Off The Record: ప్రకాశం జిల్లా ఒంగోలు నగర పాలక సంస్థలో వైసీపీ కార్పొరేటర్ల మధ్య వార్ కొత్త టర్న్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు అందరూ వైసిపి కార్పొరేటర్లే అయినప్పటికీ ఎన్నికల అనంతర పరిణామాలతో మేయర్ సహా కొందరు కార్పొరేటర్లు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో పసుపు కండువాలు వేసుకున్నారు. తదనంతర పరిణామాలతో వైసీపీ కీలక నేతగా వ్యవహరించిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీని వీడి జనసేనలో చేరారు. దీంతో ఆయన వెంట నడిచేందుకు మెజారిటీ వైసీపీ కార్పొరేటర్లు సిద్ధమయ్యారట. అసలు చిక్కు ఇక్కడే వచ్చిపడిందని అంటున్నారు. బాలినేని జనసేనలో చేరడాన్ని మొదట్నుంచి తీవ్రంగా వ్యతిరేకించారు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల. అయినాసరే… బాలినేని పార్టీ మారక కూడా… ఇద్దరి మధ్య అదే స్థాయిలో రైవలరీ ఉందన్నది ఒంగోలులో ఓపెన్ టాక్. ఈ పరిణామాల మధ్య ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డితో సంబంధాలున్న 15 మంది వైసీపీ కార్పొరేటర్లు జనసేనలో చేరేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే, ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 50 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అందులో 41 మంది వైసీపీ, ఆరుగురు టీడీపీ, ఇద్దరు ఇండిపెండెంట్, ఒకరు జనసేన తరఫున గెలిచారు.. ఇండిపెండెంట్లుగా గెలిచిన ఇద్దరు కూడా అప్పట్లో వైసీపీకే మద్దతుగా నిలవటంతో ఆ పార్టీ బలం 43కు చేరింది. వారితో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఒంగోలు, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు, ఒంగోలు ఎంపీ కూడా ఉండటంతో నాడు వైసీపీని టచ్ చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అయితే ఎన్నికల అనంతరం పరిస్థితి మొత్తం రివర్స్ అయ్యింది. 20 మంది వైసీపీ, ఓ ఇండిపెండెంట్ కార్పొరేటర్ టీడీపీలో చేరిపోయారు. వాళ్ళకు తోడు కూటమి పార్టీల తరపున గెలిచిన కార్పొరేటర్స్, ఎక్స్ అఫిషియో బలం కలుపుకుంటే.. బలం 31కి పెరిగింది. అనధికారికంగా మేయర్ కూడా టీడీపీకి జై కొట్టడంతో కార్పొరేషన్ అధికార పార్టీ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇంత వరకు ఓకే అనుకున్నా అసలు కథ ఆ తర్వాతే మొదలైందని అంటున్నారు. టీడీపీలో చేరిపోగా మిగిలిన వైసీపీ కొర్పొరేటర్స్ మాజీమంత్రి బాలినేనికి టచ్ లోకి వెళ్ళిపోయారట. వాళ్ళంతా జనసేనలోకి వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. అదే జరిగితే… కార్పొరేషన్‌లో బలాబలాలు మారిపోయి తమ పెత్తనానికి గండి పడుతుందని తెలుగుదేశం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
అందుకే.. జనసేనలోకి వెళ్ళవద్దంటూ… వైసీపీ కార్పొరేటర్ల మీద వత్తిడి తెస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. వీరందరూ బాలినేనితో కలసి నడిస్తే టీడీపీలోకి వెళ్లిన ఇతర కార్పొరేటర్లు కూడా తిరిగి ఆయన చెంతకు చేరే ప్రమాదం ఉందని కూడా అంచనా వేస్తున్నారట టీడీపీ లీడర్స్. అలా జరిగితే కార్పొరేషన్ జనసేన చేతికి వెళ్తుంది. ఇక తమకు పట్టు పోతుందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వర్గం భావిస్తోందట. అందుకే దీంతో మీరు జనసేనకు వెళ్ళటానికి వీల్లేదంటూ వ్యవహారం బెదిరింపుల దాకా వెళ్లినట్లు టాక్ నడుస్తోంది. వాస్తవంగా ఈనెల 5వ తేదీనే పవన్ కల్యాణ్ సమక్షంలో వీరంతా జనసేనలో చేరాల్సి ఉంది. అయితే పవన్ షెడ్యూల్ లో మార్పుల కారణంగా వాయిదా పడింది. ఇదే అదునుగా టీడీపీ లోకి వెళ్లిన వైసీపీ కార్పొరేటర్లు అందివచ్చిన అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు సిద్ధమయ్యారట. రెండూ కూటమి పార్టీలే అయినప్పటికీ ఆ ఇద్దరు నేతల మధ్య వార్ పీక్ స్టేజీ వెళ్లటంతోనే వ్యవహారం ఇంతదాకా వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. పెద్ద నేతలు ఇద్దరు గుంభనంగా ఉన్నప్పటికీ త్వరలో బ్లాస్ట్ అవటం ఖాయమని అంచనా వేస్తున్నారు. అటు జనసేనకు వచ్చే కార్పొరేటర్లని వద్దంటూ బెదిరించడంపై బాలినేని కూడా సీరియస్ గానే ఉన్నట్లు సమాచారం. దీంతో ఇప్పుడు పవన్‌కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఒంగోలు కార్పొరేషన్ పాలిటిక్స్ ఏ మలుపు తిరుగుతాయో చూడాలి మరి.