యాయ సలహాల కోసం తెలంగాణ భవన్‌కు క్యూ కడుతున్నారట. అలాంటి వాళ్ళని కూడా కాదనకుండా న్యాయ సహాయం అందిస్తే… ఒక్కసారి సమస్య పరిష్కారం అయితే… వాళ్ళు జీవితాంతం గులాబీ జెండాను మర్చిపోరన్నది పార్టీ అధిష్టానం ఆలోచనగా తెలుస్తోంది. అందుకే ఖర్చు అయినా లీగల్ సపోర్ట్ ఇస్తున్నారట. అయితే… ఇలా ఎంతవరకు సపోర్ట్ అన్న విషంయంలో మాత్రం క్లారిటీ లేదు. ఇప్పటికే కొన్ని రాజకీయ పరమైన కేసుల్లో బెయిల్ వచ్చే వరకు సపోర్ట్ చేసింది బీఆర్‌ఎస్ లీగల్ టీమ్. కానీ…. ఆ తర్వాత కేసు ఫాలోఅప్ విషయంలో పట్టించుకోలేదని, చేస్తే ఫుల్ సపోర్ట్ చేయాలి కదా అంటూ వాపోతున్నారట కొందరు. ఈ పరిస్థితుల్లో గులాబీ లీగల్ ఎక్సపెరిమెంట్ సక్సెస్ అవుతుందా? లేక బూమరాంగ్ అవుతుందా అన్నది తేలాలంటే… మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.