Off The Record: బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్ రాజా సింగ్… ఈ మధ్య పార్టీ విషయంలో అంతకు మించి అన్నట్టు ఉంటున్నారట. తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న రాజా.. కొందరు రాష్ట్ర పార్టీ నాయకుల మీదే డైరెక్ట్ అటాక్ చేస్తూ… అయామ్ ఫైర్.. అయామ్ ది ఫైర్ అంటున్నారట. నన్ను పార్టీ నుంచి పంపించే కుట్ర చేస్తున్నారు, ఏం.. ఉండనీయదల్చుకోలేదా అంటూ పబ్లిక్‌గానే ప్రశ్నిస్తున్నారాయన. ఇక పనిలో పనిగా బీసీ కార్డ్ కూడా బయటికి తీశారు. తెలంగాణ బీజేపీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని, అంతా రెడ్ల ఆధిపత్యమే నడుస్తోందంటూ.. క్యాస్ట్ వార్‌కు తెర లేపారాయన. గోల్కొండ, గోషామహల్ జిల్లాల అధ్యక్షులుగా తాను చెప్పిన వారిని కాకుండా.. అసలు వద్దన్న వారిని నియమించడంతో.. రగిలిపోతున్నారట రాజాసింగ్. ఆ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళినా.. పట్టించుకోకపోవడంతో ఆయనలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతున్నట్టు సమాచారం.
పెద్దోళ్ళు పిలిచి సముదాయిస్తారని ఆశించినా.. అలాంటి వాతావరణం ఏదీ కనిపించకపోగా.. లైట్ తీసుకోవడాన్ని గోషామహల్ ఎమ్మెల్యే జీర్ణించుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. ఆ అసహనంతోనే.. రాష్ట్ర పార్టీలో కొందరు నాయకులు టార్గెట్‌గా రెచ్చిపోతున్నారట. అసలాయన కామెంట్స్ చూస్తుంటే మతి పోతోందని అంటున్నారు కొందరు కాషాయ నేతలు. ఇన్నాళ్ళు ఎక్స్ మెసేజ్‌లకే పరిమితం అయిన రాజాసింగ్…. ఇప్పుడిక డైరెక్ట్‌గా ఓపెనైపోతున్నారట. తెలంగాణలో హిందువులు సేఫ్‌గా ఉండాలంటే ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ రావాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారాయన. ఈ టైంలో అలాంటి మాటలు ఎందుకు మాట్లాడారని ఆరా తీస్తే… అసలు విషయం బయటపడిందట. అది విన్న కొందరు ఔరా.. ఎక్కడి నుంచి ఎక్కడికి ముడిపెట్టారు? ఎట్నుంచి ఎటు లాగారంటూ ముక్కున వేలేసుకుంటున్నారట. తెలంగాణలో హిందువులు సేఫ్‌గా ఉండాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని.. బీజేపీ అలా అధికారంలోకి రావాలంటే.. పార్టీలో పాత సామానును బయటపడేయాలంటూ.. తాను టార్గెట్‌గా పెట్టుకున్న కొందరు నేతల్ని పార్టీ నుంచి పంపేయాలన్న అర్ధం వచ్చేలా మాట్లారట. పైగా కేంద్ర పార్టీ పెద్దలు ఈ విషయాన్ని సీరియస్‌గా ఆలోచించాలంటూ… వాళ్ళకు కూడా ఓ ఉచిత సలహా పడేశారు ఎమ్మెల్యే. ఈ వ్యాఖ్యల్ని గమనిస్తున్న విశ్లేషకులు మాత్రం, రాజా…నువ్వు మామూలోడివి కాదు, మీ పార్టీ నాయకత్వాన్ని మార్చడానికి, తెలంగాణలో హిందువుల భద్రతకు ముడిపెట్టావుకదయ్యా…… మనం ఏం మాట్లాడినా.. తిరిగి తిరిగి అక్కడికి పోవాల్సిందేనా అని కామెంట్ చేస్తున్నారట.
తెలంగాణలో ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ ముఖ్యమంత్రితో రాష్ట్ర బీజేపీ నేతలు కొందరు సీక్రెట్ మీటింగ్స్ పెట్టుకుంటారు. అలాంటి మీటింగ్స్ పెట్టుకునే వాళ్ళు ఉంటే… రాష్ట్రంలో పార్టీ ఎప్పటికైనా అధికారంలోకి వస్తదా అని కూడా రాజాసింగ్ ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. ఇది నా పార్టీ, నా అయ్య పార్టీ అనుకునే వాళ్ళు వెళ్ళిపోతేనే తెలంగాణ బీజేపీకి మంచిరోజులంటూ సీరియస్ కామెంట్సే చేశారు గోషామహల్ ఎమ్మెల్యే. దీంతో ఆయన ఎవరిని ఉద్దేశించి అంత పెద్ద మాటలు అన్నారన్న చర్చ జరుగుతోంది తెలంగాణ కాషాయదళంలో. అయితే ఘాటుగా మాట్లాడే క్రమంలో పరిధిదాటి ఓ బూతు అర్ధం వచ్చే పదం వాడటంపై సీరియస్‌గానే ఉన్నారట పార్టీ ముఖ్యులు. దానికి సంబంధించి చర్యలు తీసుకోవచ్చన్న అంచనాలున్నాయి. రాజాసింగ్ మాటల్ని కేంద్ర పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళి సీరియస్‌గానే రియాక్ట్ కావచ్చంటున్నారు. తెలంగాణ కమల దళంలో పరిస్థితులు ఎలా మారతాయో చూడాలి మరి.