Off The Record: శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మీదికి మరో అస్త్రం సంధించారు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. వైసీపీలో ఉన్న శిల్పా.. జనసేనలో చేరేందుకు లోలోపల ప్రయత్నాలు చేసుకుంటున్నారంటూ పెద్ద బాంబే పేల్చారు. టీడీపీతోనూ మంతనాలు జరుపుతున్నారని, ఆయన మీద కేసులు పడకుండా కొందరు తెలుగుదేశం నాయకులు రక్షిస్తున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఉమ్మడి కర్నూల్ జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల్లో ఇప్పుడిదే చర్చనీయాంశం అయింది. టీడీపీలోకి రావడానికి ప్రయతిస్తే మంత్రి లోకేష్ , తాను అడ్డుకుంటామని కూడా చెప్పుకొచ్చారు అఖిప్రియ. జనసేనలో చేరడానికి ప్రయత్నం చేయడం లేదని చెప్పగలరా అంటూ శిల్పా చక్రపాణికి సవాల్ కూడా విసిరారు ఆమె. దీంతో శిల్పా నిజంగానే గాజు గ్లాస్ పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారా అనే చర్చ మొదలైంది. ఆయన్ని సపోర్ట్ చేస్తున్న టీడీపీ నేతలు ఎవరు?’ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి కొత్తగా. అఖిలప్రియ ఇంతలా మాట్లాడుతున్నారంటే… అసలు వీళ్ళిద్దరికీ ఎక్కడ చెడిందని ఆరాలు తీసేవాళ్ళు కూడా పెరుగుతున్నారు. ఈ మధ్య కాలంలో తరచూ శిల్పా చక్రపాణి రెడ్డి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారట భూమా అఖిల.
ఇద్దరూ ఒకే నియోజకవర్గంలో రాజకీయం చేయకున్నా.. తరచూ ఈ స్థాయిలో విమర్శలు విమర్శలు చేయడం వెనుక కారణం ఏంటి అని ఆరా తీస్తున్నారట. ఆళ్లగడ్డలో రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారు శిల్పా చక్రపాణిరెడ్డి. ఇందులో ప్రభుత్వ భూమి కబ్జా చేసారంటూ టీడీపీ అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే ఆరోపించారు ఎమ్మెల్యే అఖిల. అసెంబ్లీ సమావేశాల్లోనూ శిల్పా రియల్ ఎస్టేట్ వెంచర్ గురించి ప్రస్తావించారు. వెంచర్‌లో కేసీ కెనాల్ బ్రాంచ్ కాలువలు ఉన్నాయని, ప్రభుత్వ భూమి ఆక్రమించి, కాలువని మళ్లించి వెంచర్ వేశారంటూ అప్పట్లో అసెంబ్లీలో ప్రస్తావించారు ఎమ్మెల్యే. 7 వేల ఎకరాలకు సాగునీరు అందించే కాలువను మళ్లిస్తే ఎలాగన్నది ఆమె క్వశ్చన్. ఇదే విషయమై శిల్పా చక్రపాణి అక్రమాల పై చర్య తప్పదంటూ నెల క్రితం కూడా నంద్యాలలో హెచ్చరించారట. ఇక తాజాగాచేసిన వ్యాఖ్యలతో మరోసారి వ్యవహారం వేడెక్కింది. శిల్పా వెంచర్ అక్రమాలంటూ అఖిల ఆరోపణలు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేదు. నిబంధనల ప్రకారమే కాలువకు ప్రత్యామ్నాయంగా స్థలం ఇచ్చి వెంచర్ వేశామని, అధికారులు, ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చారని, అయినాసరే.. మళ్లీ మళ్లీ అవే ఆరోపణలు చేయడం ఏంటనేది చక్రపాణి రెడ్డి వాదన అట. తమ సొంత ఖర్చులతోనే కాలువ నిర్మించాలన్న నీటిపారుదల శాఖ అధికారుల కండిషన్లను అనుసరించే వెంచర్ వేశామని చెబుతున్నట్టు సమాచారం.
వెంచర్ కారణంగా ఒక్క రైతు కూడా నష్టపోయే పరిస్థితి లేదని, గతంలో ఎన్ని ఎకరాలకు సాగునీరు అందుతుందో , ఇపుడు కూడా అంతే ఆయకట్టు ఉందన్నది ఆయన వెర్షన్. పైగా ఇదంతా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే , తగిన అనుమతులతో చేశామని చెబుతున్నారట ఆయన. అఖిల ప్రియ ఏం ఆశించి తమపై ఆరోపణలు చేస్తున్నారో, అక్రమాలు ఉంటే ఎందుకు నిరూపించలేదని ప్రశ్నిస్తున్నారు శిల్పా. ఎమ్మెల్యే అఖిలప్రియ ఏదో ఆశించి తనని టార్గెట్ చేస్తున్నారని, అలాంటి విషయాల్లో తామేమీ చేయలేమని ఆయన అంటున్నట్టు తెలుస్తోంది. పద్ధతిగా మాట్లాడేవాళ్లకు అయితే సమాధానం చెప్పచ్చని, వితండవాదం చేసే వాళ్ళతో వాదన అవసరం లేదంటున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే… వెంచర్‌తో సంబంధం లేకుండా చక్రపాణి రెడ్డి జనసేన వైపు చూస్తున్నారన్న పాయింట్‌ని తెర మీదికి తీసుకురావడం ద్వారా ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేయాలనుకుంటున్నారా అన్న చర్చ జరుగుతోంది నంద్యాల జిల్లాలో. అటు వైసీపీ పెద్దలు కూడా శిల్పా కదలికలపై ఆరా తీసే పని మొదలుపెట్టినట్టు సమాచారం. ఇప్పుడు చక్రపాణిరెడ్డి పొలిటికల్‌గా ఉక్కిరి బిక్కిరి అవుతారా? నిజంగానే జనసేనలో చేరతారా? వెంచర్ వ్యవహారాల్లో రాజీ కుదుర్చుకుంటారా వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందేనంటున్నారు పొలిటికల్ పండిట్స్.