Off The Record: అల్లు అర్జున్-సంధ్య థియేటర్ ఎపిసోడ్…తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. అదే స్థాయిలో రాజకీయంగా రచ్చ ముదురుతోంది. అల్లు అర్జున్ తప్పు ఒప్పులపై డిస్కషన్ నడుస్తుంది. ప్రభుత్వమైతే…ఈ అంశాన్ని సీరియస్‌గానే తీసుకుంది. అల్లు అర్జున్‌కి మానవత్వమే లేదని మండిపడుతోంది. సినిమా చూడటానికి వచ్చిన మహిళ…తొక్కిసలాటలో మృతి చెందితే…సినీ పరిశ్రమ స్పందించదా…? అల్లు అర్జున్‌ను మాత్రం ఒకరి తర్వాత ఒకరు పరామర్శిస్తారా ? అదే బాధితురాలు కుమారుడు…చావుబతుకులతో కొట్టామిట్టాడుతుంటే…ఒక్కరు స్పందించరా ? ఎవరైనా హాస్పిటల్‌కు వెళ్లారా ? అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగని సీఎం రేవంత్‌రెడ్డి…అల్లు అర్జున్ ఏం చేశాడని ఆయనకు పరామర్శలు ? కన్నుపోయిందా ? కాలు పోయిందా అంటూ ప్రశ్నించారు. అయితే ఈ ఎపిసోడ్‌లో ప్రభుత్వ తీరుపై బీజేపీ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. బన్నీకి సపోర్ట్‌కి కాషాయ పార్టీ మాట్లాడుతోంది. అయన పట్ల రాష్ర్ట ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎంపీ డీకే అరుణ లాంటి నేతలు…అల్లు అర్జున్ అంశంలో ప్రభుత్వ తీరును తప్పు పట్టారు.
Read Also: Joe Biden: అమెరికా అధ్యక్షుడు కీలక నిర్ణయం.. 37 మందికి క్షమాభిక్ష
బీజేపీ ఎందుకు…అల్లు అర్జున్‌కు సపోర్టు చేసేలా మాట్లాడుతుందనే చర్చ జనాల్లో జరుగుతోంది. మహిళ మరణించడం బాధాకరం అంటూనే…ఆ మహిళ కుటుంబాన్ని ప్రభుత్వం, అల్లు అర్జున్ పట్టించుకోవాలని కాషాయ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆ రోజు ఆ సంఘటన జరిగి ఉండాల్సింది కాదని అంటున్న కమలం నేతలు…అనుమతి లేకున్నా అయనను ఎలా రోడ్ షో చేయించారని ప్రశ్నిస్తున్నారు. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు చేస్తే….ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. అక్కడ ప్రభుత్వం, పోలీసులు…తమ బాధ్యత నిర్వర్తించడంలో విఫలం అయ్యారని అంటోంది. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది బీజేపీ నేతలు విమర్శించారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయని…కానీ ప్రభుత్వం ఇలా వ్యవహరించలేదని గుర్తు చేస్తున్నారు. దీని వెనుక ఏదో మతలబు ఉందనే అనుమానాన్ని ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీలో ఆ అంశాన్ని ఎంఐఎం ప్రస్తావించడం, ఎజెండాలో లేకున్నా…ఈ ఇష్యూ పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సుదీర్ఘంగా మాట్లాడడం వెనుక కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కోర్టులో ఉన్న అంశంపై ప్రభుత్వం, సీఎం అసెంబ్లీలో ఎలా మాట్లాడుతారని ప్రశ్నిస్తున్నారు. ఏదైనా ఉంటే కోర్టుకి ఇవ్వాలి కదా అని నిలదీస్తున్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనను… కాంగ్రెస్ సర్కార్ రాజకీయం చేయాలని అనుకోవడం కరెక్ట్ కాదని అంటున్నారు.