Off The Record: ఇటీవల పార్టీ సమావేశంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో పనిచేస్తున్న కలెక్టర్లను ఉద్దేశించి ఆయన ఈ మాటలు అన్నారు. కేవలం ఏదో ఆరోపణలు.. విమర్శలకు పరిమితం కాకుండా.. ఆ IAS అధికారులపై ఫిర్యాదు చేస్తామని.. వారు చేస్తున్న అక్రమాలను ఆధారాలతో సహా బయట పెడతామని సంజయ్ చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేసిన ఆరోపణలు ఎలా ఉన్నా.. అసలు సంజయ్‌కు వారిపై సమాచారం ఇస్తున్నది ఎవరు అనేది చర్చ. బలమైన ఆధారాలు లేకపోతే ఈ స్థాయిలో కలెక్టర్లపై సంజయ్ విరుచుకు పడబోరని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. కేవలం ఫిర్యాదుల వరకే ఆగకుండా.. వారిపై లీగల్‌గా కూడా వెళ్తామని ఆయన చెప్పారు. దాంతో సంజయ్ దగ్గర ఉన్న సమచారం ఏంటి? ఆయన గురిపెట్టిన కలెక్టర్లు ఎవరు? అని ఆరా తీస్తున్నారట. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు సంజయ్‌కు కలెక్టర్ల గురించి సమాచారం ఇస్తోంది ఎవరు అనేది మరో ప్రశ్న. తెలంగాణలో పనిచేస్తున్న కొందరు IASలే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఆ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ ఆధికారులు ఇప్పటికీ బీజేపీ నేతతో టచ్‌లో ఉన్నారని.. మరింత కీలక సమాచారాన్ని ఇప్పటికీ ఇస్తున్నారని టాక్.
Read Also: Off The Record: టెక్కలిలో వైసీపీ ప్రయోగాలు విఫలం..? ముగ్గురు కీలక నేతలు మూడు గ్రూపులు
ఆ కలెక్టర్లు చేస్తున్న పనులు చూసి తట్టుకోలేకపోతున్న IASలే బీజేపీకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని చెవులు కొరుక్కుంటున్నారు. ఈ అంశంపై అధికారవర్గాలతోపాటు బీజేపీలోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. అక్రమాలు జరుగుతున్నాయని భావించి.. వాటికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే సమాచారం ఇచ్చారని కొందరు కమలనాథులు వారిని వెనకేసుకొస్తున్నారట. ప్రస్తుతం సంజయ్ కేవలం నలుగురు కలెక్టర్ల గురించే మాట్లాడారని.. రానున్న రోజుల్లో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని.. బీజేపీ భావిస్తున్న అక్రమార్కుల జాబితాలో మరికొందరు IAS పేర్లు చేరతాయని చెబుతున్నారట. అన్నీ కోడ్రీకరించి ఆ సమాచారాన్ని ఢిల్లీలో DOPTకి అందజేయాలనే ఆలోచనలో సంజయ్ ఉన్నారట. దీంతో బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్న IASలు ఎవరనే ఆరాలు మొదలయ్యాయి.